-బోనాల నిర్వహణపై మంత్రులు అల్లోల, తలసాని సమీక్ష
-మహంకాళీ బోనాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం
హైదరాబాద్, జూలై 1: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో డా.బీఆర్. అంబేడ్కర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బోనాలు ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సీయం కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, గత తొమ్మిదేళ్ళుగా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు.
బోనాల ఉత్సవాలకు ఈ ఏడాది రూ.15 కోట్లు కేటాయింంచారని, ఆ నిధులను సద్వినియోగం చేసుకుని బోనాలను ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, డిప్యూటీ మేయర్, తదితరులు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
జూలై 9వ తేదీన సికింద్రాబాద్ మహాంకాళి బోనాలు, 16న హైదరాబాద్ పాతబస్తీ బోనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాలకు వారం రోజుల ముందే ఆలయాల్లో బోనాల ఏర్పాట్ల కోసం ప్రత్యేక ఆర్థిక సహాయం చెక్‌లు అందజేయాలని అధికారులకు సూచించారు.
బోనాలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయాల వద్ద క్యూలైన్లు, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఉత్సవాల నిర్వహణ, అలంకరణ, పూజ కార్యక్రమాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులను సకాలంలో ఆలయ కమిటీలకు మంజూరు చేయాలన్నారు.
అమ్మవారి ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దాలని, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించాలని తెలిపారు. సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి ప్రత్యేక కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. ఆలయాలో పాటు జంట నగరాల్లోని ప్రముఖ ప్రదేశాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు.
భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్ లతో పాటు లేజర్ షో ఏర్పాటు చేయాలని, బోనాలను విశిష్టతను తెలియజెప్పేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఐ అండ్ పీఆర్, పర్యాటక శాఖ అధికారులను అదేశించారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, దేవాదాయ, పర్యాటక, సమాచార, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మహంకాళీ బోనాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళీ దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే బోనాల మహోత్సవాలకు రావాలంటూ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు డా. బీఆర్. అంబేడ్కర్ సచివాయంలో మంత్రి తలసాని నేతృత్వంలో ఆలయ కమిటీ, ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు.