Suryaa.co.in

Editorial

పవన్ చెవిలో బీజేపీ ‘పువ్వు’

– మిత్రపక్షమంటూనే పత్తాలేని పువ్వుపార్టీ
– పవన్‌పై వైసీపీ విమర్శలను ఖండించని బీజేపీ నాయకత్వం
– జనసేనతోనే తమ పొత్తని ప్రకటనలు
– కలసి పనిచేస్తామని గతంలో చెప్పిన సోము వీర్రాజు
– ఆందోళన కార్యక్రమాలు కలసి నిర్వహిస్తామన్న బీజేపీ
– పవన్ వారాహి యాత్రలో కనిపించని బీజేపీ శ్రేణులు
– పవన్‌పై వైసీపీ దాడి చేస్తున్నా జనసేనకు దన్నుగా నిలవని బీజేపీ
– వైసీపీ నేతల దాడిపై నోరువిప్పని సోము, విష్ణువర్దన్‌రెడ్డి, దియోథర్
– పవన్‌పై దాడులను తిప్పికొడుతున్న టీడీపీ నేతలు
– ముద్రగడకు టీడీపీ నేతల లేఖాస్త్రాలు
– పవన్‌కు ‘కాపు’ కాస్తున్న టీడీపీ
– ఇంతకూ జనసేనతో ‘కమలం’ కలసి ఉన్నట్టా? లేనట్టా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇంతకూ ఏపీలో జనసేనతో కమలం కలసి ఉన్నట్లా? లేనట్టా? వారిద్దరి పొత్తు మాటలు పెదవుల వరకే తప్ప కార్యాచరణలో కనిపించదేం? పవన్ వారాహి యాత్రలో బీజేపీ శ్రేణులు ఎందుకు కనిపించడం లేదు? జనసేన తమ మిత్రపక్షమంటున్న బీజేపీ.. పవన్‌పై వైసీపీ నేతల నుంచి ఎదురవుతున్న మాటల దాడిని ఖండించదేం? మీడియాలో మాత్రమే నానుతూ కనపించే సోము-విష్ణు అండ్ అదర్స్.. ఇప్పటిదాకా, జనసేనాధిపతిపై వైసీపీ మాటల దాడిని ఎందుకు తిప్పికొట్టలేదు? కాపు నేతలను పవన్‌పై ఉసిగొల్పుతున్న వైసీపీ వ్యూహంపై , మిత్రపక్షమైన బీజేపీ అధికార పార్టీ లక్ష్యంగా ఎందుకు ఎదురుదాడి చేయడం లేదు?

జనసేనతో ఇంకా పొత్తు కుదరని టీడీపీ మాత్రమే, జనసేనాధిపతికి ఎందుకు కాపు కాస్తోంది? మిత్రపక్షమైన బీజేపీ కంటే, ఇంకా బంధం కలవని టీడీపీ పవన్‌కు దన్నుగాఎందుకు నిలుస్తోంది? అసలు జనసేన-బీజేపీ పొత్తు ఉందా? లేదా? ఉంటే అది పెదవులకే పరిమితమా? అంటే పవన్ చెవిలో బీజేపీ పువ్వు పెడుతోందా? .. ఇదీ గత కొద్దికాలం నుంచి పవన్ కేంద్రంగా వైసీపీ చేస్తున్న మాటల దాడిలో, ‘పువ్వు’ పార్టీ మౌనంతో తెరపైకొచ్చిన సందేహాలు.

జనసేన దళపతి పవన్ కల్యాణ్ చెవిలో, కమలం ‘పువ్వు‘ పెడుతోందా? ఇదీ ఇప్పుడు జనసైనికులతో పాటు బుద్ధిజీవులకు జమిలిగా వస్తున్న సందేహం. తమకు జనసేన మాత్రమే మిత్రపక్షమని, వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే కలసి పనిచేస్తామని.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చాలాసార్లు ప్రకటించారు. తాము కుటుంబపార్టీలతో కలిసేది లేదని ఖరాఖండిగా చెప్పారు.

బీజేపీ-జనసేన కలసి త్వరలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాయని, ఆ పార్టీ కార్యక్రమాల్లో ఇకపై తాము కూడా పాల్గొంటామని, వీర్రాజు అప్పట్లో వెల్లడించారు. అయితే అది ఇప్పటివరకూ అమలయిన దాఖలాలు కనిపించలేదు. పవన్ వారాహి యాత్రలో బీజేపీ నేతలు గానీ, శ్రేణులు గానీ పాల్గొన్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో పవన్ లక్ష్యంగా వైసీపీ నేతలు, ముఖ్యంగా కాపు నేతలు వరస వెంట మాటల దాడి కొనసాగిస్తున్నారు. కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను ముందు పెట్టి.. పవన్‌ను రోజూ అదేపనిగా తిట్టిస్తున్నారు. పైగా పవన్‌ను విమర్శిస్తూ ఆయనపై లేఖాస్త్రాలు సంధిస్తున్న ముద్రగడ పద్మనాభంపై .. ప్రభుత్వ సలహాదారు సజ్జల సహా మంత్రులంతా తెగ సానుభూతి ప్రదర్శిస్తుండటంపై, కాపు వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

ముద్రగడ నీతి నిజాయితీగల నాయకుడని.. కాపుల కోసం ఆయన జీవితాన్ని ధారపోశారని, అలాంటి నేతపై విమర్శలు చేయడం బాధాకరమని వైసీపీ నేతలు కురిపిస్తున్న ప్రేమతో, ముద్రగడ తడిసి ముద్దవుతున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలు ముద్రగడపై, సోషల్‌మీడియాలో శరపరంపరగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ముద్రగడ దగ్గర గతంలో తిన్న ఉప్మాకు.. జనసేన- కాపు నేతలు- పవన్ అభిమానులు, ముద్రడకు పెద్ద సంఖ్యలో మనీఆర్డర్లు పంపించారు. నిజానికి అదో సంచలనం. కానీ వైసీపీ స్థాయి నేతలు జనసేనలో లేకపోవడం, వారికి అటు మీడియాలో కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో, ఆ ఘటనకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. వైసీపీ విమర్శలే జనంలోకి వెళుతున్న పరిస్థితి.

ఈ క్రమంలో, జనసేన తమ మిత్రపక్షమని చెప్పుకునే బీజేపీ రంగంలోకి దిగి.. పవన్‌కు దన్నుగా నిలబడితే, పరిస్థితి మరో రకంగా ఉండేదని జనసేన నేతలు విశ్లేషిస్తున్నారు. బీజేపీ నేతలు రంగంలోకి దిగి.. వైసీపీపై ఎదురుదాడి చేస్తే, రాజకీయంగా- నైతికంగా జనసేనకు బలం పెరిగేది. కానీ ఇప్పటిదాకా ఏ ఒక్క బీజేపీ నేత కూడా, పవన్‌కు మద్దతుగా నిలిచి , వైసీపీపై ఎదురుదాడి చేయకపోవడమే ఆశ్చర్యం.

ప్రతిరోజూ మీడియా-సోషల్‌మీడియాలో మాత్రమే.. నానుతూ కనిపించే అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, అప్పుడప్పుడూ ట్విట్టర్‌లో కనిపించే రాష్ట్ర కో ఇన్చార్జి సునీల్ దియోధర్.. ఎవరూ కనీసం పత్రికా ప్రకటనలో కూడా, వైసీపీ విమర్శలను ఖండించకపోవడంపై జనసైనికులు మండిపడుతున్నారు.

‘వారికి జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న ప్రేమ పవన్‌పై లేదనడానికి, ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేం కావాలి? మా అధినేతపై వైసీపీ నేతలు రోజూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అనాగరిక భాషతో ఆరోపణలు చేస్తున్నారు.

అయినా బీజేపీ నాయకత్వం ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదో, వారికి వైసీపీతో ఉన్న మొహమాటం ఏమిటో బహిరంగమే. పవన్‌ను సమర్ధిస్తే వారికి ఏం ఆగిపోతాయో జనాలకు తెలుసు. మరి అంతోటిదానికి జనసేన మా మితపక్షమని ప్రచారం చేసుకోవడం ఎందుకు? ఈ లాలూచీ వ్యవహారాలు తెలిసినందుకే, పవన్ రాష్ట్ర బీజేపీ నేతలను పట్టించుకోవడం మానేసి, ఢిల్లీ నేతలతోనే మాట్లాడుతున్నార’ని ఉత్తరాంధ్రకు చెందిన ఓ జనసేన నేత వ్యాఖ్యానించారు.

ఈ మాటల దాడి-ఎదురుదాడి నేపథ్యంలో.. జనసేనాధిపతి పవన్‌కు, టీడీపీ నేతలు ‘కాపు’ కాయడం చర్చనీయాంశమయింది. పవన్‌కు లేఖ రాసిన ముద్రగడపై.. టీడీపీ కాపు నేత బొండా ఉమ సహా, టీడీపీ నేతలంతా ఎదురుదాడి చేయడంతోపాటు , బుద్దా వెంకన్న వంటినేతలు ముద్రగడకు లేఖాస్త్రాలు సంధించడం విశేషం.

ముద్రగడ వైసీపీకి అమ్ముడుపోయారని, కాపుల ఆత్మగౌరవాన్ని జగన్-ద్వారంపూడికి తాకట్టు పెట్టారంటూ, ముద్రగడపై టీడీపీ గోదావరి జిల్లా నేతలు తూర్పారపడుతున్న పరిస్థితి. ఒకరకంగా జనసేన కంటే టీడీపీ నేతలే ముద్రగడ-వైసీపీపై ఎదురుదాడి చేస్తుండటం, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ తమకు ఇంకా మిత్రపక్షం కాకపోయినప్పటికీ, పవన్‌కు దన్నుగా నిలిస్తే, మిత్రపక్షమని చెప్పుకునే బీజేపీ నేతలు మాత్రం.. వైసీపీని విమర్శించేందుకు లాగులు తడిపేసుకుంటున్నారని, జనసైనికులు రుసరసలాడుతున్నారు. ఉత్తుత్తి మాటలు, పెదవులపై ప్రేమ ఎందుకని నిలదీస్తున్నారు.

LEAVE A RESPONSE