Suryaa.co.in

Editorial

సోముపై బీజేపీ సీనియర్ల ఫిర్యాదు?

– లిక్కర్‌పై చీప్‌గా మాట్లాడి పరువు తీశారు
– హోదాపై మాట్లాడవద్దన్నా మాట్లాడుతున్నారు
– కేటీఆర్ ట్వీట్‌తో మా పరువు పోయిందంటున్న తెలంగాణ బీజేపీ నేతలు
– మరోవైపు అదే మీ జాతీయ విధానమా అని విపక్షాల ప్రశ్నలు
– ఢిల్లీకి తలనొప్పి సృష్టించిన సోము వీర్రాజు
( మార్తి సుబ్రహ్మణ్యం)

తాము అధికారం లోకి వస్తే చీప్ లిక్కర్ బాటిల్‌ను 50 రూపాయలకే అమ్ముతామంటూ ప్రజాగ్రహ వేదికగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన ప్రకటన, ఇప్పుడు ఆ పార్టీ జాతీయ నాయకత్వాన్ని చిక్కుల్లో పడేసింది. ఆయన ప్రకటనపై ఏపీలోని విపక్షాలే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కూడా ట్విట్టర్ వేదికా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుండటంతో, బీజేపీ నాయకత్వం తలపట్టుకోవలసి వచ్చింది. కాగా, తన నోటితో పార్టీని ఇరికించిన సోముపై చర్య తీసుకోవాలని కోరుతూ, ఏపీ బీజేపీ సీనియర్లు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఏపీ సీఎం జగన్ రెండున్నరేళ్ల పాలనా వైఫల్యాలపై బీజేపీ విజయవాడలో నిర్వహించిన ప్రజాగ్రహ సభ ఆశించిన స్థాయిలో విజయవంతం కావడంపై పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమయింది. సుమారు 3 వేల మంది వివిధ జిల్లాల నుంచి హాజరయిన ఆ సభ సక్రమంగా జరిగి ఉంటే, వైసీపీ సర్కారుకు అది ఒక హెచ్చరిక సంకేతంగా ఉండేదని, అయితే, సోము వీర్రాజు గంటసేపు చేసిన సుదీర్ఘ ప్రసంగం పార్టీ పరువు తీసిందని పార్టీ వర్గాలు తలపట్టుకున్నాయి. అసలు ప్రజాగ్రహ సభ ఎందుకు నిర్వహించామన్న విషయాన్ని వివరించకుండా, సీపీఐ, ప్రత్యేక హోదా, మంత్రి పేర్ని నానిపై విమర్శలు చేసిన వీర్రాజు బహిరంగసభ లక్ష్యాన్ని స్వయంగా దెబ్బతీశారని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

పైగా కోడిగుడ్లు, చీప్ లిక్కర్ గురించి మాట్లాడి తన స్థాయితోపాటు, పార్టీ స్థాయి కూడా తగ్గించారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచీ కోడిగుడ్ల గురించి మాట్లాడుతున్న ఆయనను, సోషల్ మీడియా తెగ అవహేళన చేస్తోంది. దానిపై బోలెడు జోకులు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అటు పార్టీ శ్రేణులు కూడా వీర్రాజు కోడిగుడ్ల గురించి ఇంకా మాట్లాడటం లేదేంటని వ్యంగ్యాస్త్రాలు సంధించుకోవడం ఇటీవల కాలంలో అలవాటయిపోయింది. అయినా ఆయన కోడిగుడ్ల గురించి మాట్లాడుతూనే ఉండటం పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. కానీ ప్రకాష్ జవదేకర్ వంటి జాతీయ నేత హాజరయిన సభలో కూడా అలాంటి స్థాయి తక్కువ అంశం గురించి మాట్లాడి, సమయం వృధా చేశారని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు కోడిగుడ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు, కింద కార్యకర్తలు కోడిగుడ్డు సైజును చేతితో చూపించారంటే, ఆ అంశం పార్టీలో ఎంత వెటకారంగా మారిందో అర్ధం చేసుకోవచ్చని కృష్ణా జిల్లాకు చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు.

