Suryaa.co.in

Editorial

మోదీ సభకు డుమ్మాతో క్లారిటీ!

– ప్రధాని సభకు ఎంపి బాపూరావు, విజయశాంతి, కోమటిరెడ్డి, వివేక్‌ డుమ్మా
– ఢిల్లీ నుంచి స్పష్టత రానందుకే మోధీ సభకు మొహం చాటేశారా?
– బీఆర్‌ఎస్‌పై స్పష్టత కోరిన బీజేపీ సీనియర్లు
– పోరాటపంథా ఉంటేనే కొనసాగాలని నిర్ణయం?
– ఢిల్లీ నుంచి సీనియర్లకు రాని స్పష్టత
– ఎప్పుడూ ప్రధాని సభకు అగ్రనేతల క్యూ
– ముందుగానే పాసులపై ఒత్తిళ్లు
– ఈసారి మోదీ సభపై నిరాసక్తత
– అటు మోదీ ప్రసంగం కూడా పేలవం
– ఎంపి సోయంపేట సైతం డుమ్మాపై విస్మయం
– వివేక్‌ సైతం గైర్హాజర్‌
– అన్న వెంకటరెడ్డితో కోమటిరెడ్డి మంతనాలు?
– పార్టీ నాయకత్వం తీరుపై విజయశాంతి అసంతృప్తి ట్వీట్లు
– మళ్లీ పాత గూటికి బీజేపీ సీనియర్లు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన అగ్రనేతలు మళ్లీ పుట్టింటికి చేరుకోనున్నారా? వారు బీజేపీలో ముళ్లమీద కూర్చున్నట్లు భావిస్తున్నారా? బీఆర్‌ఎస్‌-బీజేపీ బంధం ఎప్పటికీ తెగదన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతనే, సీనియర్లు తమ పంథా మార్చుకుంటున్నారా? ఆ మేరకు వారికి ఢిల్లీ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడమే వారి అడుగులు, కాంగ్రెస్‌ వైపు వేసేందుకు కారణమవుతోందా?.. తాజాగా ప్రధాని మోదీ బహిరంగసభ తర్వాత తెరపైకి వ స్తున్న అనుమానాలివి.

సహజంగా ప్రధాని మోదీ-కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు వస్తున్నారంటే, వారిని కలిసేందుకు బీజేపీ నేతలు క్యూలు కడతారు. ఏపీ నుంచి సీనియర్‌ నేతలు కూడా హైదరాబాద్‌ వచ్చి వారిని కలిసిపోతారు. ఇక బహిరంగసభలు జరిగితే పదిరోజుల ముందుగనే పాసుల కోసం పార్టీ కార్యాలయ నేతలు, ఢిల్లీ కార్యాలయంపై ఒత్తిడి తీసుకువస్తుంటారు. ఆరోజు ఇతర కార్యక్రమాలేవీ పెట్టుకోరు. కానీ సాక్షాత్తూ ప్రధాని మోదీ హాజరైన సభకు, సీనియర్లు మొహం చాటేయడం విస్మయపరుస్తోంది. అందులో ఒకరు లోక్‌సభ సభ్యుడు కావడం మరో విశేషం.

ప్రధాని మోదీ సభకు లోక్‌సభ సభ్యుడు సోయంబాపూరావు, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, మాజీ ఎంపి జి.వివేక్‌, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి మోదీ సభకంటే ముందుగానే, వారంతా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌పై పార్టీ వైఖరి కోసం ఢిల్లీ పార్టీని స్పష్టత కోరారు. తామంతా కేసీఆర్‌ సర్కారును బీజేపీ ఎదుర్కొంటుందన్న ధీమాతోనే, బీజేపీలో చేరామని వెల్లడించారు. కాగా మోదీ సభ ముందురోజు వరకూ స్పష్టత రాకపోవడంతోనే, వారంతా మోదీ సభకు మొహం చాటేసినట్లు నిపిస్తోంది.

