Suryaa.co.in

Telangana

టీఆర్ఎస్ దాష్టికాలపై బీజేపీ సమర శంఖం

-రేపు పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ నిరసన దీక్ష
-అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసన ర్యాలీలు
-సాయిగణేష్ సూసైడ్ పై సీబీఐ విచారణ కు డిమాండ్
-గవర్నర్ ను కలవనున్న రాష్ట్ర నేతలు

రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్న అధికార పార్టీ ఆగడాలపై భారతీయ జనతా పార్టీ సమర శంఖం పూరించింది. అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలుసహా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాష్టికాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిరసన కార్యక్రమలకు సిద్ధమైంది.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గద్వాల జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు సాయంత్రం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్ లు, రాష్ట్ర నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఖమ్మం టౌన్ లో టీఆర్ఎస్ నేతలు, పోలీసుల వేధింపులకు తాళలేక సూసైడ్ చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేష్ తోపాటు కొత్తగూడెంలో స్థానిక ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేందర్ వేధింపులకు ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న రామక్రిష్ణ దంపతుల ఉదంతాన్ని సంజయ్ ఈ సందర్భంగా వివరించారు.

దీంతోపాటు రామాయంపేటలో టీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ సహా ఆ పార్టీ నేతల బెదిరింపులకు భయపడి సూసైడ్ చేసుకున్న గంగం సంతోష్, అతని తల్లి లాడ్జీలో ఉరేసుకుని చనిపోయిన అంశాన్ని ప్రస్తావించారు. అట్లాగే కూకుట్ పల్లిలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ… చర్యలు తీసుకోకపోతే చావే శరణ్యమంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని బండి సంజయ్ వివరించారు.

అట్లాగే సూర్యాపేట జిల్లా కోదాడలో స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు, మైనారిటీ యువకుడు తన స్నేహితులతో కలిసి అమాయక యువతికి మత్తు మందు ఇచ్చి రోజుల తరబడి సామూహిక అత్యాచారం చేస్తూ చిత్రహింసలకు గురైన ఉదంతాన్ని వివరించారు.
‘‘సీఎం కేసీఆర్… పేపర్లలో, టీవీల్లో వార్తలొస్తే.. పబ్లిసిటీ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు నటిస్తారే తప్ప పబ్లిక్ కోసం మాత్రం పనిచేయడం లేదు. సీఎం ఏమీ అనడం లేదు కాబట్టి మమ్ముల్ని ఎవరూ ఏమీ చేయలేరనే భావనతో కొందరు టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోతున్నరు. ఇలాంటి లుచ్చాగాళ్లను నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’అని అన్నారు.

‘‘రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అధికార పార్టీ రాజకీయ ఆగడాలను ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా టిఆర్ఎస్ దాష్టీకాలు, హత్యలు, అత్యాచారాలకు నిరసనగా రేపు (20-04-2022) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో వేలాది మందితో నల్లజెండాలు చేతపట్టి బిజెపి నిరసన ర్యాలీలు చేయాలి. ప్రతి ఒక్క కార్యకర్త ఈ నిరసనలో పాల్గొనాలి’’అని పిలుపునిచ్చారు.

‘‘పాదయాత్రలో ఉన్నందున ర్యాలీలు నిర్వహించే అవకాశం లేనందున…. గద్వాల నియోజకవర్గంలోని సడ్డలోనిపల్లెలోని ప్రజా సంగ్రామ యాత్రా శిబిరం వద్ద రేపు ఉదయం 9 నుంచి 9:30 గంటల వరకు నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో నేను నిరసన దీక్ష చేస్తా’’నని ప్రకటించారు.

అట్లాగే ‘‘అధికార పార్టీ ఆగడాలను వివరించడంతోపాటు బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యసహా టీఆర్ఎస్ దాష్టికాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రేపు పార్టీ రాష్ట్ర నేతలు గవర్నర్ తమిళసై ని కలిసి వినతి పత్రం అందజేస్తారు.’’ అని తెలిపారు.

LEAVE A RESPONSE