– కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి హుస్నాబాద్ లో బండి సంజయ్ రోడ్ షో
– తొలిదశ పాదయాత్ర సక్సెస్ అయినందుకు ప్రజలకు థ్యాంక్స్ చెప్పనున్న సంజయ్
– సభ ఏర్పాట్లు, రోడ్ షో నిర్వహణపై వివిధ జిల్లాల అధ్యక్షులతో సంజయ్ భేటీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలిదశ ’ప్రజా సంగ్రామ యాత్ర’ ముగింపు సందర్భంగా అక్టోబర్ 2న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దాదాపు లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆరోజు ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తో కలిసి బండి సంజయ్ హుస్నాబాద్ లోని గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుండి ప్రచార రథంలో ఎక్కి పట్టణమంతా రోడ్ షో నిర్వహిస్తూ ప్రజా సంగ్రామ యాత్ర తొలి దశ పాదయాత్రను విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజానీకానికి ధన్యవాదాలు చెబుతున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 అంబేద్కర్ సెంటర్ లో నిర్వహించే బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు.
తొలిదశ పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించడం… ఎక్కడికి వెళ్లినా ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతూనే టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెడుతుండటంతో రాష్ట్ర ప్రజల పక్షాన భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో పోరాటాలు చేసే అంశంపై బహిరంగ సభా వేదికగా వివరించనున్నారు.
ఈ విషయాలను ముగింపు సభలో వెల్లడించడంతోపాటు బీజేపీ పట్ల ఇంతటి ఆదరణ చూపుతున్న రాష్ట్ర ప్రజానీకానికి సభా వేదికగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేందుకు సిద్ధమైంది. మరోవైపు హుస్నాబాద్ లో నిర్వహించే బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఫోన్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం వివిధ జిల్లాల అధ్యక్షులు, ఇంఛార్జీలతో బండి సంజయ్ కుమార్ సిద్దిపేట జిల్లా కోహెడలోని పాదయాత్ర శిబిరంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లాకు 120 కి.మీల పరిధిలోని పొరుగు జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జీలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఆయా జిల్లాల నుండి భారీ ఎత్తున జనం, బీజేపీ కార్యకర్తలు హుస్నాబాద్ బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం ఉన్నందున అక్టోబర్ 2న నిర్వహించే సభలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, జన సమీకరణ, రవాణ వంటి అంశాలపై చర్చించారు. హుస్నాబాద్ సభకు తమ తమ జిల్లాల నుండి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని జిల్లాల అధ్యక్షులు ఈ సందర్బంగా బండి సంజయ్ కుమార్ ద్రుష్టికి తీసుకెళ్లారు.
ఒక్కో జిల్లా నుండి సగటున 5 వేల నుండి 10 వేల మందికిపైగా జనం, బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశం ఉన్న విషయం తెలుసుకున్న బండి సంజయ్ దాదాపు లక్ష మంది బహిరంగ సభకు హాజరయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. దీంతో ప్రజలకు, కార్యకర్తలకు ఏ మాత్రం ఇబ్బంది కలగని రీతిలో అవసరమైన రవాణా, ఇతర సౌకర్యాల కల్పించే అంశాలను సమీక్షించారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, కోశాధికారి శాంతికుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, పాదయాత్ర సహ ప్రముఖ్ లు టి.వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుండి బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తోంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు సమస్యలను వివరిస్తూ ప్రభుత్వంపట్ల తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్నారు. ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల ఇంతటి తీవ్రమైన వ్యతిరేకత నెలకొందనే విషయాన్ని నేను ఊహించలేదు.’’అని పేర్కొన్నారు.
‘‘రాష్ట్ర రాజకీయాలను విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చే విధంగా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. పాదయాత్రను విజయవంతం చేసేందుకు పార్టీలో అందరూ కష్టపడి పనిచేశారు. అందరికీ పేరుపేరునా అభినందనలు. మరింతగా కష్టపడి హుస్నాబాద్ లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయండి’’ అని జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలను కోరారు.
హుస్నాబాద్ లో సభ నిర్వహించడానికి గల కారణాలపై స్పందిస్తూ ‘‘ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం‘ ప్రజా సంగ్రామ యాత్ర’ తొలిదశ పాదయాత్రను అక్టోబర్ 2న ముగిస్తున్నాం. అయితే హుజూరాబాద్ లో ముగింపు సభను భారీగా నిర్వహించాలని భావించినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటం, కోవిడ్ నేపథ్యంలో భారీ బహిరంగ సభలకు, ర్యాలీలను నిషేధిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడంతో ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో భారీ బహిరంగ సభను హుస్నాబాద్ లో నిర్వహించేందుకు సిద్ధమయ్యాం’’అని వివరించారు.