– వాటి సంగతి తేల్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
– కేంద్రంపై అనవసర నిందలు వేస్తే ఖబడ్దార్…
– రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిందెప్పుడు? 317 జీవో జారీ చేసిందెప్పుడు?
– ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్
– ఉద్యోగాలను భర్తీ చేసేదాకా ఎన్నికల్లోకి వెళ్లబోమనే హామీ ఇవ్వాలని డిమాండ్
– కోర్టు కేసు సాకులతో ఉద్యోగాల భర్తీ వాయిదా వేస్తే వదిలిపెట్టబోమని స్పష్టీకరణ
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలను మాయం చేసి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కోర్టు కేసులు, ఇతరత్రా సాకులతో ఉద్యోగాల భర్తీని వాయిదా వేస్తే సహించబోమన్నారు. ఈ విషయంలో కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా… ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల్లోకి వెళ్లబోమని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ, కొత్త జోనల్ విధానం ఆలస్యం కావడానికి కేంద్రమే కారణమన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సంజయ్ తీవ్రంగా స్పందించారు. నోటిని అదుపులో
ఉంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదలైన 40 నెలల దాకా స్పందించని కేసీఆర్… తన చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టడం సిగ్గు చేటన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, కార్యదర్శులు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, అధికార ప్రతినిధులు జె.సంగప్ప, పోరెడ్డి కిషోర్ రెడ్డి, రాణి రుద్రమదేవి తదితరులతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
• ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఈరోజు 80 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించిండు. ఉద్యోగాల భర్తీ కోసం గత 8 ఏండ్లుగా నా నిరుద్యోగ తమ్ముళ్లు, చెల్లెళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిండ్రు. నీ మోసపూరిత ప్రకటనలు విని విని ఇక ఉద్యోగాలు రావని విసుగుపుట్టి వందలమంది సూసైడ్ చేసుకుని చనిపోయిండ్రు. ఇన్నాళ్లకైనా నీ మనసు కరిగింది. సంతోషం.
• ఈ ఉద్యోగాల ప్రకటన బీజేపీ సాధించిన విజయం. ఉద్యోగాల భర్తీ కోసం అనేక పోరాటాలు చేసినం. లాఠీ దెబ్బలు తిన్నం. అరెస్టైనం. జైలుకు పోయినం. అయినా బాధపడలే. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయకుంటే నిరుద్యోగులతో కలిసి హైదరాబాద్ లో ‘మిలియన్ మార్చ్’ నిర్వహిస్తామని ప్రకటించినం. మిలియన్ మార్చ్ ఏర్పాట్లు దాదాపు పూర్తయినయ్. లక్షలాదిగా నిరుద్యోగ యువకులు హైదరాబాద్ రావడానికి సిద్ధమైనరు.
• ఇంటెలిజెన్స్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ కు వెన్నులో వణుకుపుట్టింది. ఇప్పుడు కూడా ఉద్యోగాల ప్రకటన చేయకపోతే యువతీ యువకులు భరతం పడతరని ఆయనకు అర్ధమైంది. అట్లాగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినయ్.
• ఈ రెండిటి దెబ్బతో ఆగమేఘాల మీద అసెంబ్లీలో ఉద్యోగ ప్రకటన చేసిండు. చాలా అందంగా నిరుద్యోగ యువతీ యువకులను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసిండు. 8 ఏండ్లుగా వందలాది మంది యువకులను బలి తీసుకున్న కేసీఆర్… ఈ ప్రకటనతో లక్షలాది మంది జీవితాలు బంగారు మయం అవుతున్నట్లు ఫోజులు కొట్టిండు.
• ఈ ఉద్యోగాలేదో… ఆయన కనికరించి భిక్ష వేస్తున్నట్లు మాట్లాడిండు. ఈ ఉద్యోగాలు… ఆయన ఇంట్లకెళ్లి ఇస్తుండా? ఏ రాష్ట్రంలో ఉద్యోగాలే ఇయ్యనట్లు.. ఈయనొక్కడే ఇస్తున్నట్లు మాట్లాడుతుండు.
