-కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడింది
-శాసనసభ నియమాలు, విధానాలు, గౌరవాన్ని కాలరాసే ప్రయత్నం
-బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి
ఇటీవల జరిగిన శాసనసభా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 14 శాతం మెజారిటీ సాధించింది. మంచి ఓటు శాతం లభించింది. చాలా నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి మంచి మెజారిటీ సాధించాం. నూతన శాసనసభ కొలువుతీరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ నియమాలు, విధానాలు, గౌరవాన్ని కాలరాసే ప్రయత్నం చేసింది.
శాసనసభలో ప్రొటెమ్ స్పీకర్ గా సీనియర్ వ్యక్తులను నియమించే సంప్రదాయం ఉంది. కానీ, మజ్లిస్ పార్టీతో చేసుకున్న లోపాయికారి ఒప్పందం మేరకు కాంగ్రెస్ పార్టీ.. మజ్లిస్ పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి బొటాబొటీ మెజారిటీ ఉన్నది. తుమ్మినా, దగ్గినా కూలిపోయే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. అందుకే పథకం ప్రకారం మజ్లిస్ పార్టీకి చెందిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్ గా నియమించి, శాసనసభా నియమాలను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తోంది.
సీనియర్ ఎమ్మెల్యేలను మజ్లిస్ పార్టీ వ్యక్తిని ప్రొటెం స్పీకర్ గా చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ నియమాలను ఉల్లంఘించినందుకే శాసనసభా సమావేశాలను బహిష్కరించాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు రోజులు కాకముందే.. మజ్లిస్‌తో తన పాత విధానాలను కాంగ్రెస్ మళ్లీ అవలంబిస్తున్నది. కాంగ్రెస్, మజ్లిస్ రెండూ ఒకటేనని మేము ఇంతకు ముందు అనేక సార్లు చెప్పాం. కానీ మజ్లిస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడింది. రెగ్యులర్ స్పీకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాతనే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. శాసనసభ నిబంధనలు ఉల్లంఘించి ప్రొటెం స్పీకర్ బాధ్యతలు మజ్లిస్‌కు ఇవ్వడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం.