భాజపా రాజకీయ క్రీడలో..పునర్విభజన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు విలువ ఉండదు.. నిధులు రావు
(పిపిఎన్)
2021 లో జనగణన చేయాలి. కరోనా కారణం అని చెప్పారు. మనం కూడా నమ్మేశాం. కరోనా పోయి కూడా ఐదేళ్ళు పూర్తి అయిననూ జనగణన వైపు ఆలోచన కూడా లేదు. అసలు కారణం వేరు- 2001 లో వాజ్‌పాయ్ హయాం లో రాజ్యాంగ సవరణ చేసి 2026 తర్వాత జరిగే ( అంటే 2031) జనాభా లెక్కల ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు పెంచాలి అని నిర్ణయం.
ఈ ప్రకారం 2026 లోపు జనగణన చేపడితే పార్లమెంటు స్థానాలు పెంచే అవకాశం ఉండదు. ఇపుడు ఉన్న స్థానాలే 2009 తరహా సర్దుబాటు చేయాలి. ఇది హిందీ బెల్ట్ లో లబ్ది పొందాలి అనే మోషా వ్యూహానికి అడ్డంకి అవుతుంది. కనుకే జగగణన చేయలేదు అని అర్థమవుతోంది.
షా ఇచ్చే స్టేట్మెంట్ – సీట్లు తగ్గవు కేవలం కొందరి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే హంగామా అని. నిజమే సీట్లు తగ్గవు కానీ ఉత్తర భారత దేశంలో పెరిగినట్లు దక్షిణ భారత దేశంలో పెరగవు. ఇదీ అసలు మతలబు.
2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రాతిపదికన 848 సీట్లకు పెంచితే దక్షిణ భారత దేశంలో 5 రాష్ట్రాల్లో మొత్తం సీట్లు కేవలం 164. మిగతా 23 రాష్ట్రాల్లో 684 సీట్లు. భాజపా బలంగా ఉన్న యూపీ మహారాష్ట్ర ఎంపీ బీహార్ రాజస్థాన్ వరకే దాదాపు 400 సీట్లు పశ్చిమ బెంగాల్ కూడా కలిపితే భాజపా సేఫ్. కేంద్ర జనాభా నియంత్రణ విధానం సరిగ్గా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు వచ్చిన ఫలితం ఇది.
2011 లేదా 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన పునర్విభజన జరిగితే, దక్షిణ భారత రాష్ట్రాలు ఖశ్చితంగా నష్టపోతాయి. ఇందులో అనుమానం ఏమీ లేదు. 1971 లెక్కలు ప్రకారం చేయమని అడుగుతున్నారు కానీ అది కుదిరేది కాదు. భాజపా ఒప్పుకోదు. భాజపా అందరికీ న్యాయం చేయాలి అంటే ఒకే మార్గం- Proportional గా రాష్ట్రాలకు స్థానాలు పెంచి ఆయా రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఒకరకంగా మేలు. ఉదాహరణకు 848 స్థానాలకు 848/543 X 25 = 39 మనకు యూపికి 124.
ఇప్పుడు మన అవసరం ఉంది కాబట్టి కోరుకున్న నిధులు ఇస్తున్నారు. నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. పునర్విభజన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు విలువ ఉండదు నిధులు రావు. పార్టీల స్వార్థం ఫలితం – రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. భవిష్యత్తులో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ ఆలోచన ఏ పార్టీకి ఏ పార్టీ అభిమానులను లేవు. దూరాలోచన అసలే లేదు.