Suryaa.co.in

Editorial

బీజేపీకి బీఆర్‌ఎస్.. ‘బస్సు’ సేవ!

– ఖమ్మంలో రాహుల్ సభకు బస్సులు ఇవ్వని కేసీఆర్ సర్కారు
– ఆర్టీసి బస్సులివ్వాలని కాంగ్రెస్ కోరినా నిరాకరించిన ఆర్టీసీ
– ప్రైవేటు బస్సులతో జనసేకరణ చేసిన పొంగులేటి
– అయినా వాటినీ ఆపివేసిన బీఆర్‌ఎస్ సర్కార్
– ఇప్పుడు ఖమ్మంలో అమిత్‌షా సభలకు ఆర్టీసీ బస్సులు
– అడిగిన వెంటనే అంగీకరించిన టీఎస్‌ఆర్టీసీ
– అమిత్‌షా సభపై ఎదురుదాడి చేయని బీఆర్‌ఎస్
– గతంలో అమిత్‌షాను భ్రమిత్‌షా అని దాడిచేసిన బీఆర్‌ఎస్
– ఇప్పుడు ఖమ్మం సభపై బీఆర్‌ఎస్ నేతల మౌనరాగం
– హరీష్, దాసోజుకు తప్ప మిగిలిన వారికి పట్టని ఎదురుదాడి
– అమిత్‌షాైకు హరీష్ ట్విట్టర్ లో చురకలు
– ట్వీట్, ప్రకటన తో బీజేపీని చెండాడిన ఎమ్మెల్సీ దాసోజు
– ఎదురుదాడిలో కనిపించని పార్టీ ప్రముఖులు
– బీజేపీపై ‘కారు’ రూటు మారినట్లేనా?
– ఆ రెండు పార్టీల మ్యాచ్‌పిక్సింగుకు నిదర్శనమంటూ కాంగ్రెస్ ఫైర్
– కేసీఆర్ ఎందుకు స్పందించలేదన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్‌రెడ్డి
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీపై ఉరుములు పిడుగులతో హడలెత్తించిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు ఆ పార్టీపై తన వైఖరి మార్చుకుందా? బీజేపీని నేరుగా ఢీకొట్టాలన్న కారు వేగం- గమనం మారిందా? రాహుల్‌గాంధీ సభకు బస్సులివ్వని కేసీఆర్ సర్కారు.. అమిత్‌షా సభకు మాత్రం మహదానందంతో బస్సులు సమకూర్చడంలో మర్మమేమిటి? అంటే ఆ ప్రకారంగా.. బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్య రాజీ కుదిరిందన్న వార్తలు నిజమేనా?.. తాజాగా ఖమ్మంలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా హాజరైన, రైతుభరోసా-బీజేపీరోసా బహిరంగసభను పరిశీలిస్తే.. మెడపై తల ఉన్న ఎవరికైనా ఇలాంటి అనుమానాలే తెరపైకి వస్తాయి.

ఇటీవల బీఆర్‌ఎస్ మాజీ నేత, ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా, ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. జనసమీకరణ బాధ్యత తీసుకున్న పొంగులేటి, టీఎస్‌ఆర్టీసీని బస్సులు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఆ మేరకు ఆయన ఏయే జిల్లాలు, ఏయే నియోజకవర్గాల నుంచి, ఎన్ని బస్సులు కావాలో ఒక లిస్టు తయారు చేశారు.

అయితే రాహుల్‌గాంధీ ఖమ్మం సభకు, బస్సులు ఇవ్వడం కుదరదని ఆర్టీసీ తేల్చిచెప్పింది. ఉన్న బస్సులు ప్రయాణికుల అవసరాలకు సరిపోవని చెప్పింది.

దానితో ఆయన ఖర్చు ఎక్కువైనప్పటికీ, ప్రైవేటు బస్సులను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. అయితే అధికారులు వాటిని కూడా, ఖమ్మం వరకూ వెళ్లకుండా మార్గమధ్యంలోనే నిలిపివేశారు. ఫలితంగా కొన్ని వేలమంది కార్యకర్తలు, రాహుల్ సభకు హాజరుకాలేకపోయారు.

నిజానికి అధికార బీఆర్‌ఎస్ ఎప్పుడు భారీ బహిరంగసభలు నిర్వహించినా.. ఆర్టీసీ వాటికి భక్తిప్రపత్తులతో, బస్సులు సమకూరుస్తుంది. ఆర్టీఏ అధికారులయితే.. ప్రైవేటు బస్సులు, ఇంజనీరింగ్, ప్రైవేటు కాలేజీల బస్సులను సమకూర్చి.. శ్రమదానం చేస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. వీటికి అడ్డురాని నిబంధనలు, ప్రయాణీకుల అవసరాలు.. కేవలం కాంగ్రెస్ సభలకే అడ్డురావడమే ఆశ్చర్యం. ఈ ద్వంద్వ విధానంపై, ఇప్పటికే కాంగ్రెస్ నేతలు నిప్పులు కురిపించారు.

తాజాగా అమిత్‌షా సభ ఖమ్మం సభకు సైతం, బీఆర్‌ఎస్ సర్కారు అలాంటి అడ్డంకులు సృష్టిస్తుందేమోనని చాలామంది భావించారు. కాంగ్రెస్ సభ మాదిరిగానే, బీజేపీ సభకూ ఆర్టీసీ బస్సులు ఇవ్వదేమోనని ఆందోళన చెందారు. కాంగ్రెస్‌కు చెప్పినట్లే.. ప్రయాణీకుల అవసరాల దృష్ట్యా అమిత్‌షా సభకు బస్సులు ఇవ్వలేమని, బీజేపీకి చెబుతారే మోనని అనుమానించారు. కానీ, ఆర్టీసి.. బీజేపీ అడిగిందే తడవుగా, వారి కోరికను ఆనందంగా అంగీకరించింది. ఫలితంగా అమిత్‌షా బహిరంగసభకు, కార్యకర్తలు ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చారు.

