నాన్న వెళ్లారు..
అమ్మ అనుసరించింది..
అంతకు ముందే ఇంట్లో పెద్దోళ్ళు ఒకరి వెంట ఒకరుగా
మాయమైపోయారు
మమతలను పంచి..
ముద్రలను మిగిల్చి..
జ్ఞాపకాలను వదిలి..!
పిల్లలు ఉన్నంత కాలం
అమ్మానాన్న ఉండరు..
కానీ ఆ ఇద్దరూ ఉన్నప్పుడు
మనం ఉన్నాం..
ఆ మనమే సంతానం..
ఒకే రక్తం..ఒకే ఇంటి పేరు..
అదే ఇల్లు..అదే అనుభూతి!
అన్నయ్య..తమ్ముడు..
అక్క..చెల్లి..
ఇవే వరసలు..
వీళ్లే వారసులు..
కలిసి పుట్టేది ఆ నలుగురే..
నీ నిండు జీవితంలో
ఎందరైనా రానీ..
ఇంకెందరైనా పోనీ…
కడదాకా నిలిచి ఉండే
బంధం రక్తసంబంధం..!
నువ్విక్కడ ఉన్నా..
నీ కన్నా ముందు
బొడ్డూడిన
అన్న భాగ్యనగరి నడిబొడ్డులో..
నీకు బిగుతైపోయిన బట్టలు
సంబరంగా తొడుక్కున్న
తమ్ముడు అమెరికాలో
మగపిల్లల మధ్య
మహారాణిలా..
మద్దిమద్దిలో మగరాయుడిలా
మీతోనే కబడ్డీ..
గూటీబిళ్ల ఆడిన..
తనకు తోడు లేక
మీతో చింతపిక్కలు…
తొక్కుడు బిళ్ళ ఆడించిన
చెల్లి పెళ్లయి అత్తారింట్లో..
ఎవరెక్కడ ఉన్నా
ఆ అమ్మ నోముఫలాలే,.
ఆ నాన్న కలల పంటలే..
అదే పేగు..ఒకే తీగ..!
మాట పట్టింపులు..
ఆస్తి వివాదాలు..
శత్రువుల్లా
సరిహద్దు గొడవలు..
పద్దతి నచ్చలేదని అన్నలు
మొగుడు వద్దన్నాడని చెల్లెళ్ళు..
రాకపోకలు మానేస్తే..
పలకరింపులు వదిలేస్తే..
ఒకనాటి అన్నదమ్ములు దాయాదులైపోతే…
అన్నాచెల్లెళ్ళు ఆగర్భ శత్రువులుగా మారిపోతే..
అక్కడ స్వర్గంలో
అమ్మ కంట్లో కలత..
నాన్న గుండెలో నలత!
మరోజన్మ ఉంటుందేమో..
కాని..మరోసారి అదే ఇంట్లో..
అదే అమ్మానాన్నల
కడుపున పుట్టేవా..
ఇలా ఆప్యాయంగా
రాఖీ కట్టేవా..
ఈ జన్మలోనే ఈ వరస..
ఇంతటి గొప్ప బంధాల్ని
ఎన్నటికీ కానీయకు కురస..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286