కోడిగుడ్ల అంశంతోనే పార్టీని కామెడీగా మార్చిన తమ అధ్యక్షుడు, చీప్ లిక్కర్ వంటి సీరియస్ అంశాన్ని ప్రస్తావించి మొత్తం జాతీయ స్థాయిలో పార్టీని ఇరికించారని సీనియర్లు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. వీర్రాజు వ్యాఖ్యల తర్వాత ఆయనపై సోషల్‌మీడియా సెటైర్ల వర్షం మొదలయింది. ఆయన చీప్ లిక్కర్ అమ్మేలా గ్రాపిక్ చేసిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీలో బీజేపీ అధికారంలోకి వ స్తే చీప్ లిక్కర్ 70 రూపాయలకే ఇస్తామని, ఆర్థిక పరిస్థితి ఇంకా సహకరిస్తే 50 రూపాయలకే ఇస్తామని

వీర్రాజు చేసిన ప్రకటన, వేదికపై ఉన్న సీనియర్ల పక్కలో బాంబు వేసినంత పనయింది. ఒకవైపు మద్యంపై పోరాడుతూ, ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తున్న బీజేపీ, మరోవైపు తాము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామనడం, రాష్ట్రంలో తాగుబోతుల సంఖ్యపై లెక్కలేయడం వంటి అనవసర అంశాల ప్రస్తావన ద్వారా, పార్టీని అడ్డంగా ఇరికించారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోము గంటసేపు మాట్లాడటం వల్ల జాతీయ నేత సత్యకుమార్, పురందీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి వంటి నేతలకు ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం దక్కకుండా పోయిందని పార్టీ వర్గాలు చెప్పాయి. వీర్రాజు అప్రస్తుత ప్రసంగంతో చాలామంది మధ్యలోనే వెళ్లిపోతే, జాతీయ నేత సత్యకుమార్ చేసిన ప్రసంగం సభ పరువు నిలబెట్టింది. ఆయనను ముందుగా మాట్లాడించి ఉంటే, సభ హాట్‌గా ఉండేది. కానీ మా అధ్యక్షుడి పనికిమాలిన కోడిగుడ్లు, లిక్కర్ హామీ వల్ల సభ సమయమంతా వృధా అయింది. మేం రాజమండ్రి నుంచి ఖర్చులు పెట్టి వచ్చింది ఇందుకా అనిపించింద’ని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ నేత అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా సున్నితమైన ప్రత్యేక హోదా అనేది గతించిన అంశమయినందున దానిపై మాట్లాడకూడదని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూడా సందర్భం వచ్చినప్పుడే మాట్లాడాలని కోర్ కమిటీలో తీర్మానించినప్పటికీ, స్వయంగా అధ్యక్షుడే వాటిని ధిక్కరించడంపై సీనియర్లు విస్మయం వ్యక్తమయింది. ‘ నిన్న విజయవాడలో మా అధ్యక్షుడికి ఏం పూనిందో, గంటసేపు అలా ఎందుకు మాట్లాడారో మాకూ అర్ధం కావడం లేదు. కమ్యూనిస్టులకు రాష్ట్రంలో బతుకు లేదు. వాళ్ల గురించి, విద్యార్థి సంఘాల గురించి ఆయన అంతసేపు ఎందుకు మాట్లాడినట్లో అర్ధం కాలేదు. పైగా చందాల గురించి ఎందుకు మాట్లాడారో అర్ధం కాలేదు. ప్రజాగ్రహ సభ దేనికి పెట్టామో వివరించి, ప్రభుత్వ వైఫల్యాలేమిటో సవివరంగా చెప్పి ఉంటే కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చేది. కానీ సక్సెస్ అయిన సభను వీర్రాజు నిరుత్సాహపరిచార’ని కాకినాడకు చెందిన ఓ సీనియర్ నేత వాపోయారు. పైగా వీర్రాజు ప్రసంగం తర్వాత ఆయనను సునీల్ దియోథర్ అభినందించడం విశేషం.

కాగా, తాము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామన్న వీర్రాజు వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రం సంధించారు. ‘వాహ్ ఏమి పథకం? ఎంత అవమానకరం?
ktr-tweetఏపీ బీజేపీ కొత్త పతనానికి దారితీసింది. చీప్ లిక్కర్‌ను రు.50 కే సరఫరా చేయాలన్న బీజేపీ జాతీయ విధానం ఏపీకా… లేక నిరాశ అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఉందా’ అంటూ చేసిన ట్వీట్ తెలంగాణ బీజేపీని అడ్డంగా ఇరికించింది.

ఓ వైపు కేసీఆర్ మద్యం పాలిసీపై విరుచుకుపడుతున్న తమను, ఏపీ అధ్యక్షుడు వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ సర్కారు మద్యం పాలిసీపై మాట్లాడే వీలులేకుండా చేశాయని తెలంగాణ బీజేపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే వాపోయారు. అటు వైసీపీ, సీపీఐ కూడా వీర్రాజు వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రం సంధించడంతో, వీర్రాజు నోటి పుణ్యాన ఏపీ బీజేపీ గాయాలపాలవాల్సి వచ్చింది.

LEAVE A RESPONSE