Suryaa.co.in

Editorial

ఇక బీజేపీ…జై అమరావతి!

– 21న రైతుల పాదయాత్రలో బీజేపీ అగ్రనేతలు
– అమిత్‌షా అక్షింతలతో కదిలిన ఏపీ కమలరథం
– నెల్లూరు జిల్లాలో పాల్గొననున్న బీజేపీ సీనియర్లు
– అమరావతిపై ఫలించిన సుజనా మంత్రాంగం
( మార్తి సుబ్రహ్మణ్యం)
అనుభవం అయితే గానీ తత్వం బోధపడదన్నది తెలుగులో ఓ సామెత. ఏపీ బీజేపీ నాయకత్వం విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. అమరావతికి మద్దతుగా, గత నాయకత్వం అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించాలన్న సీనియర్ల డిమాండును.. సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ నాయకత్వం పెడచెవిన పెట్టింది. పైగా అమరావతి రైతు ఉద్యమాన్ని, రైతులను పెయిడ్ ఆర్టిస్టులు, పెట్టుడు ఉద్యమం, ఆ ఉద్యమంతో టీడీపీకే లాభమంటూ సీనియర్ల నోళ్లు మూయించింది. మీడియాలో అమరావతి ఉద్యమానికి అనుకూలంగా మాట్లాడిన వారిని, వ్యాసాలు రాసిన వారిని సస్పెండ్లు చేసింది. అయితే తాజాగా… కేంద్రహోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర నాయకత్వం తీరుపై కన్నెర్ర చేయడంతో దారికి రావలసివచ్చింది. గతంలో అమరావతికి అనుకూలంగా చేసిన తీర్మానాన్నే మళ్లీ దుమ్ముదులిపి, రైతు ఉద్యమంలో పాల్గొనాలని నిర్ణయించింది. ఈ మొత్తం పరిణామాల్లో కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి నడిపిన మంత్రాంగం ఫలించింది.
అమరావతిలోనే రాజధాని ఉండాలని, మూడు రాజధానులు వద్దంటూ అమరావతి రైతులు నిర్వహిస్తున్న ‘న్యాయస్థానం టు దేవస్థానం పాతయాత్ర’లో పాల్గొనాలని, ఏపీ బీజేపీ ఎట్టకేలకూ నిర్ణయించింది. ఈనెల 21న నెల్లూరు జిల్లాలో జరిగే పాదయాత్రలో.. పార్టీకి చెందిన సీనియర్లు పాల్గొనడం ద్వారా, బీజేపీ కూడా అమరావతి ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతునిస్తున్న సంకేతాలివ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు గురువారం రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీనియర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిసింది.
అటు పార్టీ కూడా ఈ విషయాన్ని అధికారికంగానే ధృవీకరించింది. ఈ పాదయాత్రలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి, కార్యదర్శి సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సుజనాచౌదరి, సీఎం రమేష్ పాల్గొంటారని ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల అమిత్‌షా తిరుపతి పర్యటనలో అమరావతి ప్రస్తావన వచ్చిన సందర్భంలో.. ఆ అంశంపై నాయకత్వ వైఖరిని అమిత్‌షా తప్పుపట్టారు. రైతుల పాదయాత్రలో ఎందుకు పాల్గొనడం లేదు? వెళ్లిన వారిని సంజాయిషీ ఎందుకు అడుగుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అమరావతి రైతుల పాదయాత్ర వల్ల టీడీపీకే లాభం ఉంటుందన్న జీవీఎల్, సోము వాదనను అమిత్‌ష్ తప్పుపట్టారు. ‘మీరు దూరంగా ఉంటే టీడీపీనే లాభపడుతుంది. మీరూ పాల్గొంటే రైతులు మీవెంట కూడా వస్తారు.
ఉద్యమాలకు రాజకీయ పార్టీ దూరంగా ఉండటం మంచిదికాద’ని క్లాసు పీకిన విషయం తెలిసిందే. చివరాఖరలో అమరావతికి అనుకూలంగా, గతంలో పార్టీ చేసిన తీర్మానాన్ని అమలుచేయాల్సిందేనని ఖరాఖండిగా తేల్చారు. ఇకపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా జాతీయ పార్టీ కార్యదర్శి సత్యకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరితో కలసి తీసుకోవాలని స్పష్టం చేశారు.
అయితే.. అమిత్‌షా ఆదేశాల తర్వాత కూడా నాయకత్వంలో చలనం లేకపోవడంతో, అగ్రనేతలు మళ్లీ ఆ విషయాన్ని కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. దానితో అయిష్టంగానయినా రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగాల్సి వచ్చింది. దాని ఫలితమే ఈనెల 21న పాదయాత్రలో పాల్గొనాలన్న నిర్ణయమని పార్టీ వర్గాలు విశ్లేషించాయి.
ఇంతోటి దానికి సస్పెన్షన్లు.. సంజాయిషీలెందుకు?
కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత.. అప్పుడు అమరావతిపై చేసిన అనుకూల తీర్మానాన్ని, ‘సోము వీర్రాజు త్రయం’ అటకెక్కించింది. జీవీఎల్-విష్ణువర్దన్‌రెడ్డి అయితే పలు ప్రెస్‌మీట్లు, టీవీ చర్చావేదిల్లో అమరావతి రైతులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. ఆ సందర్భంలోనే కొలికపూడి శ్రీనివాసరావు ఏబీఎన్ చర్చలో పాల్గొన్న విష్ణువర్దన్‌రెడ్డిపై చెప్పుతో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది.
