– ఎల్లో మీడియా విష ప్రచారాలే ఆయనకు ఆశీస్సులు
– స్వచ్ఛందంగా వచ్చిన వేలాది అభిమానులను చూసి కూటమిలో వణుకు
– సొంత డబ్బుతో హైదరాబాద్‌కి ఫ్లైట్‌లో వెళ్లినా ఎల్లో మీడియా ఏడుపు
– తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గుంటూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
తాడేపల్లి: వైయస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక.. తప్పుడు వార్తలు, విశ్లేషణలతో వ్యక్తిత్వ హననం చేయడమే కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని.. కానీ వారి ఏడుపులే వైయస్ జగన్‌కి ప్రజా దీవెనులుగా మారుతున్నాయని గుంటూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను గౌరవించి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకాబోతూ అందుకు షెడ్యూల్‌ని విడుదల చేస్తే కోర్టుకే జగన్ టైమిచ్చారంటూ, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.
మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిగా నిబంధనల ప్రకారం, ఆయన ఎక్కడికెళ్లినా షెడ్యూల్ విడుదల చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అంబటి రాంబాబు గుర్తు చేశారు. మాజీ సీఎం వైయస్ జగన్ లండన్ వెళ్లేందుకు కోర్టు అనుమతి తీసుకునే సదర్భంగా, పర్యటన అనంతరం కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఆ మేరకు తాడేపల్లి నుంచి బయల్దేరి గురువారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో హాజరయ్యారు.
జడ్జి ముందు హాజరైన అనంతరం లోటస్‌పాండ్‌కి వెళ్లి అక్కడ్నుంచి బెంగళూరు వెళ్లిపోయారు. వైయస్ జగన్ మీద బురదజల్లి వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్న కూటమి నాయకులు.. కోర్టు ఆదేశాలను గౌరవించి వైయస్ జగన్ కోర్టుకు హాజరైతే కూడా ఓర్వలేకపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాన్, నారా లోకేశ్ లు ప్రజల సొమ్ముతో వారం వారం హైదరాబాద్‌కి అప్ అండ్ డౌన్ చేస్తుంటే మాత్రం కనీసం ఎక్కడా వార్త కూడా ఉండదు. సంపద సృష్టిస్తామని చెప్పిన ఈ నాయకులు జనం సొమ్ముతో జల్సాలు చేస్తూ ప్రత్యేక విమానాల్లో సొంత కార్యక్రమాలకు తిరుగుతుంటే కనిపించడం లేదు.
ఆరేళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కుతున్న జగన్, జగన్ పర్యటనపై సోషల్ మీడియాలో జగన్‌పై సెటైర్లు.. పర్యటన షెడ్యూల్ చూపించి కోర్టుకి జగన్ అరగంట టైమిచ్చాడు.. అని ప్రచారం చేశారు. కోర్టుకు టైమివ్వడం అనేది ఎవరూ చేయని పని. పరిస్ధితినిబట్టి రోజంతా ఉండాల్సి రావచ్చు. ఈరోజు 5 నిమిషాల్లోనే కోర్టుముందు హాజరై తిరిగి వచ్చేశారు. వైయస్ జగన్ నాంపల్లి కోర్టుకు వస్తున్నారని ఈనాడు, ఆంధ్రజ్యోతిలే ఎక్కువగా ప్రచారం చేశాయి. ఆ విషయం తెలుసుకున్న జగన్ అభిమానులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చారు.
హైదరాబాద్‌లో మా పార్టీ లేకపోయినా, వైయస్ జగన్ కోసం వచ్చిన అభిమానాన్ని చూసి కూటమి నాయకులకు కళ్లు బైర్లు కమ్మాయి. ఎలాంటి జనసమీకరణ చేయకపోయినా, పర్యటన పేరుతో రావాలని పార్టీ పిలుపివ్వకపోయినా ఆయన కోసం వేలల్లో అభిమానులు తరలివచ్చారు. గడిచిన ఐదేళ్ల పాలన, అంతకుముందు, ఇప్పుడూ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేస్తున్న పోరాటాలు, ఆయన నిజాయితీ, వైయస్సార్ బిడ్డగా.. ఆయనకు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే ఆయన ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక నాయకుడిగా పరిపూర్ణమైన వ్యక్తికి దక్కుతున్న గౌరవం అది.