Suryaa.co.in

Andhra Pradesh

బాబుది కంపునోరు.. రామోజీవి కంపురాతలు

– ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంటే మీకెందుకు కడుపుమంట?
– ఈనాడు అబద్ధపు రాతలపై చర్చించే దమ్ముందా రామోజీ?
– నాడు, నేడూ జగన్‌ది ఒకటే స్వరం
– నాడు 12వేల ఎకరాలు వద్దన్నాం కనుకే..
– నేడు 2300 ఎకరాలకు కుదించి రైతులకు లబ్ధిచేకూర్చాం
– కోర్టువివాదాలు పరిష్కరించాకే భోగాపురం నిర్మాణ పనులు చేపట్టాం
– రాష్ట్రాభివృద్ధికి తలమానికంగా భోగాపురం ఎయిర్‌పోర్టు
*– ఉత్తరాంధ్రకు ఇంత మేలు చేస్తున్న జగన్కి మా ప్రాంత ప్రజలంతా అండగా నిలుస్తారు
– ఉత్తరాంధ్ర వాసిగా సీఎం జగన్‌ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా..
-ః రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

బాబుదే కంపునోరు.. రామోజీవే కంపురాతలుః
చంద్రబాబు ఏ పనిచేసినా.. ఏం చెప్పినా కూడా రాజకీయలబ్ధి కోసమే తప్ప ప్రజాప్రయోజనార్ధం ఏం చేశాడని అడుగుతున్నాను. ఇందుకు సమాధానం ఎవరైనా చెప్పగలరా..? విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం మూడు ప్రాంతాలకు సమీపంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భోగాపురంను ఎంపిక చేశాక, దాన్ని ప్రభుత్వం ఆమోదించి ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తుంటే.. అక్కడ ప్రాంత ప్రజలంతా ఆనందంగా ఉంటే, చంద్రబాబుకు, రామోజీరావుకు ఎందుకు కడుపుమంటతో రగిలిపోతున్నా రో ప్రజలు అర్ధం చేసుకోవాలి.

భూసేకరణకు సంబంధించి కూడా, ఈ ప్రాంత రైతులతో రోజువారీ సమావేశాలు పెట్టి అందరితో మాట్లాడాం. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధిగా, మంత్రిగా నేను కూడా రైతు సమావేశాల్లో పాల్గొన్నాను. అందరినీ మెప్పించాం. ఒప్పించాం. మరి, ఆనాడు బాబు హయాంలో ఆపార్టీ నేతలు, అప్పటి విమానయాన శాఖ కేంద్ర మంత్రిగానీ ఏరోజైనా అక్కడి రైతులతో మాట్లాడారా..? రైతుల అవసరాల్ని తీర్చగలిగారా..? అలాంటి వాతావరణమే కనిపించలేదు కదా..? గంటకో మాట, ఘడియకో విమర్శ చేసే చంద్రబాబుది కంపునోరైతే, ఈనాడు రామోజీరావువి కంపురాతలని స్పష్టంచేస్తున్నాను.

కడుపుమంటతో బాబు, రామోజీః
ఇదిలాఉండగా, ఉత్తరాంధ్రలో ఒక పండుగ వాతావరణంలో అభివృద్ధి పనులుకు మా ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారని రాష్ట్రప్రజలంతా ఆనందంగా ఉన్న తరుణంలో కొందరు తట్టుకోలేకపోతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన్ను భుజానెత్తుకుని మోస్తున్న ఈనాడు రామోజీరావుకు కడుపుమండుతుంది. దాని తాలూకూ దురద్దేశాన్ని వారి పత్రిక, టీవీ ఛానెళ్ల కథనాల ద్వారా ప్రదర్శిస్తున్నారు.

వివాదాల్ని పరిష్కరించాకే భూసేకరణ చేశాంః
ఈరోజు భోగాపురం విమనాశ్రయానికి సంబంధించి మేం అక్కడ ఎవరినైనా బెదిరించి, వారివద్ద బలవంతంగా భూముల్ని సేకరించినట్లు రైతులొచ్చి మీకు చెప్పారా.. రామోజీరావు? అంటూ ప్రశ్నిస్తున్నాను. ఎవరూ మీకు ఫిర్యాదు చేయకపోతే.. ఎందుకు అంత కడుపుమంటతో రాతలు రాయిస్తున్నారు..? ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందకూడదనే అభిప్రాయంతో మీరు ఉన్నారా..? భోగాపురం ఎయిర్‌పోర్టు అనేది విభజన చట్టంలో ఉన్న అంశం కాదా..? అని రామోజీని అడుగుతున్నాను.

నాడు-నేడు జగన్ ది ఒకే స్వరంః
మా నాయకుడు, ఆంధ్రుల ఆరాధ్యుడైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి నాడు, నేడు ఒకే నోరుతోనే మాట్లాడుతున్నారు. చంద్రబాబులా.. నాలుగు నాలుకలతో, బాబుకు మద్ధతుగా మీరంతా నాలుగైదు నోళ్లతో మాట్లాడినట్లు మా నాయకుడు వ్యహరించడం లేదు. గతంలో చంద్రబాబు మిమ్మల్ని(రామోజీ, రాధాకృష్ణ) కలుపుకుని ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో.. ఎంతమందిని దోచుకున్నారనేది, ప్రజలెంతగా మానసికక్షోభ అనుభవించారనేది, ఈ రాష్ట్రంలో బాబు దుష్ట కూటమి జరిపిన ఘోరకలిని మా నాయకుడు జగన్‌ పదే పదే చెప్పారు. అదేనోరుతో ఇప్పుడు మేం అధికారంలోకి వచ్చాక కూడా చెప్పినట్టుగా, ఈరాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అవినీతికి తావులేకుండా పారదర్శకమైన పాలన అందిస్తున్నారు.

బాబు 12వేల ఎకరాలు కావాలంటే.. మేం 2300కు కుదించాంః
ఇప్పటికైనా ఈనాడు రామోజీరావు వాస్తవాల్ని పునఃపరిశీలించుకుని చంద్రబాబును వీటిపై ప్రశ్నించండి. ఆరోజు భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఎన్ని ఎకరాలు భూసేకరణ చేయాలనుకున్నారు..? 12వేల ఎకరాల్ని భూసేకరణకు అవసరమని మీరు అడగారా..లేదా..? ఆమేరకు 12వేల ఎకరాల్లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని అధికారులు భూసర్వే జరిపించలేదా..? ఆరోజు మేమంతా కలిసి మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారిని కోరినప్పుడు.. ‘అవును, విమానాశ్రయానికి ఇక్కడ 12వేల ఎకరాలు అవసరం లేదు. చెన్నైతోపాటు ఇతర విమనాశ్రయాలతో పోల్చితే అన్ని ఎకరాలు అక్కర్లేదని.. ఒక వెయ్యి ఎకరాలు సరిపోతుంది’ అని చెప్పారు. ఆమేరకు పోరాటం చేశాం. అది వాస్తవమే. అప్పటి ప్రభుత్వం దౌర్జన్యంగా భూసేకరణ చేస్తే … మేం అధికారంలోకి రాగానే వాటిని తిరిగిస్తామని చెప్పడం కూడా వాస్తవమే. ఆరోజు మా నాయకుడు జగన్‌గారు, మేము కలిసి చేసిన పోరాటఫలితంగానే, ఈరోజు భూసేకరణను 2300 ఎకరాలకు కుదించడం జరిగిందని స్పష్టం చేస్తున్నాను. ఇవన్నీ నిజాలు కాదా.. రామోజీ..? ఇవన్నీ మీకు తెలియదా..?అని నిలదీస్తున్నాను.

భోగాపురానికి బాబు శంఖుస్థాపన చేస్తే.. ఆ కేంద్ర మంత్రి ఎందుకు రాలేదు?
బాబు ఎప్పుడో అక్కడ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారని పెద్దపెద్దగా అరుస్తున్నారు కదా..? నేనొక ప్రశ్న అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి. బాబు అప్పుడు శంకుస్థాపన చేస్తే.. ఆ కార్యక్రమానికి అప్పటి కేంద్ర విమానాయాన శాఖ మంత్రి, ఆ నియోజకవర్గ నియోజవర్గ ఇంచార్జి ఎందుకు హాజరుకాలేదు..? అని అడుగుతున్నాను. మీపార్టీ నాయకుడు, మీ పార్టీ తరఫున కేంద్రమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా మీ కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేకపోయాడు..? ఆరోజు ప్రజల మధ్యకొచ్చి శంకుస్థాపన చేస్తే, వారినుంచి తిరుగుబాటు వస్తుందని భయపడి ఎక్కడ్నుంచో కార్యక్రమం చేశారు. ఇది వాస్తవం కాదా రామోజీ…? ఏదో మీకు ఈనాడు అనే పత్రిక అనేది ఒకటుందని మామీద బురదజల్లేందుకు అదేపనిగా విషాన్ని కక్కుతారా..?

భూసేకరణపై చర్చించే దమ్ముందా రామోజీ..?
అసలు, మీకు భోగాపురం విమానాశ్రయంకు సంబంధించిన క్లారిటీ ఏ అంశంలో కావాల్నో నా దగ్గరకు రండి చర్చిద్దాం.. అక్కడ అన్ని ఎకరాలెందుకు.. ఇక్కడ ఇన్ని ఎకరాలెందుకు అని ఇప్పుడు తప్పుడు కథనాలు రాయడం కాదు. రైతులెవరైనా ఈనాడుకు ఫిర్యాదు చేశారా..? బాబు హయాంలో 12 వేల ఎకరాలొద్దని మేం పోరాడాం.. దాని తాలూకా సేకరణను కుదించాం. ఇప్పుడు మేం చేసిన భూసేకరణపై సమస్య ఎక్కడుందో.. ఎవరిని బెదిరించి లాక్కొన్నామో.. ఎవరైనా కోర్టుకెళ్లిన వివాదం పెండింగ్‌లో ఉందా..? అని అడుగుతున్నాను. న్యాయస్థానంలో ఉన్న అన్ని వివాదాల్ని పరిష్కరించాకనే, రైతులకు పరిహారాన్ని అందించాకనే, వారికి ప్రత్యామ్నాయం చూపించాకనే మేం విమానాశ్రయానికి శంకుస్థాపన పెట్టుకున్నాం కదా..? వీటిని రాసే దమ్మూ, ధైర్యం రామోజీరావుకు ఉందా..?

ఉత్తరాంధ్ర వాసిగా సీఎం కి కృతజ్ఞతలు
గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక బృహత్తర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మారుతోన్న తరుణంలో ఇక్కడి ప్రాంతానికి అవసరమైన ప్రాజెక్టు వచ్చింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం దాదాపు 30 నెలల కాలంలోనే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి గారు కోరడం.. 2025 డిసెంబర్‌నాటికి మొదటి విమానాన్ని ఇక్కడ్నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు సన్నద్ధం చేస్తామని విమానాశ్రమ నిర్మాణ సంస్థ యాజమాన్యం కూడా బహిరంగంగా ప్రకటించడం చాలా సంతోషకరం. ఆ ప్రాంత వాసిగా, రాష్ట్రంలో బాధ్యత గల్గిన పౌరుడిగా నేను ముఖ్యమంత్రి కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి మహత్తర ప్రాజెక్టు పనులు కూడా ఈరోజు నుంచే ప్రారంభమై శరవేగంగా పూర్తిచేస్తారనే పూర్తి నమ్మకంతో ఉన్నాం.

LEAVE A RESPONSE