* కేంద్రం ఇచ్చిన పైసల గుట్టు విప్పిన కేటీఆర్, హరీష్
* అబద్ధమని తేలితే రాజీనామాకూ సై అన్న తారకరాముడు
* కేటీఆర్‌వన్నీ కట్టుకథలేనని అసలు గుట్టు చెప్పిన సంజయ్, అర్వింద్
* చర్చకు సిద్ధమేనన్న కమలదళం
* మరి ఇద్దరి లెక్కలూ రైటయితే తగువుతీర్చేదెవరో?
* నిధుల లెక్కల్లో నిజమెంత?
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణలో ఇప్పుడు పైసల పంచాయితీ నడుస్తోంది. అర్ధం కాలేదా?.. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల లెక్కలన్నమాట. కేంద్రం మన నుంచి గుంజేటిది ఎక్కువ, ఆ వాటాలో మనకిచ్చేటిది తక్కువన్నది తెరాస ఉత్తరాధికారి, మంత్రి తారకరాముడి మాట. తాను చెప్పిన లెక్క తప్పితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న సవాల్‌తో తొడగొట్టారు. మరో మంత్రి హరీష్ కూడా ’రామన్న’కు బాసటగా నిలిచి, కేంద్రం ఇచ్చిన లెక్కల చిట్టా విప్పారు. మరి కమలదళం ఊకుంటుందా? లే! కేంద్రం ఇస్తున్న పైసలను అణాపైసలతో సహా విప్పిన సంజయ్, అర్వింద్, రఘు గులాబీదళాన్ని ఆత్మరక్షణలో నెట్టారు. ఇద్దరూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఎక్కడా ‘తగ్గేదేలే’ అంటున్నారు. చర్చలకు సిద్ధమంటున్నారు. ఇద్దరి లెక్కలూ నిజమయితే, మరి అసలు లెక్క పంచాయితీ తీర్చేదెవరు? ఈ తగవు తీర్చేదెవరు? కొంపదీసి చివరకు ఇదంతా చర్చలకు నిలబడకుండా.. మిగిలిన వాటిలా ‘పనికి ఆహారపథకం’ మాదిరిగా ‘మీడియాకు స్టోరీ, డిబేట్ల ఆహార పథకం’గా మారుతుందా? ఇదీ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ‘మనీ’ మినీ వార్’ పంచాయితీ.
తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న కేంద్రం.. తిరిగి రాష్ట్రానికి ఇస్తున్న నిధులు అత్యల్పమని టీఆర్‌ఎస్ విరుచుకుపడుతోంది. తమ లెక్కలు అబద్ధమని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, కేటీఆర్ విసిరిన సవాల్‌తో తెలంగాణలో ‘మనీవార్’కు తెరలేచింది. ఈ విషయంలో మంత్రులు కేటీఆర్-హరీష్ చేస్తున్న దాడి, దానికి ధీటుగా బీజేపీ చీఫ్ సంజయ్- ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్ లెక్కల ఎదురుదాడి ఆసక్తికరంగా మారింది.
తొలుత ఈ పంచాయతీకి తెరలేపిన మంత్రి కేటీఆర్ , కేంద్ర నిధుల చిట్టా విప్పారు. గత ఏడేళ్లలో కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది 3,65,790 కోట్ల రూపాయలయితే.. కేంద్రం తిరిగి రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 1,68, 640 కోట్లు మాత్రమే. ఈ లెక్కలు తప్పని నిరూపిస్తే పదవిని నా ఎడమకాలి చెప్పు కింద వదులుకుని, నా పదవికి రాజీనామా చేసి సాధారణ ఎమ్మెల్యేగానే ఉంటా. తెలంగాణ ఇచ్చిన నిధులను యుపి, మధ్యప్రదేశ్‌కు పంపింది’ అన్న సంచలన ఆరోపణలతో ఈ వివాదానికి తెరలేపారు.
సీనియర్ మంత్రి హరీష్ మరో అడుగుముందుకేసి..‘ కేంద్రం మనకు ఇవ్వాల్సిన 7,183 కోట్ల రూపాయల పెండింగ్ నిధులను కేంద్రమంత్రి కిషన్‌రె డ్డి తీసుకురావాలి. రాష్ట్రాలకు కేంద్రం 41 శాతం వాటా
పంచాలి. కానీ 29.6 శాతం మాత్రమే రాష్ట్రానికి ఇస్తోంది. ఆసరా పెన్షన్లపై రాష్ట్రం 48,273 కోట్లు ఖర్చు పెడితే, కేంద్రం 1645 కోట్లు మాత్రమే ఇస్తోంది. అంటే 96.6 శాతం రాష్ట్ర నిధులయితే, పెన్షన్లకు కేంద్రం ఇస్తున్నది 3.4 శాతం మాత్రమే. 2014 నుంచి ఇప్పటిదాక తెలంగాణ ప్రజలు పన్నులరూపంలో 3,65, 797 కోట్ల రూపాయలు కేంద్రానికి కడితే, కేంద్రం నుంచి రాష్ట్రానికి 1,68,647 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది తప్పని నిరూపిస్తే ముక్కునేలకు రాస్తా. నిజమని తేలితే సంజయ్ ముక్కు నేలకు రాస్తడా’ అని హరీష్ చేసిన సవాలుతో, లెక్కల యుద్ధం ముదురుపాకాన పడింది.