• కేసీఆర్… నీకు తెలుసా…? అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఒకే ఒక్క ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలిచ్చినం. అస్సాం ఎంత ఉంటదో తెలుసా… మన రాష్ట్రంలోని ఒక ఉమ్మడి జిల్లా అంతటి ఉంటది. ఆ చిన్న రాష్ట్రమే ఒకే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తే… 8 ఏళ్లయినా తరువాత నువ్వెన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలి?
• పైగా 8 ఏండ్ల నుండి పిల్లల్ని అరిగోస పెట్టి వందల మంది ఆత్మహత్యలకు కారణమైన నువ్వు ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నవ్..
• సిగ్గుండాలె…. 2014లోనే కదా ఇదే అసెంబ్లీలో లక్షా 7 వేల ఉద్యోగాలిస్తానన్నవ్? అంతకుముందేమో బహిరంగ సభలో ఇంటికో ఉద్యోగమిస్తానని చెప్పింది నువ్వు కాదా? రెండేండ్ల క్రితం నువ్వు నియమించిన బిశ్వాల్ కమిటీ రాష్ట్రంలో ఒక లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది.
• మరి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తో కలిపి 91 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తానంటున్నవ్? మరి మిగిలిన లక్ష ఉద్యోగాలేమైనయ్. కాకి ఎత్తకపోయిందా? లేక నువ్వు మింగేసినవా? ఆ లెక్క సంగతి ఎందుకు చెప్పలే.. లక్ష ఉద్యోగాల లెక్క తేల్చకుండా ఏదో బిచ్చమేసినట్లుగా ఉద్యోగాలు ప్రకటించి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నవా?
• ఈ లెక్కలన్నీ దాచిపెట్టి అసెంబ్లీ సాక్షిగా మరోమారు ప్రజలను మోసం చేస్తావా? గత 8 ఏళ్లుగా నువ్వు చెబుతుంది ఇదే.. కదా…ఇదిగో ఉద్యోగాల భర్తీ.. అదిగో నోటిఫికేషన్ అని ఊరిస్తనే ఉన్నవ్ కదా…. నీ మాటల గారడీతో ప్రజలను మోసం చేసే కాలం పోయింది. ఎప్పటికప్పుడు నీ ముసుగును ప్రజలకు చెబుతూనే ఉన్నం.
• ‘నీళ్లు-నిధులు-నియామకాల’ నినాదంతో సాధించుకున్న తెలంగాణలో నియామకాలు చేపట్టకుండనే 8 ఏండ్లు గడిపినవ్. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని తెలిసి ఇప్పుడు నిద్రలేచి నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నవ్. ఇంకెన్నాళ్ల మోసపు మాటలు మాట్లాడతవ్?
• ఇగ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎందుకు లేటైందని అడుగుతుంటే కేంద్రంపై బదనాం మోపుతున్నవ్. మొఖం బాగోలేక అద్దం పగలగొట్టినట్లుంది నీ యవ్యారం. 2016లో కమలనాథన్ కమిటీ రిపోర్ట్ లేటైందని…నేనేం చేయలేకపోతున్నానని తప్పించుకున్నవ్. ఇప్పుడేమో కేంద్రం ఆలస్యం చేయడంవల్లే కొత్త జోనల్ విధానం లేటైందని… దానివల్లే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేకపోయామని సాకులు చెబుతూ మళ్లీ కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నవ్.
• సరే..పోనీ… ఒక్క క్షణం నువ్వు చెప్పిందే నిజమనుకుందాం.. మరి కొత్త జోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వులు ఎప్పుడొచ్చినయ్… 2018 ఆగస్టులో. ఆ జీవోలో ఏమని ఉంది? ఉత్తర్వులు జారీ చేసిన 36 నెలల్లోగా కొత్త జోనల్ వ్యవస్థను అమలు చేయాలని గడువు కూడా పెట్టింది.
• మరి నువ్వేం చేసినవ్…? 40 నెలలు దాటినా ఆ ఉత్తర్వుల గురించే పట్టించుకోవైతివి. సోయి తప్పి పడుకుంటివి. ఉద్యోగాల భర్తీ, ఉద్యోగుల కేటాయింపులపై మేం ఉద్యమాలు చేస్తుంటే దిగ్గున లేచి పోయిన ఏడాది డిసెంబర్ 6న 317 పేరుతో జీవో విడుదల చేస్తివి.
• ఆ 317 జీవో కూడా రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా, ఉద్యోగుల స్థానికతకు విరుద్ధంగా జారీ చేస్తివి. నువ్వు చేసిన పనివల్ల ఇటు ఉద్యోగులకు సంతోషం లేకపాయే.. ఏండ్ల తరబడి ఉద్యోగాలు రాక నిరుద్యోగుల గోసపడితిరి.
• మరి ఈ మొత్తం వ్యవహారంలో ఇందులో కేంద్రం జాప్యం ఎక్కడుంది? కేంద్రం చేసిన తప్పేముంది? నీ నిర్లక్ష్యంవల్ల నిరుద్యోగులు నాలుగేళ్ల కాలాన్ని పోగొట్టుకుంది నిజం కాదా? ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా?
• నువ్వు ఏ ముహూర్తాన సీఎం అయినవో గానీ… ఆనాటి నుండి నిరుద్యోగులను గోస పెడుతూనే ఉన్నవ్. అయినా సిగ్గు లేకుండా నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నవ్. ఈరోజు కూడా నిరుద్యోగులను మోసం చేసేలా ప్రకటన చేస్తున్నవ్?
• నువ్వు చేసిన ప్రకటనను చూసి సిగ్గు లేకుండా టీఆర్ఎసోళ్లు పాలాభిషేకం చేస్తున్నరట. ఇయ్యాళ పాల ప్యాకెట్లన్నీ టీఆర్ఎసోళ్లే కొనడంవల్ల తెలంగాణలో పాల ప్యాకెట్ల కొరత ఏర్పడ్డదట..
• నీకు చేతగానిదంతా కేంద్రమ్మీద తోసేయడం నీకు అలవాటైంది. అసలు ఉద్యోగాలివ్వొద్దనే విషపూరిత బుద్ది నీది… కొత్త జోనల్ వ్యవస్థ రావడం లేటైందంటవా? దానికి కారణం కేంద్రం మీద నెడతవా?… సిగ్గుండాలె చెప్పడానికి.
• ఉద్యోగులకు సరిగా జీతాలే ఇవ్వడం చేతగాని సీఎం కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తానంటే నమ్మశక్యంగా లేదు. ఇన్నాళ్లు ఉద్యోగాలివ్వకుండా నిరుద్యోగులను గోస పెట్టిన సీఎం… ఉద్యోగాలు రాలేదనే బాధతో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు?
• కాంట్రాక్టు ఉద్యోగులను 11 వేల మందిని రెగ్యులరైజ్ చేస్తున్నా… ఇగ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అనే పేరే వినపడదని పెద్ద పెద్ద ప్రకటనలు చేసినవ్ కదా….. నువ్వు తీసుకున్న నిర్ణయంవల్ల పదుల సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు చచ్చిపోయిండ్రు. నిర్దాక్షిణ్యంగా కాంట్రాక్టు ఉద్యోగులను రోడ్డు మీద పడేసింది నువ్వు కాదా? పక్క రాష్ట్రం సీఎం తెలంగాణలోకొచ్చి వాళ్ల ఉద్యోగాలు తీసేసిండా? రెగ్యులరైజ్ చేసే ముందు 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, 12 వేల మంది విద్యా వలంటీర్లను, 22 వేల మంది స్కావెంజర్లను, 1700 మంది స్టాఫ్ నర్సులను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకో. రెగ్యులరైజ్ చెయ్. అప్పుడు నువ్వు పెద్ద సిపాయివనుకుంటా…
• ముందు కరోనా టైంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన కాంట్రాక్టు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది మెడమీద కత్తి వేలాడుతోంది. వాళ్లను రెగ్యులరైజ్ చెయ్. టిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగులంతా ఎప్పుడు ఉద్యోగం పోతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నరు…..
