Suryaa.co.in

Editorial

‘బావ’గారూ.. బాగున్నారా?

– ‘బావ’ల.. సయ్యా!
– తెలుగునాట బావల గోల
– తెరపైకి బావల బాగోతాలు
– మరదలు పెట్టిన కేసులో నారాయణ
– బావ తనను వేధిస్తున్నారని మరదలు ప్రియ ఫిర్యాదు
– అయినా ఇప్పటిదాకా బావను టచ్‌ చేయని పోలీసులు
– ఇంకా కేసు దర్యాప్తు చేస్తూనే ఉన్నారట
– ఏపీలో ఆ‘ సీఎంఓ బావ’గారిదే హవా
– విద్యుత్‌, మైనింగ్‌లో ఆయన చెప్పిందే వేదం
– కాంట్రాక్టులు, బదిలీలు, పోస్టింగుల్లో ఆయనే కీలకమట
– సెటిల్‌మెంట్లలో సీనియర్‌ హ్యాండ్‌గా పేరు
– మీడియాలో ఆరోపణలు వచ్చినా బావగారు బేఖాతర్‌
– బావలు చుట్టూ తిరుగుతున్న మీడియా
( మార్తి సుబ్రహ్మణ్యం)

కాకులు కనిపించని తెలుగు రాష్ర్టాల్లో.. ఇప్పుడు ‘బావల గోల’ ఎక్కువయినట్లుంది. పెద్ద స్థాయిలో ఉన్న ఈ బావల హవాకు, అందరూ హడలిపోతున్నారు. వీరి పలుకుబడి ముందు మిగితావన్నీ చిన్నబోతున్నాయి. అంత శక్తివంతమైన ఈ బావలు ఎవరి పరిథిలో వారు.. ఎవరి పద్ధతిలో వారు ఎదురులేకుండా దూసుకుపోతున్నారు. విచిత్రంగా.. ఇద్దరిపై ఆరోపణలు వచ్చినా బేఖాతర్‌. వారి చుట్టూ మీడియా తిరుగుతున్నా బేఫికర్‌. ఇదీ తెలుగురాష్ర్టాల్లో ‘నారాయణ- కృష్ణ బావ’ల హవా.

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రాష్ర్టాల్లో బావల హవా ఒక రేంజ్‌లో నడుస్తోంది. ఒకరు ప్రభుత్వ స్థాయిలో.. మరొకరు ప్రైవేటుగా రెచ్చిపోతున్నారట. నారాయణ విద్యాసంస్థల అధిపతి- మాజీ మంత్రి నారాయణ.. తనను లైంగికంగా వేధిస్తున్నారని, ఆయన మరదలు విష్ణుప్రియ రాయదుర్గం పోలీసుస్టేషన్‌లో, ఫిర్యాదు చేసిన వైనం సంచలనం సృష్టించింది. ఆ మేరకు ఆమె ఇప్పటిదాకా మూడు వీడియోలు విడుదల చేశారు. అందులో తనకు జరిగిన అన్యాయం, తన బావ నారాయణ వల్ల ఎదుర్కొన్న హింసను, అందులో వెల్లడించారు. తన బావ స్త్రీలోలుడని ఆరోపించింది.

నారాయణ బావపై మరదలు విష్ణుప్రియ చేసిన ఆరోపణలను, ‘నారాయణ బావ’ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఆమె ఫిర్యాదును కూడా ఖాతరు చేసినట్లు కనిపించలేదు. ఇప్పటివరకూ తన నారాయణ సంస్థల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు చేసుకుని, అవి మీడియాలో గత్తర అయితేనే, నారాయణ బావ పెద్దగా ఖాతరు చేయలేదు. అలాంటిది మరదలు ఫిర్యాదు చేస్తే భయపడతారా? అన్నది విమర్శలకుల వ్యాఖ్య.

అందుకే పోలీసులంతా మనోళ్లే అన్నంత లైట్‌ తీసుకున్నారు. ఇవన్నీ తనకు మామూలే అన్నంత ధీమాతో ఉన్నారు. కాకపోతే బయటకు రావడానికి ముఖం చెల్లక, ఇంట్లోనే ఉంటున్నారు. మిగిలిన వన్నీ యధావిధిగానే జరిగిపోతున్నాయి.

ఇక ఏపీ‘ సీఎంఓ బావ’ గారి హవాపై, మీడియాలో కథనాలు పుకార్లు షికారు చేస్తున్నాయి. విద్యుత్‌ శాఖలో డీఈ స్థాయి అధికారి అయిన బావ గారు, యమా ‘పవర్‌’ఫుల్‌ అయినందున, కార్యం కోసం వచ్చిన వారంతా.. కాగల కార్యం తీర్చే ‘బావ గంధర్వుడి’ శరణు వేడుతున్నారట. ఒక్క విద్యుత్‌ శాఖ మాత్రమే కాదు. రెవిన్యూ, మైనింగ్‌ శాఖలోనూ బావగారి సిఫార్సులకు తిరుగులేదట.

ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనమట. ఆయన‘ మురళీ నాదా’నికి ఎవరైనా పరవశులు కావాల్సిందేనట. అంటే బావగారు అంత పనిమంతుడన్నమాట. అందుకే బావగారు తలచుకుంటే.. కాని పని అంటూ ఏమీ, ‘ఏపీ భూప్రపంచం’ మీద ఉండదన్నది, ఒక ప్రచారం. కాకపోతే మాట-ముచ్చట్లన్నీ హైదరాబాద్‌లోనే. దానికిముందు ప్రాధమిక చర్చలన్నీ.. విజయవాడ విద్యుత్‌ సౌధ దగ్గర ఉన్న, ఒక హోటల్‌రూములోనే జరపాలన్నది బావగారి నిబంధనట. ఆ తర్వాత అసలు కథను బావగారే స్వయంగా నడిపిస్తారట.

ఇప్పుడు మైనింగ్‌ శాఖలో బావగారే కర్త, కర్మ, క్రియ అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గనుల లీజు రద్దు కాకుండా, యజమానులు బావగారి దర్శనం కోసం క్యూలు కడుతున్నారట. బావగారిని దర్శించి, ఆయనకు చందనతాంబూలాలు సమర్పించి అలా బయటపడ్డవారి సంఖ్య, ఆరుపదుల పైమాటేనని బయట జరుగుతున్న ప్రచారం.

నిబంధనల ప్రకారం.. గనులు లీజు తీసుకున్న వారు పని ప్రారంభించాలి. అలా ఉత్పత్తి ప్రారంభిస్తేనే సర్కారుకు ఆదాయం వస్తుంది. కానీ లీజులు తీసుకుని పనులు ప్రారంభించకపోతే, సదరు మైనింగ్‌ అనుమతులు రద్దు చేస్తారు. ఇప్పుడు ఆ నిబంధనే బావగారికి కాసులు కురిపిస్తున్నాయట.
పల్నాడు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన లీజు దారులు బావగారితో మాట్లాడుకుని, స్టార్‌ హోటల్‌లో ముడుపులు కట్టి బయటపడ్డారన్న ప్రచారం గత కొంతకాలం నుంచి బహిరంగంగానే వినిపిస్తోంది. అది ఇటీవల సోషల్‌మీడియాలో వెలుగుచూడగా, ఇప్పుడు నేరుగా అసలు మీడియాలోనే ప్రచారంలోకి వచ్చింది.

సదరు బావగారు ఆ శాఖ.. ఈ శాఖ అని కాకుండా.. ఏ శాఖలో పనులనైనా, చిటికెలో చేస్తారన్న పేరుంది.అందుకే ఆయనకు అభిమానులు ఎక్కువ. వెంకటేశ్వరస్వామికి కోరుకున్న పనులు పూర్తయితేనే, భక్తులు ముడుపులు చెల్లిస్తారు. కానీ కృష్ణబావకు మాత్రం, ముందుగానే ముడుపులు చెల్లించాలన్న ప్రచారం జరుగుతోంది. బావలీలలపై మీడియాలో పుంఖానుపుంఖాలుగా ఆరోపణలొచ్చినా, బావగారిని కదిలించే ధైర్యం ఎవరికీ లేకపోవడమే ఆశ్చర్యం. దీన్నిబట్టి ‘వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఇబ్బందిలేద’న్న సామెత, నిజమనిపిస్తోందన్నది ఉద్యోగవర్గాల ఉవాచ.

కాగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొందరు లీజు దారులంతా కలసి.. ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల ద్వారా, బావగారి బండారం బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు మైనింగ్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. బావగారి దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే అదొక్కటే మార్గమని భావించి, ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

అదేవిధంగా బాపట్ల జిల్లాలో భూముల లీజుపై కన్నేసిన ఇద్దరు ప్రముఖులు.. ఇప్పటికే అక్కడికి వెళ్లి సైట్‌ విజిట్‌ చేసినట్లు, గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు ఎమ్మెల్యే ద్వారా.. మరొకరు జిల్లాలో కీలక అధికారి ద్వారా పని పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు, జిల్లా వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టూరిజం డెవలెప్‌మెంట్‌ ముసుగులో జరుగుతున్న ఈ వ్యవహారంలో ఓ మంత్రి, సినీరంగంలోనే ఉన్న ఓ ఎమ్మెల్యే సోదరుడు చక్రం తిప్పుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

 

LEAVE A RESPONSE