శేఖరన్న ఉద్యోగాలు సరే..మరి జగనన్న సంగతేంటి?

– 20 వేల టీచర్ పోస్టులు..14,341 పోలీసు ఉద్యోగాలు ఖాళీ
– పక్కరాష్ట్రంలో పేలిన ‘ఉద్యోగ బాంబు’ ఏపీలో ప్రభావం?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిదంటే ఇదే. తెలంగాణ రాష్ట్రంలో 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన ఆయన ఇమేజ్‌ను ఆకాశమంత పెంచింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యంగా ప్రకటించినప్పటికీ, ఒకేసారి 91 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన, తెలంగాణ నిరుద్యోగ యువకుల్లో బతుకు భరోసా పెంచింది. పైగా 10 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తున్నట్లు కేసీఆర్ పెద్ద మనసుతో ప్రకటించిన వైనం, వారి పెదవులపై చిరునువ్వులు పూయించింది. ఫలితంగా.. ఇప్పుడు నల్లగొండ నుంచి ఆదిలాబాద్ వరకూ ఎక్కడ చూసినా సంబురాలే. కేసీఆర్‌కు కృతజ్ఞత ప్రకటిస్తూ నిరుద్యోగులు, ఆయన ఫొటోలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. యూనివర్శిటీల్లో అయితే విద్యార్ధుల ఆనందానికి అవధుల్లేవు.

సీన్‌కట్ చేస్తే.. తెలంగాణలో పేలిన ఉద్యోగాలబాంబు.. ఆంధ్రా పాలకులను ఉక్కిరిబిక్కిరి చేయనుంది. పక్క రాష్ట్ర ప్రభావం ఏపీలో కూడా పడే ప్రమాదం కనిపిస్తోంది. జగన్ సీఎం అయిన తర్వాత ఇప్పటిదాకా సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్లు, ప్రభుత్వ వైన్‌షాపుల్లో ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. మటన్‌కొట్ల ఉద్యోగాల వ్యవహారం వేరు. వీటిలో సచివాలయ ఉద్యోగులు, వైన్‌షాపుల్లో ఉద్యోగాలు తాత్కాలిమే. అదీగాక.. వారిని మరుగుదొడ్ల వద్ద రుసుము వసూలు చేసేందుకు వాడుకుంటున్న వైనం, ఇటీవల గుంటూరు కార్పొరేషన్‌లో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.

ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని జగనన్న హామీ ఇచ్చినా, ఈ మూడేళ్లలో వాటిని అమలుచేసిన దాఖలాలు లేవు. కాకపోతే అవుట్‌సోర్సింగ్ కార్పోరేషన్ ఒకటి ఏర్పాటుచేశారంతే. ఇటీవల ఉద్యోగుల ఆందోళన సందర్భంలో కూడా వీరి వ్యవహారం చర్చకు వచ్చినా, వారిని పర్మినెంట్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దానితో ఆ రెండు వర్గాలూ నిరాశతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం, ఏపీలో జగన్ ప్రభుత్వంపై కచ్చితంగా ప్రభావం చూపించక మానదు. ఏపీ ఉద్యోగులు, తెలంగాణతో పోల్చుకునే క్రమంలో సహజంగానే జగనన్న ప్రభుత్వంపై అసంతృప్తి మిగులుస్తుంది.

ఇక అసలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలాన్ని మరో రెండేళ్లు ప్రకటించిన వైనం ఏపీ నిరుద్యోగుల ఆగ్రహానికి గురయింది. ఫలితంగా నిరుద్యోగ, విద్యార్ధి సంఘాలు జగనన్న సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగాయి. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు కూడా వారి ఆందోళనకు జత కలిశాయి. ఇప్పుడు రిైటె రయ్యే ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చేందుకు, సర్కారు వద్ద సరిపడా డబ్బులేదు. దానితో వ్యూహాత్మకంగా రెండేళ్లు పదవీకాలం పెంచటం ద్వారా గండం నుంచిగట్టెక్కింది.

ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ 91 వేల కొత్త ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటన, ఏపీ నిరుద్యోగుల ఆందోళనకు కొత్త ఊపిరిపోసినట్టయింది. తెలంగాణలో ఉద్యోగాల కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ఉద్యమాలు నిర్వహించాయి. ఆ పార్టీల అనుబంధ సంఘాలయిన ఎన్‌ఎస్‌యుఐ- యూత్‌కాంగ్రెస్, ఏబీవీపీ-బీజేవైఎం కార్యకర్తలు గత ఆరేళ్ల నుంచి అలుపెరుగని ఉద్యమాలు చేశారు. ఫలితంగా.. కేసీఆర్ తాజాగా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమం ఎవరు చేసినా అవి ఇచ్చిన క్రెడిట్ మాత్రం కేసీఆర్ ఖాతాలోనే కలిసింది. కాకపోతే మా పోరాటాల వల్లే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారని ప్రచారం చేసుకునే అవకాశం మాత్రం కాంగ్రెస్-బీజేపీకి లభిస్తుంది. ఇప్పుడు అదే జరిగింది.

సరే.. కాసేపు తెలంగాణను పక్కకుపెట్టి, మళ్లీ ఏపీలోకి వెళితే, కేసీఆర్ ఉద్యోగ ప్రకటన వ్యవహారం జగన్‌కు కచ్చితంగా సంకటమే. ఇటీవల ఉద్యోగులు పీఆర్సీ కోసం ఆందోళన చేసిన సందర్భంలో కూడా.. తెలంగాణలో ఇచ్చిన పీఆర్సీతోపాటు, గతంలో చంద్రబాబు హయాంలో ఇచ్చిన పీఆర్సీని పోల్చి, ఆ మేరకు కొత్త పీఆర్సీని డిమాండ్ చేశారు. ఇప్పుడు నిరుద్యోగుల వంతు వచ్చింది.

ఆ క్రమంలో రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్, ఉద్యమంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత, సమైక్య రాష్ట్రం కోసం తప్ప, విద్యార్ధి ఉద్యమాలు ఎక్కడా కనిపించలేదు. వామపక్ష పార్టీలు, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్ధి సంఘాలు కూడా క్రియాశీలకంగా పనిచేయడం మానేసి చాలా కాలమయిపోయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పుణ్యమా అని తెలంగాణలో పేలిన ‘ఉద్యోగాల బాంబు’ ప్రభావం, ఏపీలో కూడా పనిచేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా, జగన్ కూడా ఏదో ఒక సంఖ్యలో పరిమితంగానయినా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

ఏపీలో ఇదీ లెక్క!
ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. తర్వాత 10,143 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఏపీలో 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బిపిఆర్‌డి) గణాంకాల ప్రకారం.. 2020 జనవరి 21 నాటికి రాష్ట్రంలో 14,341 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, ఇప్పటిదాకా ఒక్క ఖాళీ కూడా భర్తీ చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. గత టీడీపీ సర్కారు రెండుసార్లు డీఎస్‌సీ నిర్వహించి 17591 ఉద్యోగాలు ఇస్తే, ఇప్పటిదాకా జగన్ ప్రభుత్వం ఒక్క డీఎస్‌సి కూడా నిర్వహించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రతి ఏటా డీఎస్‌సీ నిర్వహిస్తామని గత ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు.

ఇండియా స్కిల్‌రిపోర్టు.. దేశంలో దిగజారుతున్న ఏపీ స్థానం
ఇండియా స్కిల్‌రిపోర్టు-2022 ప్రకారం ఉపాథి కల్పనలో ఏపీ పరిస్థితి దారుణంగా ఉంది. అత్యధిక ఉద్యోగావకాశాలు కలిగిన రాష్ట్రాల జాబితాలో ఏపీ 2018లో 1వ స్థానంలో ఉంటే, 2022 నాటికి 7 వస్థానానికి చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యోగాలు సాధించే ప్రతిభ (ఎంప్లాయిబుల్ టాలెంట్) కలిగిన అభ్యర్ధులను అందించే, మొదటి 3 రాష్ట్రాల జాబితాలో ఏపీకి అసలు చోటు లభించకపోవడం ప్రస్తావనార్హం.

ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడే రాష్ట్రాల జాబితాలో 2018లో ఏపీ మొదటి స్థానంలో ఉండగా 2022 నాటికి, అది 5 వ స్థానానికి దిగజారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆంగ్ల నైపుణ్యాల్లో 9వ స్థానం, న్యూమరికల్, రీజనింగ్, క్రిటికల్ థింకింగ్, కంప్యూటర్ నైపుణ్యాల్లో మొదటి 10 రాష్ట్రాలలో ఏపీకి అసలు స్థానమే లేదు. సెంటర్ ఫర్ ఎకనమిక్ సర్వే ప్రకారం.. 2019 ఏప్రిల్ నాటికి 4 శాతం ఉన్న నిరుద్యోగిత, 2022 ఫిబ్రవరి నాటికి 7.1 శాతానికి పెరిగింది. కాగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఒక్క ఏడాదిలోనే 358 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న వైనంపై, ప్రతిపక్షాలు ఇప్పటికే జగన్ ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు రువ్వుతున్నాయి.

Leave a Reply