– మోడీ పేదవాళ్లను వదిలేసి.. కార్పొరేటర్లతో తిరుగుతున్నారు: సీపీఐ జాతీయ కార్యదర్శి డి రాజా
– దర్యాప్తు సంస్థలు బీజేపీ సంస్థల్లాగా మారిపోయాయి: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్
– కేసీఆర్ ఆధ్వర్యంలో అధికారణ వికేంద్రీకరణ: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
ఖమ్మం: దేశమనే పుష్పగుచ్ఛంలో అన్నిరకాల పూలుఉంటేనే బాగుంటుంది. కానీ కొందరు ఒకే రంగు పువ్వును కొరుకుంటున్నారు. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఎద్దేవా చేశారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో ఆయన బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజు బికారి అవుతాడు. బికారి రాజు అవుతాడు. విపక్షాల ఎమ్మెల్యేలను కొనాలి. అధికారంలోకి రావాలి. ఇదే బీజేపీ తీరు. దానికి ముగింపు పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారాయన. ఇక కేసీఆర్ కంటి వెలుగు అద్దాలిచ్చారు. ఇంత మంది జనాల్ని చూడాలంటే మాకు స్పెషల్ అద్దాలు ఇవ్వాలి అని సభకు హాజరైన జనాలను ఉద్దేశించి భగవంత్ మాన్ చమత్కరించారు.
భారత దేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందని, దేశానికి బీజేపీ ప్రమాదకారిగా మారిందని సీపీఐ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా విమర్శించారు. బుధవారం ఖమ్మం బీఆర్‌ఎస్ భేరిలో పాల్గొన్న ఈ జాతీయ నేత.. ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. భారతదేశం హిందూ దేశంగా మారితే ప్రమాదకరమని రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు దేశ మౌలిక వ్యవస్థలనే మార్చేయాలని చూస్తున్నారు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ అన్న మోదీ.. ఇప్పుడు ఎవరితో ఉన్నారు? అని రాజా నిలదీశారు. మోదీ పేదవాళ్లను వదిలేసి.. కార్పొరేటర్లతో తిరుగుతున్నారని ఆరోపించారు. అలాగే.. గవర్నర్లు.. సీఎంలను ఇబ్బంది పెడుతున్నారు. ఇదేనా ఫెడరల్ స్ఫూర్తి అంటే అని కేంద్రానికి ఏకిపడేశారు. చివరికి.. వన్ నేషన్.. వన్ లీడర్.. వన్ పార్టీ అనే రీతిలో వ్యవహరిస్తోంది బీజేపీ. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందన్న రాజా.. బీజేపీ దేశానికి ప్రమాదకారిగా పరిణమించిందని పేర్కొన్నారు. రైతుబంధు, దళిత బంధు అమలు అవుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. సాగునీరు, తాగు నీటిని కొరత లేదిక్కడ. దేశం ఉనికి ప్రమాదంలో పడినప్పుడు సెక్యులర్ పార్టీలు ఏకం కావాలి అని డి రాజా పిలుపు ఇచ్చారు. బీజేపీ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించాలి. ఖమ్మం సభ నుంచి ఈ మెస్సేజ్ పంపాలి అని డీ రాజా పిలుపు ఇచ్చారు.
బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని, విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందని ఆరోపించారు ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. బుధవారం ఖమ్మం బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగిస్తూ..చారిత్రక ఖమ్మం నగరం.. జనసంద్రంగా మారింది. ఇక్కడి ప్రజలు రాజకీయంగా చైతన్య వంతులు. ఇంకా 400 రోజులే మిగిలి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. అంటే.. కేంద్రంలోని బీజేపీ రోజులు లెక్కపెడుతోందన్నమాట. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేస్తోంది. విపక్ష నేతలను కేసులతో ఇరుకున పెట్టేందుకు యత్నిస్తోంది. దర్యాప్తు సంస్థలను చూపి భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. అవి బీజేపీ సంస్థల్లాగా మారిపోయాయి.
ఇవాళ్టితో ఇంకా 399 రోజులే మిగిలి ఉన్నాయి. కేంద్రానికి కౌంట్ డౌన్ మొదలైంది. రైతుల్ని ఆదుకుంటామన్నారు.. మాట తప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు.. చేతులెత్తేశారు. తెలంగాణలో మాదిరే యూపీలోనూ బీజేపీ ప్రక్షాళన జరుగుతుందన్నారు అఖిలేష్ యాదవ్. తెలంగాణ పథకాల్ని కేంద్రం కాపీ కొడుతోందని, కలిసి పని చేస్తే దేశానికి కొత్త మార్గదర్శకత్వం దొరుకుతుందని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రిని అద్భుతంగా నిర్మించారు. కేసీఆర్ పని ఎక్కువ చేస్తూ.. ప్రచారం తక్కువగా చేసుకుంటారని కొనియాడారు. బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం దక్షిణాది నుంచి.. అది తెలంగాణ నుంచే ప్రారంభమని అఖిలేష్ ప్రకటించారు.
కేసీఆర్ ఆధ్వర్యంలో అధికారణ వికేంద్రీకరణ జరుగుతోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు హాజరై.. తొలుత ఆయన ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై వీరోచిత పోరాటం జరిగిందని, అలాంటి నేల నుంచి జాతికి ఒక మార్గం చూపించే ప్రయత్నం అభినందనీయమని కేరళ సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయి. కంటి వెలుగు, కొత్త కలెక్టరేట్ ప్రారంభించడం సంతోషం. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుతున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారాయన.ఈ పథకాలను కేరళలోనూ అమలు చేస్తామని బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ నుంచి కేరళ సీఎం ప్రకటించారు.
దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకండా పోరాడాలి. బీజేపీ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన ఉంటోంది.దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోంది. బలవంతంగా హిందీ రుద్దాలని చూస్తోంది. గవర్నర్ల ద్వారా నియంత్రించాలని చూస్తోంది. కులాలు, మతాల వారీగా ప్రజలను వేరు చేయడాన్ని వ్యతిరేకించాలి. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వీకేంద్రీకరణ జరుగుతోంది. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. కేసీఆర్ పోరాటానికి మా మద్దతు ఉంటుంది. కేసీఆర్ వెంట కేరళ ప్రజలు ఉన్నారు అని కేరళ సీఎం ప్రకటించారు.