కానీ రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విషయాన్ని, అప్పటికే వారంతా చాలాసార్లు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కవితను అరెస్టు చేయకపోతే బీజేపీని ఎవరూ నమ్మరని, ప్రధాని-హోంమంత్రి, కేంద్రమంత్రులు ఎంతమంది వచ్చినా, ప్రజలు బీజేపీని నమ్మరని వారు కుండబద్దలు కొట్టారు. బీఆర్‌ ఎస్‌ను బీజేపీ ఎదుర్కొంటుందని నమ్మితేనే, ప్రజలు పార్టీని ఆదరిస్తారని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి సహా చాలామంది నేతలు బహిరంగంగానే ప్రస్తావించడం గమనార్హం.

దీనిపై కొందరు సీనియర్లు పార్టీ నాయకత్వం నుంచి స్పష్టత కోరారు. రాష్ర్టంలో బీఆర్‌ఎస్‌పై పోరాడి, కేసీఆర్‌ సర్కారును ఇబ్బంది పెట్టాలన్న వాతావరణం రాష్ట్ర నాయకత్వంలో లేకపోవడం, బీజేపీ సీనియర్ల భేటీకి కారణమయింది. ఫలితంగా విజయశాంతి నివాసంలో ఒకసారి, శంషాబాద్‌ ఫాంహౌస్‌లో మరోసారి భేటీ అయి, తమ రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరపటం లీక్‌ అయింది.

కాగా విజయశాంతి పార్టీ నాయకత్వతీరుపై చాలాకాలం నుంచి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటివరకూ ఆమె చేసిన ట్వీట్లు పరిశీలిస్తే.. బీజేపీలో రాములమ్మ ఎక్కువకాలం కొనసాగడం కష్టమన్న సంకేతాలు కనిపిస్తాయి. బీఆర్‌ఎస్‌తో బీజేపీ యుద్ధం చేసే పరిస్థితి లేనందున.. అధికార పార్టీతో సీరియస్‌గా యుద్ధం చేస్తున్న, కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడమే ఉత్తమని సీనియర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

పైగా ముస్లిం-క్రైస్తవ వర్గాలు కూడా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్న వాస్తవాన్ని బీజేపీ సీనియర్లు గ్రహించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ వల్ల త మకు ఎలాంటి నష్టం లేకపోయినప్పటికీ, జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ వంటి సెక్యులర్‌ పార్టీకి మద్దతునివ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణలో ముస్లిం-క్రైస్తవ వర్గాలు భావిస్తున్నాయి.

ఇంకోవైపు బీజేపీ-బీఆర్‌ఎస్‌ అవగహన రాజకీయాలతో వెళుతున్నాయని విద్యావంతులు, మేధావులు, విద్యార్ధుల భావిస్తున్న పరిస్థితిలో.. ఇంకా బీజేపీలో కొనసాగడం అవివేకమని ఓ నేత వ్యాఖ్యానించినట్లు సమాచారం. పైగా ఢిల్లీ నాయకత్వం ఏదీ స్పష్టంగా చెప్పడం లేదని, రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి తాముప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారట.

ఇదిలాఉండగా, మునుగోడు ఉప ఎన్నిక ముందు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మంతనాలు ప్రారంభించారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మరో పది పదిహేనురోజులో,్ల బీజేపీ సీనియర్లు కాంగ్రెస్‌లో చేరే అంశానికి సంబంధించి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదిలాఉండగా, మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ సభ, అత్యంత పేలవంగా ముగియడాన్ని బీజేపీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబపాలన అన్న రొటీన్‌ విమర్శ మినహా, మోదీ కొత్తగా బీఆర్‌ఎస్‌ను పల్లెత్తు మాట అనకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నుంచి.. అధికార ప్రతినిధి సుభాష్‌ వరకూ చేసే ఏ ఆరోపణ కూడా, మోదీ ప్రసంగంలో వినిపించలేదని పెదవి విరుస్తున్నారు. ఇది బీఆర్‌ఎస్‌-బీజేపీ ఒకటేనన్న అనుమానాలను మరింత నిజం చేసినట్లయిందని, బీజేపీ నేతలు తలపట్టుకుంటున్నారు.

LEAVE A RESPONSE