కో‘పాల్‌’.. తా‘పాల్‌’.. మురి‘పాల్‌’

-ఫాఫం..కెఏ ఫాలన్నియ్య
(మార్తి సుబ్రహ్మణ్యం)

కిలారి ఆనందపాల్‌ తెలుసా? ఓహో అలా అంటే ఎవరికీ తెలియదు కదా? అదేనండీ.. కేఏ పాల్‌ తెలుసుకదా? యస్‌. ఆ పాలే.. ఈ పాల్‌! యూట్యూబ్‌లో లక్షల మంది ‘అభిమాన ఓటర్ల’ను సంపాదించుకున్న ఫాలన్నియ్య మాట్లాడితే కామెడీగా ఉంటుంది కానీ, ఆయన సీరియస్‌గానే మాట్లాడతారన్న విషయం ఎవరికీ తెలియదు. అందుకే ఆయన ఇంకా ఏ రాష్ట్రానికి సీఎంగానీ, ఏ దేశానికి పీఎం గానీ కాలేకపోతున్నారు. ఫాలన్నియ్య ఆంజనేయస్వామి లాంటోడు. ఆయన బలం ఆయనకు తెలియదు మరి!

17 లక్షలమందికి ఉచిత విద్యత అందించి.. కోట్లాదిమంది రోగులకు తన ఆశీర్వాదంతో స్వస్థత చేకూర్చిన పాలన్నియ్యకు.. ఫాఫం.. ఈ మధ్య, ముఖ్యమంత్రి సీటుపై మనసయింది. అది ఏ రాష్ట్రానికయినా ఫర్వాలేదట. అది ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన ఆప్షన్‌. తెలుగు ప్రజలకు ఆయన ఆ వెసులుబాటు ఇచ్చినందుకు జనం పుణ్యం పుచ్చిపోయినట్లే మరి!

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫాలన్నియ్యను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారని ఆయన.. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను ఢిల్లీ ప్రజలు సీఎంను చేస్తే, ఇక్కడ తెలుగువారు తననెందుకు సీఎంను చేయరన్నది ఫాలన్నియ్య ప్రశ్న. అసలు తన వంటి గుణవంతుడు కమ్‌ పనిమంతుడు ఎక్కడ దొరుకుతారన్నది ఆయన వాదన. కరస్టే కదా?!

అయితే.. ప్రజలు ఫాలన్నియ్యను సీఎంను చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు కానీ, అది ఏ రాష్ట్రానికన్నది వారికీ అర్ధం కావడం లేదు. అటు ఫాలన్నియ్యకూ క్లారిటీ లేదు. కాసేపు తెలంగాణ కాబోయే సీఎంను తానేనంటారు. మరికొద్దిసేపటికి ఏపీ ప్రజలకు అన్ని పార్టీలపై నమ్మకం పోయింది కాబట్టి, తానే సీఎం అంటారు. ఈ విషయంలో భారత ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని, పాలన్నియ్య ఏ రాష్ట్రానికి సీఎం అయితే బాగుంటుందో పోలింగ్‌ నిర్వహిస్తే సరి!

మరుసటిరోజు హటాత్తుగా , ప్రధాని కూడా తానే అవుతానంటారు. అది ఏ దేశానికో చెప్పరు. అందువల్ల ఫాలన్నియ్య అసలు, ముందు తాను ఏం కావాలని కోరుకుంటున్నారో చెబితే, ఆ తర్వాత ఆయనను ఏం చేద్దామన్నది తాము ఆలోచిస్తామన్నది జనం జవాబు. అందువల్ల ఫాలన్నియ్య అర్జెంటుగా.. తాను ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నారో ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఫాలన్నియ్య ఏ రాష్ట్రానికి సీఎం అయినా ఆ రాష్ట్రానికి వేలు, లక్షల కోట్లు సాయంగా వచ్చిపడటం ఖాయం. అమెరికా, ఇంకా దాని అబ్బలాంటి దేశాల అధ్యక్షులు, ప్రధానులంతా ఫాలన్నియ్య చేతిలో ఉన్నారు. ఫాలన్నియ్యను వారు కలవరిస్తుంటారు. ఫాలన్నియ్య కూడా వారి వద్దకు వెళ్లి ప్రార్ధనలు చేస్తుంటారు. ఫాలన్నియ్య లేకపోతే వారంతా బ్రేక్‌ఫాస్ట్‌-లంచ్‌-డిన్నర్‌ చేయరు. వైన్‌ తాగరు. మరి అంతటి పలుకుబడి గల పాలన్నియ్యను, అలా వదిలేస్తే నష్టపోయేది ప్రజలే. కాబట్టి ఆయన ఏ రాష్ట్రానికి సీఎం అయితే సుఖంగా ఉంటుందన్నది.. అర్జంటుగా తేల్చాల్సిందే!

తాజాగా ఫాలన్నియ్య ఏసు ప్రభువు ద్వారా ఒక సర్వే చేశారట. అందులో కేసీఆర్‌ పార్టీకి పెద్దగా ప్రజాదరణ లేదట. బీజేపీకి కేసీఆర్‌ పుణ్యాన 5 శాతం ఓట్లు వచ్చాయట. ఇక తనకు మాత్రం 60-70 శాతం ఆదరణ ఉందని తేలిందట. ఆంధ్రాలో అసలు బీజేపీ లేనేలేదట. మరి ఇంకెందుకు తనను ఏపీ సీఎంను ఎందుకు చేయరన్నది ఫాలన్నియ్య తాజాగా ప్రజలకు సంధించిన ప్రశ్న.

త్వరలో 8లక్షల కోట్ల రూపాయలు రాబోతున్నాయట. కాబట్టి ఆంధ్రాకు ఫాలన్నియ్యను ప్రజలు సీఎంను చేయవచ్చు. కానీ అన్ని లక్షల కోట్లు.. ఎప్పుడంటే అప్పుడు తీసుకురాగల సమర్ధుడయిన ఫాలన్నియ్య, తమ రాష్ట్రానికే సీఎంగా ఉండాలన్నది తెలంగాణ ప్రజల వాదన. దానికోసం తాము కూడా రివర్సులో ప్రార్ధనలు చేస్తామంటున్నారు కూడా. కాబట్టి ఫాలన్నియ్య అర్జెంటుగా ఏ రాష్ట్రానికి సీఎం కావాలన్నది తేల్చుకుంటే బెటర్‌.

ఫాలిన్నయ్య చెబుతున్న 8 లక్షల కోట్ల నోట్లు సిద్ధంగానే ఉన్నాయట. వచ్చి విమానంలో తీసుకువెళ్లమన్న కబురు కూడా కాకితో పంపించారు. అయితే ఫాలన్నియ్య విమానాన్ని ప్రభుత్వం సీజ్‌ చేసింది. దానికితోడు డబ్బులు తీసుకురావడానికి సరైన రోడ్లు లేవట. పైగా కంటైనర్ల టైర్లు ప్రత్యేకంగా తయారుచేయాలట. దానికి ఆల్రెడీ ఆర్డర్‌ ఇచ్చారంటున్నారు. ఈలోగా జగనన్న ఏపీలోని రోడ్లను అద్దంలా తయారుచేస్తే, 8 లక్షల కోట్ల కంటైనర్‌ వచ్చేందుకు సిద్ధంగా ఉందని ఫాలన్నియ్య అభిమానుల ఉవాచ. అన్నట్లు.. ఆ డబ్బు మళ్లీ వెనక్కి ఇవ్వాల్సిన పనిలేదట. అంతా ఫ్రీయేనట. బైడెన్‌ లాంటి పెద్దోళ్లంతా.. అసలు ను వ్వు అడగడమేమిటి? మేము కాదనడమేమిటని ఫాలన్నియ్యతో అన్నారట. పైగా ఆ డబ్బు మళ్లీ ఇస్తానని చెప్పిన పాలన్నియ్యపై.. బైడెన్‌ అండ్‌ అదర్స్‌ గయ్యిమని అంత్తెత్తు లేచారట. నీ లాంటి మహనీయుడి నుంచి డబ్బులు తీసుకునేంత పాపులం కాదని, ఫాలన్నియ్యపై ఒంటికాలితో లేచారట. నీ మహిమల ముందు మా లక్షల కోట్లు ఓ లెక్కనా అని అరచి కరిచేంత పనిచేశారట. సో.. ఆ 8లక్షల కోట్ల రూపాయలు మళ్లీ చెల్లించాల్సిన పనిలేదన్నమాట. ఫాలన్నియ్య వల్ల ఇంత మేలు జరుగుతుంటే, అర్జంటుగా ఆయనను ఏదో ఒక రాష్ట్రానికి సీఎంను చేస్తే బెటరే కదా?

Leave a Reply