సోము బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. అమరావతి ఉద్యమానికి మద్దతుగా పత్రికల్లో వ్యాసాలు రాసినందుకు, ఏపీ బలిజనాడు కన్వీనర్ కూడా అయిన నాటి బీజేపీ నేత.. ఓ.వి.రమణపై తొలివేటు వేశారు. తర్వాత అమరావతి రైతు సభలో తన చెప్పుతో తాను కొట్టుకున్నందుకు, పార్టీ ఆఫీసుకు భూమికూడా విరాళంగా ఇచ్చిన వెలగపూడి గోపాలకృష్ణను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మరికొందరినీ సస్పెండ్ చేశారు.
అమరావతిపై పార్టీ వైఖరినే స్పష్టం చేసిన తనను సస్పెండ్ చేయడం, మతిలేని నిర్ణయమని ఓవి రమణ అప్పుడే విమర్శించారు. ఆ తర్వాత అధికార ప్రతినిధి లంకాదినకర్‌పై సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ, కేంద్ర పార్టీ ఆదేశాలతో మళ్లీ ఆయనను తీసుకోలేక తప్పలేదు. వీరందరినీ అమరావతికి అనుకూలంగా మాట్లాడినందుకే సోము వీర్రాజు సస్పెండ్ చేయడం విశేషం.
తాజాగా కొద్దిరోజుల క్రితం మొదలయిన అమరావతి రైతుల పాదయాత్రలో.. పార్టీ సీనియర్లు రావెల కిశోర్‌బాబు, పాతూరి నాగభూషణం, జయప్రకాష్ పాల్గొన్నారు. రావెల అయితే ఆరురోజుల పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో సోము వీర్రాజు ఆయనకు ఫోన్ చేసి, పాదయాత్రలో పాల్గొనడానికి పార్టీ నుంచి అనుమతి లేదని స్పష్టం చేయడంతో, ఆయన వెనుతిరిగాల్సి వచ్చింది. అదేవిధంగా మిగిలిన వారికి సునీల్ దియోధర్ ఫోన్ చేసి, పాదయాత్రకు ఎందుకు వెళ్లారని సంజాయిషీ అడిగారు. అమిత్‌షా తిరుపతికి వచ్చినప్పుడు, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి ఈ విషయాన్ని అమిత్‌షాకు ఫిర్యాదు చేయడం, అందుకాయన సునీల్-సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిపోయింది. అది వేరే విషయం.
అయితే.. పార్టీ నాయకత్వం, మళ్లీ అదే అమరావతి అంశానికి మద్దతుగా వ్యవహరించాలని నిర్ణయించడంతో, అదే అంశంపై మాట్లాడిన నాయకులను సస్పెండ్ చేయడం తప్పని స్పష్టమయింది. ‘‘ఈ విషయంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయం తొందరపాటని ఇప్పుడు తేలిపోయింది. అప్పుడాయన కో ఇన్చార్జి, ఒక ఎంపీ మాటలు విని వాళ్లను సస్పెండ్ చేశారు. మరిప్పుడు అమరావతిపై మళ్లీ మేం అనుకూలవాదన లేవనెత్తుతున్నాం. అంటే నాయకత్వం అవగాహన లేకుండా తీసుకునే నిర్ణయాలకు నాయకులు బలి కావాలా?’ అని ఓ సీనియర్ నేత ప్రశ్నించారు.
చక్రం తిప్పిన సుజనాచౌదరి
కాగా అమరావతికి అనుకూలంగా వ్యవహరించాలంటూ.. చాలాకాలం నుంచీ వాదిస్తున్న బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ప్రయత్నాలు, తాజా నిర్ణయంతో ఫలించిన ట్టయింది. అమరావతి రైతు ఉద్యమంలో పాల్గొనడం ద్వారా.. బీజేపీని విస్తరించే అవకాశం ఉంటుందని, పార్టీ నాయకత్వం దానిని విస్మరించినందుకే టీడీపీ రాజకీయంగా లాభపడుతోందని నద్దా, అమిత్‌షా, సంతోష్‌జీలకు ఆయన ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. వారి నుంచి ఆశించినంత స్పందన లేకపోవడం, సునీల్-సోము-జీవీఎల్ తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చకపోవడంతో, కొద్దికాలం నుంచీ సుజనా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే.. తన ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో.. సునీల్ దియోధర్, ‘టీడీపీకి బీజేపీ పార్కింగ్ ప్లేస్‌కాద’ని చేసిన వ్యాఖ్య సుజనాకు మనస్తాపం కలిగించాయి. ఈ విషయం తాడో పేడో తేల్చుకునేందుకు ప్రయత్నించగా, తాను తిరుపతి వచ్చినప్పుడు సమస్య పరిష్కరిస్తానని అమిత్‌షా హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే అమిత్‌షా తిరుపతి పర్యటనలోనే.. రాష్ట్ర బీజేపీ నాయకత్వ వ్యవహారశైలి, సునీల్-సోము వీర్రాజు పనితీరుపై ఫిర్యాదు చేయటం, అమిత్‌షా కూడా సుజనా ప్రస్తావించిన అంశాలపైనే సోము-సునీల్‌ను వివరణ కోరడం చకచకా జరిగిపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో.. సుజనా చౌదరి చక్రం తిప్పడం వల్లే, ఏపీ బీజేపీ కాస్త గాడిలో పడిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE