– పర్యాటక శాఖకు ఈ మెయిల్ ద్వారా బెదిరింపు
– బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించిన పోలీసులు
– గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్
ఆగ్రా: భారత ప్రముఖ పర్యాటక ప్రదేశం, 17వ శతాబ్దపు స్మారక చిహ్నం తాజ్ మహల్‌కు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. పర్యాటక శాఖకు ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. తాజ్ మహల్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ మహల్ వద్దకు బాంబ్ డిస్పోజల్ టీమ్‌లను, డాగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహించారు.
తాజ్ మహల్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని ఆగ్రా డీసీపీ సూరజ్ రాయ్ వెల్లడించారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదన్నారు. కాగా, బెదిరింపు మెయిల్ రాగానే పర్యాటకులను బయటకు పంపించి తనిఖీ చేశారు.