Suryaa.co.in

Features

ఆహార కల్తీ నిరోధించలేమా?

– అనారోగ్యం బారిన పడుతున్న ప్రజలు
-డాక్టర్లకు కూడా ఈ ఆహార కల్తీ బాగా కలిసొస్తుంది
– కల్తీ పాలను సిటీ వ్యాప్తంగా సప్లై చేస్తున్నారు
-చికెన్ బిర్యానీ బదులు కుక్క బిర్యానీ పెడుతున్నారు
– పానీ పూరి చేసే ఇళ్లల్లో పందులు కూడా నివసించవు
-ఆరోగ్య తనిఖీ అధికారులు సంఖ్య పెరగాలి
– నామ మాత్రపు సొమ్ము నైనా కల్తీ నియంత్రణ, నిరోధానికి ఖర్చు పెట్టడం లేదన్న ఆరోపణలు

కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది, కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుంది. రోడ్డు పక్కన ఆహారాలు సాధ్యమైనంత వరకూ తినకపోవడమే మంచిది.దేశంలో రోజు రోజుకు ఆహార కల్తీ ఎక్కువ అయిపోతుంది. ఏది కొనాలి అన్న.. తినాలి అన్న భయపడే రోజులు వచ్చాయి. వారి వ్యాపారం పెంచుకోవాలి అని ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు, దీంతో వారి వ్యాపారమే కాదు ఆస్పత్రులు కూడా నిండిపోతున్నాయి.

డాక్టర్లకు కూడా ఈ ఆహార కల్తీ బాగా కలిసొస్తుంది అనే చెప్పాలి. టీ, కాఫీ, పాలు, పిండి, నూనెలు, మాంసం, కంది పప్పు, మిరియాలు, జీలకర్ర, బియ్యం ఇలా నిత్యం వినియోగించుకునే అన్ని పదార్థాలు కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుంది పరిస్థితి. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు సరుకులు కల్తీ చేస్తుండడం, వినియోగదారుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. నకిలీ వస్తువులను నియంత్రించాల్సిన విభాగాలు బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమవుతూ ఆహార పదార్థాలపై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న మొత్తంలో నామ మాత్రపు సొమ్ము నైనా కల్తీ నియంత్రణ, నిరోధానికి ఖర్చు పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి.

నకిలీ సరకులపై న్యాయ స్థానాలు స్వయంగా కేసుల్ని స్వీకరించి, మొట్టికాయలు వేసినా, అధికార యంత్రాంగం మందగమనం వీడలేదు. కల్తీ వస్తువులను విక్రయించే వారిపై దాడులు తూతూ మంత్రమే ఆపుతున్నాయి. పాలశీతలీకరణ కేంద్రానికి అనుబంధంగా రెండు బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ (బీఎంసీ) కేంద్రాలు మూతపడ్డాయి. పాడి పశువులను నమ్ముకున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలిస్తే పాడి పరిశ్రమ బ్రతుకుతుంది. పాలలో ఉండే కొవ్వు(వెన్న) శాతాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. పాడి రైతులకు బ్యాంకుల సహకారంతో రుణాలు ఇప్పించి, ప్రైవేట్‌ డైయిరీల పోటీ తట్టుకునేందుకు జిల్లా, మండల కేంద్రాలలో పాల ఉత్పత్తుల ఔట్‌లెట్‌ అమ్మకం కేంద్రాలను ప్రారంభించాలి.

తక్షణమే ప్రతి మండలంలో ఇరవై యూనిట్లు యుద్ధ ప్రాతిపదికన పాడి రైతులకు రుణాలు ఇచ్చి పాడి పరిశ్రమ బ్రతికించుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే కల్తీ నాసిరకం పాలతో జబ్బులు కొని తెచ్చుకోవాల్సిందే. కల్తీ పాలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పది లీటర్ల పాలలో సగం పాలు తీసేస్తారు. నీళ్లు, యూరియా, సన్ ఫ్లవర్ ఆయిల్ కలుపుతారు. ఆ తర్వాత మిక్సీలో గ్రైండ్ చేస్తారు. నీళ్ల పాలు చిక్కగా తయారవుతాయి. ఇలా తయారు చేసిన కల్తీ పాలను సిటీ వ్యాప్తంగా సప్లై చేస్తున్నారు.

ఇలా చేయడంతో పాల చిక్కదనం పెరిగి, వినియోగదారులు చిక్కటి పాలని అపోహ పడుతుంటారు. అసలు నిజమైన పాలకు ఏం తీసిపోకుండా ఉండడంతో, జనం పట్టించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇవి తాగితే సాధారణ ఆరోగ్య సమస్యల నుంచి క్యాన్సర్ వరకు తీవ్ర స్థాయిలో ఆరోగ్య ముప్పు తప్పప్రైవేటు డైరీలు సుదూర ప్రాంతాల నుంచి పాలు సేకరిస్తున్నారు. పాలు చెడిపోకుండా అడ్డమైన పదార్థాలు కలుపుతుంటారు. రెండు, మూడు రోజుల కిందట సేకరించిన పాలు హోమోజినైజెడ్, పాశ్చరైజ్డ్ దాదాపు వంద డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసినప్పుడు అందులో శరీరానికి ఉపయోగపడే బాక్టీరియా అంతరించిపోతుంది.

అలాంటి పాలు త్రాగి ప్రయోజనం లేదు. పాలు అధిక సమయం నిల్వ ఉండేందుకు సోడా, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌లను ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు. వీటివల్ల మెదడు, నరాలు దెబ్బతింటాయని, జీర్ణకోశ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక యూరియా కారణంగా కళ్లు, మెదడుకు హానికరమని ఇకోలీ బ్యాక్టీరియా కారణంగా జీర్ణకోశ వ్యాధులు, సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా టైఫాయిడ్‌ సమస్యలు వస్తాయంటున్నారు. పలు డెయిరీల నిర్వాహకులు పాలు తయారు చేసేందుకు నాణ్యత లేని పాలపొడి వినియోగిస్తున్నారు. అది కూడా అపరిశుభ్ర పరిసరాలు పాలు తయారీ సాగుతోంది. దీని వల్ల వివిధ రకాల వైరస్, బ్యాక్టీరియాలు సంక్రమించి రోగాల పాలు కావాల్సి వస్తుందని వైద్యులు చెప్తున్నారు.

కల్తీ పాలపై అప్రమత్తంగా లేకపోతే, అంతే సంగతి. కల్తీ పాలు తాగిన పిల్లలు ఎంట్రిక్‌ ఫీవర్, టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కడుపునొప్పి, వాంతులు అవుతాయి. ఇకోలీ బ్యాక్టీరియాతో వాంతులు, డయేరియా, జీర్ణకోశ వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. పాలను 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే అధిక వేడి మీద కొంతసేపు మరిగించినపుడే బ్యాక్టీరియా చనిపోతుంది. ఇక పాలల్లో కల్తీ చేసే పదార్థాలతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు వైద్య నిపుణులు.

ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులు కూడా కల్తీ ఆహార వస్తువులేవీ, అసలువేవో తెలుసుకోవడం అవసరం. ఇందుకు ‘భారతీయ ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థలు ప్రజలను వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలి. కల్తీని గుర్తించే పరీక్ష (డీ.ఏ.ఆర్.టి) కిట్లు ప్రతి మార్కెట్ లో అందుబాటులో ఉంచాలి. ఈ మధ్యకాలంలో చికెన్ లాలీ పాప్, పకోడాలలో చికెన్ వేస్ట్ అయిన కాళ్ళు, స్కిన్, ప్రేగులు కలపడం సాధారణం. హై వే డాబాలలో మాంసంలో కుళ్ళిపోయినవి పెడుతున్నారు.

చికెన్ బిర్యానీ బదులు కుక్క బిర్యానీ పెడుతున్నారు ఇలా చాల వార్తలు చదువుతూనే ఉన్నాం. ఒక్క మాంసమే కాదు బయట చేసే ఫాస్ట్ ఫుడ్స్ అన్నింటిలో ఆహార కల్తీ ఉంటుంది. అన్ని కూడా ఆహారంలో కల్తీ అవుతూనే ఉంటున్నాయి. పరిమితికి మించి రంగులు వాడకం ఎక్కువగా ఉంటున్నది. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ కాపీ టీ స్టాల్స్ లో సింథాటికి పాలు వినియోగం ఎక్కువగా ఉంటున్నది. ఇక ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లలో కల్తీ నూనెలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. పానీ పూరి చేసే ఇళ్లల్లో పందులు కూడా నివసించవు. ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్, ఐస్, నూడుల్స్ తయారీ చేసే ప్రదేశాలలో శుచి శుభ్రత పాటించక అవి తిన్న వారు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.

ఫుడ్ ఇన్స్పెక్టర్లు ప్రతి రోజు తనిఖీ చేయాలి, తయారీ కేంద్రాలను పరిశీలించాలి, ఎక్కువ మోతాదులో రంగుల వాడకాన్ని , కల్తీ పాల వాడకాన్ని నియంత్రించి తగిన చర్యలు తీసుకోవాలి. మన చేతిలో లేని పరిష్కారాల విషయానికి వస్తే రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి లేకపోతే వ్యవసాయం చేసే సంఖ్య తగ్గి, కల్తీ ఇంకా పెరుగుతుంది, అలాగే రేట్లు ఇంకా ఇంకా పెరుగుతాయి. కల్తీ మీద ప్రచారం విస్తృతంగా పెరగాలి. వాటి వల్ల కీడు ప్రజలకు తెలియజేయాలి. ఫెర్టిలైజర్స్ వాడకం, కాన్సర్ కారణం అనే విషయాన్ని కూడా తెలియజేయాలి.

ఆరోగ్య తనిఖీ అధికారులు సంఖ్య పెరగాలి, వారి అధికారాలు పెరగాలి, కఠిన శిక్ష పడాలి. అలాగే ప్రభుత్వం సేంద్రియ ఆహారాన్ని చౌకగా ఉండేట్లు చూడాలి మంచి ఆహార అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు వాటి వల్ల లాభాలు చెప్పి ప్రోత్సహించాలి, అప్పుడు ప్రజలు సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతుంది, రేట్లు తగ్గుతాయి. ఇండ్లలో, డాబాల మీద, పెరటి తోట పెంపకాన్ని, ఆర్గానిక్ కూరగాయలు పండ్లు పెంచుకోవాలి. బియ్యం, పప్పులు, ఉప్పు, చింతపండు సంవత్సరంలో రెండు సార్లు పెద్ద మొత్తంలో కొంటే కల్తీ బారి నుండి తప్పించుకోవచ్చు , నిలవ చేసుకోవడం కష్టంగా భావించి వాటికి చీమల మందు, లక్ష్మణ రేఖలు ప్రయోగించి కలుషితం చేస్తున్నారు.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

LEAVE A RESPONSE