దీనితో రంగంలోకి దిగిన కమలదళం.. కేంద్రం నుంచి తెప్పించుకున్న వివరాలు బయటపెట్టి, గులాబీదళాన్ని ఆత్మరక్షణలో నెట్టింది. తెలంగాణ కోసం కేంద్రం 3 లక్షల 94 వేల కోట్లు ఇచ్చింది. ఇది తప్పని కేటీఆర్ నిరూపిస్తే దేనికైనా సిద్ధం. కేటీఆర్ బుడ్డర్‌ఖాన్ మాటలు బంద్ చేయాలె. ఆయన తుపాకీరాముడు, ఉత్తరకుమారుడు లెక్క మాట్లాడుతుండు. నేనిచ్చిన లెక్కపై చర్చకు రెడీ’నని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ గులాబీ దళానికి ప్రతి సవాల్ విసిరారు. అంతేకాదు. ఏ నియోజకవర్గానికి కేంద్రం ఇచ్చిందో చర్చించేందుకూ సిద్ధమని సవాల్ చేశారు.
‘కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నులవాటా కింద 1.68 లక్షల కోట్లు, కేంద్ర స్కీముల కోసం 1.58 లక్షల కోట్లు ఇస్తుందన్న సంగతి కేటీఆర్‌కు తెలియదా? రైతు వేదికలకు 10 కోట్లు, ఒక్కో నర్సరీ ఏర్పాటుకు 1.16 లక్షలు, పల్లె ప్రకృతి వనాలకు నిధులన్నీ కేంద్రానివే వాడుతున్నరని నీకు తె ల్వదా? తెలుసుకుని మాట్లాడ’మని సంజయ్ కూడా ఎదురుదాడి చేస్తున్నారు. ‘ఏడేళ్లలో రాష్ట్రానికి కేంద్రం 3 లక్షల 20 వేల కోట్లు అందించింది. దీనిపై ఎక్కడికైనా చర్చకు రెడీ’ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సవాల్ చేశారు.
ఈవిధంగా రెండు పార్టీల మధ్య జరుగుతున్న సవాళ్లు-ప్రతి సవాళ్లతో మీడియా-సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు సెటైర్ల వర్షం కురిపించుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా చర్చల వేదిక, లెక్కల ప్రాతిపదిక ఏమిటన్నది మాత్రం ఇరుపార్టీలు చెప్పకుండా.. మీడియా వేదికలపైనే సవాళ్లు విసురుకోవడం ప్రస్తావనార్హం.
సంజయ్-అర్వింద్-రఘు అలా.. కిషన్‌రెడ్డి ఇలా!
కేంద్ర నిధులపై తెలంగాణ వేదికగా జరుగుతున్న మాటల యుద్ధంలో, బీజేపీ నేతల మధ్య ఎదురుదాడిలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ఇచ్చిన నిధులపై చర్చించేందుకు సిద్ధమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు ముందుకువస్తే… పార్టీని ముందుండి నడిపించి ఈ
వ్యవహారంలో దిశానిర్దేశం చేయాల్సిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాత్రం, ‘‘ కేటీఆర్ సవాల్‌పై నేను స్పందించను. అసలు కేటీఆర్‌ను రాజీనామా చేయమని మేం అడగలేదు కదా’’ అని వెనక్కితగ్గడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిజానికి కేంద్రం వద్ద గణాంకాలను రాష్ట్ర బీజేపీ నేతలకు అందించి, దాని ద్వారా టీఆర్‌ఎస్‌ను జనంలో ముద్దాయిగా నిలబెట్టాల్సిన కిషన్‌రెడ్డి ఇలా చేతులెత్తేయడం వల్ల..‘‘ కేంద్రమంత్రిలో ఉన్న కిషన్‌రెడ్డే సవాల్‌కు సిద్ధపడలేదంటే, టీఆర్‌ఎస్ లెక్కల్లో నిజం ఉందని తెలంగాణ ప్రజలు నమ్మే ప్రమాదం ఉంటుంద’’ ని ఓ సీనియర్ బీజేపీ నేత వ్యాఖ్యానించారు.