ఇది సహజంగానే బీజేపీ-బీఆర్‌ఎస్ కనిపించని బంధంపై .ఇప్పటికే ఉన్న అనుమానాలను, మరింత నిజం చేసినట్టయింది. నిజంగా బీజేపీపై బీఆర్‌ఎస్ సర్కారుకు.. కాంగ్రెస్ మాదిరిగానే రాజకీయ శత్రుత్వం ఉంటే, ఆ పార్టీకీ బస్సుల అనుమతి నిలిపివేయాలి. రాహుల్ సభ మాదిరిగానే ప్రైవేటు బస్సులు నిలిపివేయాలి. కానీ అలాంటి నిర్బంధాలేమీ, అమిత్‌షా సభలో భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు.

కాగా.. బీఆర్‌ఎస్ సర్కారుపై నిప్పులు కురిపించిన అమిత్‌షాపై, బీఆర్‌ఎస్ శిబిరం నుంచి ఆ స్థాయిలో ఎదురుదాడి కనిపించకపోవడం మరో ఆశ్చర్యం. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాదని, కేటీఆర్ సీఎం కాలేరని అమిత్‌షా స్పష్టం చేశారు. కేసీఆర్ తొమ్మిదేళ్ల నుంచీ రజాకార్ల పార్టీతో కలసి ఉన్నారంటూ ఆరోపించారు. అయితే దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ నుంచి.. ఎమ్మెల్యేల వరకూ ఎవరూ స్పందించకపోవడంపై, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

గతంలో అమిత్‌షా నల్లగొండ పర్యటన సందర్భంగా, ఆయనను భ్రమిత్‌షా అంటూ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు సీనియర్ మంత్రి హరీష్‌రావు, యువ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మినహా, ఎవరూ అమిత్‌షాపై ఎదురుదాడి చేయకపోవడం విశేషం. అమిత్‌షాపై తొలుత ట్వీట్‌తో దాడి ప్రారంభించిన దాసోజు, తర్వాత విడుదల చేసిన ప్రకటనతో అమిత్‌షా, బీజేపీని తూర్పారపట్టారు.

ఆ తర్వాత మంత్రి హరీష్ ట్విట్టర్ వేదికగా.. అమిత్‌షా సభ, ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. డబుల్ ఇంజన్ సంగతి తర్వాత.. ముందు సింగిల్ డిజిట్ తెచ్చుకోండి అంటూ వెటకారం ఆడారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ కేంద్రమంత్రి అన్నప్పుడే, మీ పార్టీకి ఇక్కడ నూకలు చెల్లిపోయాయని వ్యంగ్యాస్త్రం సంధించారు.

‘‘బ్యాట్ సరిగ్గా పట్టుకోవడం రాని మీ అబ్బాయికి, ఏకంగా బీసీసీఐ లో ఉన్నత పదవి ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబపాలన గురించి మాట్లాడం దెయ్యాలు వేదాలు వల్లించనట్లుగా ఉన్నాయ’’ని ఎద్దేవా చేశారు.

హరీష్‌రావు, దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో బీజేపీ సభపై విమర్శనలు ఎక్కుపెట్టగా.. పార్టీ ప్రధాన కార్యదర్శులు, మెజారిటీ మంత్రులు మాత్రం మౌనరాగం ఆలపించారు.

దీనినిబట్టి.. తెలంగాణలో బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్య జరుగుతున్నది… తమలపాకు యుద్ధమే తప్ప, తాడో పేడో తేల్చుకునే యుద్ధం కాదన్న వాస్తవం స్పష్టమవుతోందని, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలు సైతం.. బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్య ఉన్న దోస్తీకి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలని ప్రశ్నిస్తున్నారు.

‘‘బీజేపీ-బీఆర్‌ఎస్ ఒకేతాను ముక్కలని మేం ఎప్పటినుంచో చెబుతున్నాం. ఇప్పుడది నిజమైంది. ఖమ్మం రాహుల్ సభకు బస్సులివ్వని కేసీఆర్ ప్రభుత్వం, అమిత్‌షా సభకు మాత్రం అనుమతించింది. దీన్ని బట్టి బీజేపీ-బీఆర్‌ఎస్ రహస్య మిత్రులా? కాదా? అని ప్రజలే ఆలోచించుకోవాలి’’ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

‘అమిత్‌షా వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఖండించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? గతంలో బీజేపీపై విరుచుకుపడ్డ కేసీఆర్, ఇప్పుడు అమిత్ రాష్ట్రానికి వచ్చి తనను విమర్శిస్తున్నా ఎందుకు ఎదురుదాడి చేయటం లేదు. గతంలో అమిత్‌షాను భ్రమిత్‌షా అని విమర్శించిన బీఆర్‌ఎస్ ఇప్పుడెందుకు నవరంధ్రాలు మూసుకుంది? దీన్ని బట్టి వారిద్దరి మధ్య ఏం ఒప్పందం జరిగిందో చెప్పడానికి మేధావులే కానవసరం లేదని’ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ-బీఆర్‌ఎస్ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయని, ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతునిస్తుందన్న వార్తలకు, ఖమ్మం సభ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయని రఘువీర్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE