Suryaa.co.in

Telangana

మజ్లిస్‌ ఒత్తిడికి తలొగ్గే ‘తెలంగాణ’ వేడుకలకు సీఎం దూరం

– ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ 

హైదరాబాద్: మజ్లిస్‌ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరుకావడం లేదని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకలకు ముఖ్యమంత్రి రాకపోవడం విచారకరమన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. రేవంత్​కు కూడా కేసీఆర్​కు పట్టిన గతే పడుతుందన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదు.. అయినప్పటికీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మూడేళ్ళుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వేడుకలను ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు.

ఈ వేడుకలకు గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని, తెలంగాణ విమోచన దినం చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి, అమరవీరుల పోరాటగాథలను కళ్ళకుకట్టే విధంగా అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించామని గుర్తుచేశారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా సెస్టెంబరు 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో రిహార్సల్స్​తో పాటు కవాతు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను లక్ష్మణ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్‌తో పాటు మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్​సింగ్ రాథోడ్, తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ విమోచన వేడులకు సీఎం రేవంత్‌ రెడ్డి రాకపోవడంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ మాదిరిగానే దారుస్సలాం ఆదేశాలకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఫైరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందిపోయి.. కేవలం మజ్లిస్ కు లొంగిపోయి, వారి ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడాన్ని ప్రజలు క్షమించరని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రజాపాలన దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని లక్ష్మణ్ దుయ్యబట్టారు. నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల చరిత్రను, అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేసేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా జరుపుకోవడం ఇది మూడోసారి అన్నారు. హైదరాబాద్ సంస్థానం నిజాం నుంచి విముక్తి పొందినప్పటికీ కమ్యూనిస్టులు ఎందుకు పోరాటం చేశారో చెప్పాలన్నారు. కేవలం రష్యాతో అనుబంధంగా ఎర్రరాజ్యంగా మార్చడం కోసమే రజాకార్లకు వ్యతిరేకంగా మిలటరీతో యుద్ధానికి దిగారంటూ లక్ష్మణ్ మండిపడ్డారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరుచుకుని, తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవం కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించామన్నారు. మజ్లిస్ ఒత్తిడి కి తలొగ్గి అయన రావడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా మజ్లిస్ మెప్పుకోసం పని చేస్తే తెలంగాణ ప్రజలు సహించరని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE