– క్రీడాకారుల బాహాబాహీ
– కోచ్ తలకు గాయం
– హుస్నాబాద్ మద్దూరు చెట్ల మధ్య ఘర్షణ
– మ్యాచ్ ముగిసిన అనంతరం ఆవేశాలకు లోనైన ఇరుజట్ల అభిమానులు
– పరిస్థితి ఉద్రిక్తం కావడంతో అభిమానులను చెదరగొట్టిన పోలీసులు
సిద్దిపేట: సీఎం కప్ క్రీడా పోటీల్లో క్రీడాకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఒకరినొకరు కొట్టుకునే స్థాయిలోకి గొడవ వెళ్ళింది. ఈరోజు జట్లకు చెందిన అభిమానులు క్రీడాకారులు ఒకరిపై ఒకరు కుర్చీలను విసిరేసుకున్నారు.
సీఎం కప్ క్రీడల్లో భాగంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న క్రీడా పోటీల్లో గురువారం కబడ్డీ ఫైనల్ మ్యాచ్ హుస్నాబాద్ మద్దూరు జట్ల మధ్య జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు క్రమశిక్షణ లేకుండా ఒకరికి ఒకరు స్లెడ్జింగ్ కు పాల్పడడంతో ఆవేశానికి లోనయ్యారు.
ఈ మ్యాచ్లో హుస్నాబాద్ పై మద్దూరు జట్టు విజయం సాధించింది. అంతకుముందు మద్దూరు జట్టు పై హుస్నాబాద్ కబడ్డీ జట్టు ఆటగాళ్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మద్దూరు ఆటగాళ్లు తాము మ్యాచ్ గెలిచి సత్తా చాటామని వ్యాఖ్యానించడంతో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు దుర్భాషలాడుకోవడంతో గొడవ ప్రారంభమైంది. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు కుర్చీలతో కొట్టుకున్నారు. దీంతో గొడవ పెద్దదిగా మారింది.
ఈ గొడవలో హుస్నాబాద్ కోచ్ నాగరాజు తలకు దెబ్బలు తగిలి రక్తం కారింది.పోలీసులు వచ్చి క్రీడాకారులను అభిమానులను చెదరగొట్టారు. అనంతరం పోలీసులు క్రీడా ఉపాధ్యాయులు, హుస్నాబాద్ మద్దూరు చెందిన నాయకులు ఇరుజట్ల ఆటగాళ్ల ను సముదాయించారు. అనంతరం నిర్వాకులు ఇరు జట్లకు బహుమతులను అందజేశారు.