• ఇన్నాళ్లు ఉద్యోగాలిస్తనని నువ్వు చేసిన డ్రామాల్లాగే ఇది కూడా చెయ్యకు. ఉద్యోగ కేలండర్ ఇస్తానంటున్నవ్ కదా… అందులో ఎగ్జామ్, రిజల్ట్, రిక్రూట్ మెంట్, పోస్టింగ్ డేట్స్ తో సహా కేలండర్ ఇయ్.
• ఎందుకంటే నువ్వు పెద్ద మోసగాడివి. గ్రూప్-2 ఉద్యోగాలు ప్రకటించి వాటిని భర్తీ చేయడానికి మూడేళ్లు పట్టింది. 2017-18లో ఫార్మాసిస్ట్ ల నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటిదాకా రిజల్ట్ లేదు.. అలాట్ మెంట్ లేదు. నాలుగేళ్ల నుండి నీకు సోయెందుకు లేదు?
• మిలియన్ మార్చ్ కు పిలుపునిస్తే భయపడి ఉద్యోగ నోటిఫికేషన్ అన్నవ్. మీ మెడలు వంచడంవల్లే నోటిఫికేషన్… అయితే ఈ ప్రకటనైనా నిజాయితీగా అమలు చేయ్. లోపాలు లేని నోటిఫికేషన్ వేయాలి. కోర్టుల్లో కేసులకు తావు లేకుండా జాప్యం లేకుండా భర్తీ చేయ్. ఆ క్రెడిట్ మేం తీసుకోం. ఉద్యోగాల భర్తీ,.. నిరుద్యోగులకు న్యాయం జరగడమే మాకు ముఖ్యం.
• బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 1 లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
• అట్లాగే బకాయిలతో సహా నిరుద్యోగ భ్రుతి ఇచ్చేదాకా మా పోరాటం ఆగదు. అప్పటిదాకా కేసీఆర్ వదలిపెట్టం.
• మిలియన్ మార్చ్ వాయిదా పడినట్లేనా? అన్న విలేకరుల ప్రశ్నకు … ‘‘మేం మిలియన్ మార్చ్ కోసం అన్ని ఏర్పాట్ల చేసుకున్నం. లక్షలాదిమంది నిరుద్యోగులతో సీఎం, మంత్రులంతా దిగొచ్చే విధంగా మిలియన్స్ మార్చ్ ప్లాన్ చేసినం. ఆ సెగ సీఎంకు తగిలింది. ఇంటెలిజెన్స్ ద్వారా విషయం తెలుసుకుని భయపడి అసెంబ్లీలో ఉద్యోగాల ప్రకటన చేసిండు.
• అయినా మాకు ఈ సీఎంపై నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇట్లాంటి ప్రకటనలెన్నో చేసిండు. కొద్దిరోజులు చూస్తం. వెంటనే నుండే ప్రాసెస్ చేయాల్సిందే. వారంలో నోటిఫికేషన్ పడాలె. ఎగ్జామ్స్, రిజల్ట్స్, అపాయిట్ మెంట్, పోస్టింగ్స్ తో సహా నిర్ణీత వ్యవధిలో కేలండర్ విడుదల చేయాలె.
• అట్లాకాదు.. ఇగ ప్రకటన చేసిన… ఇగ మళ్లా నేను ఫాంహౌజ్ కు పోతా….. స్పెషల్ ఫ్లైటెక్కి రాష్ట్రాలు తిరుగుతానంటే ఊకునేది లేదు. కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచేదాకా వదిలిపెట్టబోం.
• సింగరేణి ప్రమాదంలో ఇద్దరు అధికారులు, ఒక కార్మికుడు మ్రుతి చెందడం బాధాకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. వెంటనే పరిహారం అందజేయాలె. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఇప్పటికే నేను డీజీఎంఎస్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ) కు ఫిర్యాదు చేశాను. బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావ్రుతం కాకుండా చూడాలని కోరిన.