Suryaa.co.in

National

యడ్యూరప్పకు ఎదురు దెబ్బ

– స్పెషల్‌ క్రిమినల్‌ కేసు నమోదు

బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు గట్టి షాక్‌ తగిలింది. ఆయనపై నమోదు అయిన భూ ఆరోపణలకు సంబంధించి.. ప్రత్యేకంగా క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు యడ్యూరప్పకు సమన్లు కూడా జారీ చేసింది.

భూ సంబంధిత ‘డీనోటిఫికేషన్‌ వ్యవహారం’లో అవినీతికి పాల్పడ్డారంటూ యడ్యూరప్పపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రత్యేకంగా క్రిమినల్‌ కేసు చేయాలని ఆదేశించింది బెంగళూరులోని ప్రత్యేక కోర్టు. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి క్రిమినల్‌ కేసులపై విచారణ కోసమే ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం గమనార్హం.

మరోవైపు యడ్యూరప్పపై ఈ ఫిర్యాదు 2013లోనే నమోదు అయ్యింది. యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా ఉన్న టైంలో ఈ అవినీతి జరిగిందని, వాసుదేవ రెడ్డి అనే బెంగళూరువాసి ఈ ఫిర్యాదు నమోదు చేశారు. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌-ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ఉన్న ఐటీకారిడార్‌లో స్థలానికి సంబంధించి ఈ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. డీనొటిఫికేషన్‌ తర్వాత ఆ స్థలాలను పలువురు ఎంట్రప్రెన్యూర్‌లకు కట్టబెట్టారు.

ఈ నేపథ్యంలో.. అవినీతి వ్యతిరేక నిరోధక చట్టం 1988 కింద.. యడ్యూరప్పపై ప్రత్యేకంగా క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని స్పెషల్‌ జడ్జి బీ జయంత కుమార్‌ ఆదేశించారు. అంతేకాదు తన ముందు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో యడ్యూరప్పను ఆదేశించారు కూడా.

LEAVE A RESPONSE