భూముల వేలంపై తెలంగాణ పాలకులకు హైకోర్టులో చావుదెబ్బ తగిలింది. వేలం సంగతి అలా ఉంచి… ఉన్న భూమిని ఎలా కాపాడతారో చెప్పండంటూ న్యాయస్థానం నిలదీసింది. ధనిక రాష్ట్రమంటూ తెలంగాణను అప్పులకుప్పగా మార్చిన పాలకులు… ఇప్పుడు ఆ అప్పుల తిప్పల నుంచి బయటపడేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్ని వేలంలో తెగనమ్మేందుకు సిద్ధపడి… భవిష్యత్తులో భావితరాల కోసం ప్రభుత్వం తరఫున ఏ చిన్న నిర్మాణం చెయ్యాలన్నా సర్కారు భూమి కోసం దిక్కులు చూసే పరిస్థితి తీసుకొస్తున్నారు.
కోకాపేట భూముల వేలంతో వచ్చిన ఆదాయాన్ని చూసుకుని వెర్రెత్తిపోయి… మరింత దూకుడుగా భూముల వేలంతో ముందుకెళ్ళాలనుకున్న సర్కారుకు వివాదాలు, కేసులు వెల్కం చెప్పడంతో పుప్పాలగూడ, ఖానామెట్ భూముల వేలానికి బ్రేక్ పడింది. అసలు ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నందువల్లే వేలం వేస్తున్నట్టు చెప్పుకున్న తెలంగాణ పాలకులు… ఇంకోపక్క రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేస్తున్నట్టు చెప్పుకుంటోంది.
మరి ఈ ల్యాండ్ బ్యాంక్ భూములు మాత్రం కబ్జాలకు గురికాకుండా ఎలా రక్షిస్తారనే ప్రశ్నకు జవాబివ్వలేకపోవడం ప్రభుత్వం చేతగానితనం తప్ప మరొకటి కాదు. నిజానికి ఈ ప్రశ్న ఈ రోజు కొత్తగా తలెత్తింది కాదు. జులై నెలలో నేను పిటిషన్ వేసినప్పుడే…. ప్రభుత్వమే భూములను కాపాడుకోలేక, అమ్ముకోవడమేంటని న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. కనీసం అప్పుడైనా మేలుకోవలసిన సర్కారు మరికాస్త మత్తులోకి జారుకుంది. తాజాగా… అసలు ప్రభుత్వ భూములను ఎలా రక్షిస్తారో 4 వారాల్లో వివరణ ఇవ్వాలని…. వేలం వేసే భూముల వివరాలను కూడా తమకు ఇవ్వాలని న్యాయమూర్తులు సర్కారును ఆదేశించారు.
అంతే కాదు, కోకాపేట్, ఖానామెట్ మొదటి దశ వేలాన్ని సర్కారు ఏ విధంగా సమర్ధించుకుంటుందో కూడా తమకు తెలియజేయాలని హైకోర్టు అదేశించింది. అదే విచారణ సందర్భంగా… పుప్పాలగూడలోని సర్కారీ భూములను వేలం వెయ్యాలని ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వమే తెలియజేసి, వెనక్కి తగ్గి, తోక ముడిచేట్లు మన కొట్లాట ద్వారా చెయ్యగలిగాం.
నిజం చెప్పాలంటే తెలంగాణలో సర్కారు భూములకు అసలైన శత్రువు అధికార పార్టీయే… భూములతో పాటు చెరువుల ఆక్రమణల్ని కూడా ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నట్టు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులపై కోకొల్లలుగా ఆరోపణలు, బలమైన సాక్ష్యాలు మీడియాలోను… సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ సర్కారు ఇప్పటికైనా భూముల అమ్మకాన్ని నిలిపేలా ఉత్తర్వులు జారీ చేసి, జీవో 13ను కొట్టివేయాలి. ఇప్పటికీ మొండి వైఖరితో ముందుకెళితే బుద్ధి చెప్పడానికి జనం సిద్ధంగా ఉన్నారు.