-పార్టీలో, ప్రభుత్వంలో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధమని సీఎం జగన్మోహన్ రెడ్డితోనే చెప్పా
– గుడివాడలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా
-ఎమ్మెల్యే అని పిలిపించుకోవటమే నాకు ఇష్టం
-మంత్రి పదవి లేకపోతే బాధపడను
నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లు కాదనుకుంటే బాధపడాలి
-పదవి కోసం వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు లాంటి వ్యక్తిని కాదు
– 30 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి కొనసాగాలి
– సీఎం జగన్ కుర్చీని లాక్కోవాలని గుంటనక్కల్లా చూస్తున్నారు
-రాష్ట్రంలోని ప్రతి వైయస్సార్ కార్యకర్త అడ్డుకోవాలి
– గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపు
గుడివాడ, ఏప్రిల్ 23: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం జగన్మోహన్ రెడ్డితోనే చెప్పానని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో శనివారం మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగజ్జీవన్ రాం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే
కొడాలి నాని మాట్లాడుతూ చాలామంది పెద్దలు మాజీ మంత్రి అని తనను సంబోధిస్తున్నారు. గుడివాడ నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నాకు అన్నింటికన్నా ఇష్టమైన పదవి ఎమ్మెల్యే అని చెప్పారు. తన గురించి సంభోదించేటప్పుడు స్థానికులు ఎమ్మెల్యే అని, బయటి ప్రాంతం వారైతే గుడివాడ ఎమ్మెల్యే అనాలని కోరారు. మంత్రి పదవి పోతే తాను బాధపడని చెప్పారు. ఎమ్మెల్యే పదవిని ప్రజలే ఇస్తారని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలోని రెండు లక్షల మంది ఓటర్లు తనను కాదనుకుంటే బాధపడాలని చెప్పారు. రాష్ట్రంలోని ఆర్థిక, సామాజిక పరిస్థితులు, కులాల సమీకరణాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడడం జరిగిందన్నారు. ఇంకా కొన్ని వర్గాలను పైకి తీసుకురావాలన్న ఉద్దేశం కనబరిచానని తెలిపారు.ఇందుకోసం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపామన్నారు. రాష్ట్ర, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరామన్నారు.
ఇంకో 30 ఏళ్ళ పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగాలని ఆకాంక్షించామని చెప్పారు. మంత్రి పదవి ముఖ్యం కాదని, ఏ నిర్ణయం తీసుకున్నా సంతోషంగా ఆమోదిస్తామని చెప్పామన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలిసి పార్టీలో, ప్రభుత్వంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశామన్నారు. దీంతో మంత్రి పదవి నుండి తప్పించి పార్టీ పదవులను అప్పగించారని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని చెప్పారు. అటువంటి నాయకుడు దగ్గర పని చేయడం తమకు ఎంతో గర్వంగా ఉంటుందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మంత్రి పదవా, పార్టీ పదవా అనేది ముఖ్యం కాదన్నారు. పదవులు కొడాలి నానికి ఈక ముక్క లాంటివని చెప్పారు. పదవి కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు లాంటి వ్యక్తిని కాదని చెప్పారు. తన గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఆయనతో పని చేస్తున్నామని చెప్పారు. ప్రజల అభ్యున్నతి కోసమే జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు.
చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని 420 బ్యాచ్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు.ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడు, దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, చంద్రబాబులను 420 బ్యాచ్ గా అభివర్ణించారు.డబ్బా ఛానల్స్లో డిబేట్ లు పెట్టి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతోందని, పేదల సంక్షేమానికి ఏ విధంగా డబ్బులు పంచుతారని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు.
లక్షల కోట్లు పేదల జేబుల్లోకి వెళ్తే సోమరులు అవుతారని అంటున్నారన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే పేదలు ఎక్కడా పనులు చేయడం లేదా అని ప్రశ్నించారు. కుటుంబ, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇచ్చే చేయూత పేదలకు ఆసరాగా ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి కుర్చీని ఎలా లాక్కోవాలని గుంట దగ్గర నక్కల్లా చూస్తున్నారన్నారు. ఇటువంటి దొంగ ప్రయత్నాలను ప్రజలంతా ఆపాలని పిలుపునిచ్చారు.
జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్ కు అధికారం కట్టబెడితే 8 నెలల్లోనే కొంతమంది దుర్మార్గులు ఆయనకు వెన్నుపోటు పొడిచారని గుర్తుచేశారు. ఆ తర్వాత గుంట నక్కలు పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కోటాను కోట్లు సంపాదించారని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించారని తెలిపారు. ఆయన బతికి ఉంటే రాష్ట్రాన్ని రెండు ముక్కలవనిచ్చేవారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇప్పుడున్న ఆర్థిక సమస్యలు ఉండేది కాదని తెలిపారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు కాకుండా సమైక్యంగా ఉంచగలిగే శక్తి దివంగత రాజశేఖర్ రెడ్డికి ఉందని చెప్పారు. రాజశేఖర్ రెడ్డిని కోల్పోవడం వల్లే రాష్ట్రం సర్వ నాశనమైందని అన్నారు.
రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకుని పుట్టిన జగన్మోహన్ రెడ్డి పేద వర్గాల కోసం పాటు పడుతున్నారని చెప్పారు. ఏదో విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం నుండి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వైయస్సార్ కార్యకర్త, సామాన్య ప్రజానీకం ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకోవాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు.