– సర్కారీ లాంఛనాలతో గద్దర్‌కు అంత్యక్రియలు
– పోలీసు శాఖలో పెల్లుబుకుతున్న ఆగ్రహం
– నక్సల్స్ చేతిలో 1200 మంది నిహతులైన వైనం
– ఎన్‌కౌంటర్లన్నీ కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే
– కేసీఆర్ సీఎం అయ్యాక తుడిచిపెట్టుకుపోయిన మావోలు
– వైఎస్ హయాంలో చర్చల కోసం రోడ్డుపైకొచ్చిన నక్సల్ అగ్రనేతలు
-ఆ చర్చలకొచ్చిన నేతలంతా నేలకొరిగిన విషాదం
– కాంగ్రెస్‌లో సభ్యుడు కాని గద్దర్
– అయినా గద్దర్‌ను సొంతం చేసుకునే అంత్యక్రియల ఎత్తుగడ
– గద్దర్‌పై బీఆర్‌ఎస్ పేటెంటీ పోరు
– పోటాపోటీగా ‘అంతిమ’ రాజకీయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
గుమ్మడి విఠల్.. అలియాస్ గద్దర్. తాడిత, పీడిత, గొంతులేని బడుగులకు గొంతుకై నిలిచిన ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూయడంతో.. ఒక విప్లవశకం ముగిసినట్టయింది. అయితే గద్దర్ అంతిమ సంస్కారాల ఘట్టమే చూడముచ్చట.
ప్రభుత్వాన్ని నిగ్గదీసి తన పాటతో ప్రజలను చైతన్య పరిచి, వేలాదిమంది యువకులను మావో మార్గం పట్టించిన గద్దర్ అనే విప్లవ సింహానికి.. సర్కారే సెల్యూట్ కొట్టి, జనారణ్యంలో అంతిమ సంస్కారం నిర్వహించింది. అడవుల్లో నక్సల్స్‌పై తుపాకి పేల్చిన అదే పోలీసులు.. గద్దర్ అంతిమ సంస్కారం రోజు గాలిలోకి కాల్పులు జరిపి, గౌరవ వందనం చేసిన దృశ్యం నభూతో నభవిష్యతి.
ఉమ్మడి రాష్ట్రం నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడేవరకూ నక్సల్స్-పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో, వేలాదిమంది నక్సల్స్ నేలకొరిగారు. దాదాపు 1200 మంది పోలీసులు తలవాల్చారు. వారంతా ఎవరి కోణంలో వారు అమరవీరులే. కాకపోతే పోలీసులు విధి నిర్వహణలో చనిపోతే.. నక్సల్స్ ఒక సిద్ధాంతం కోసం ప్రాణాలర్పించారు.
నక్సల్స్ చేతిలో చనిపోయిన పోలీసు కుటుంబాలకు సర్కారు సాయం చేస్తుంది. పోలీసుల చేతిలో మృతి చెందిన అడవి బిడ్డలు అనాధ ప్రేతలవుతారు. అంతే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్. అయితే రాజ్యానికి, రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడే నక్సలైట్లకు. బహిరంగంగా మద్దతునిచ్చే విప్లవ గొంతుక గద్దర్‌కు.. ప్రభుత్వ లాంఛనాలతో, అంతిమ సంస్కారాలు నిర్వహించడమే వివాదానికి కారణమయింది.
ఎందుకంటే గద్దర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, మాజీ ఎంపి, భారతరత్న, పద్మభూషణ అవార్డు గ్రహీత కాదు. నిబంధనల ప్రకారం అలాంటివారికే, ప్రభుత్వ లాంఛనాలు దక్కుతాయి. అందాకా ఎందుకు? ఇటీవలే మృతి చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న కాయం, ప్రభుత్వ లాంఛనాలు లేకుండానే కాలిపోయింది.
పోలీసుల ఆగ్రహానికి.. మరో కోణం కూడా కారణంగా కనిపిస్తోంది. వేలమంది సహచరులను పొట్టపెట్టుకున్న నక్సల్స్ ప్రతినిధిగా ఉన్న గద్దర్‌కు.. పాలకులు నడుంబిగించి, సర్కారీ లాంఛనాలతో అంతిమ సంస్కారం చేయడమే, వారి కన్నెర్రకు అసలు కారణం. ఇది నక్సల్స్‌పై యుద్ధం చేస్తున్న తమ ఆత్మస్థైర్యాన్ని.. పాలకులే పనిగట్టుకుని దెబ్బతీయడమేనన్నది, వారి అసంతృప్తికి మరో ప్రధాన కారణం.
నక్సల్స్‌కు పెదరాయుడిలా దన్నుగా నిలిచిన గద్దర్‌కు, సర్కారీ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రభుత్వం.. మావోలపై పోరుకు సంబంధించి, యుద్ధభూమిలో ఉన్న ప్రత్యేక దళాలకు ఏం సంకేతాలిస్తుందన్నది పోలీసుల ప్రశ్న. యాంటీ టెర్రరిజం ఫోరం దీనికి సంబంధించి, సర్కారుపై సంధించిన ప్రశ్నలకు సర్కారు వద్ద సమాధానం లేవు.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా.. తుపాకి పట్టిన నక్సల్స్‌ను నడిపించిన గద్దర్‌కు, ప్రభుత్వమే అంతిమ సంస్కారం నిర్వహించడం, పోలీసులు అమరవీరులకు అవమానించడమేనని ఫోరం స్పష్టం చేసింది.
సాధారణ పౌరులు, జాతీయవాదులను హతమార్చిన నక్సల్స్ చర్యలను, ఫోరం కన్వీనర్ డాక్టర్ రావినూతల శశిధర్ గుర్తు చేశారు. వేలాదిమంది యువకులను విప్లవమార్గం పట్టించిన గద్దర్ అంతిమసంస్కారాలు, ప్రభుత్వమే నిర్వహించడం… పోలీసులను అవమానించిందని దుయ్యబట్టారు.
అయితే యాంటీ టెర్రరిస్టు ఫోరం సంధించిన విమర్శనాస్ర్తాలకు , ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా, ఎలాంటి స్పందన లేకపోవడమే ఆశ్చర్యం. కనీసం ఏ కారణాల వల్ల గద్దర్ అంత్యక్రియలను నిర్వహించిందో కూడా వివరణ ఇవ్వలేని పరిస్థితి.
గద్దర్ అంతిమ యాత్రను ఆది నుంచి తుది వరకూ, కాంగ్రెస్ ముందుండి నడిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాజీ నక్సల్ అయిన ఎమ్మెల్యే సీతక్క చెరో వైపు నిలిచి, అంతిమ సంస్కారాల కార్యక్రమం జరిపించారు. మధ్యలో సీఎం కేసీఆర్ కూడా గద్దర్ భౌతికకాయానికి పూలమాల సమర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి కూడా గద్దర్‌కు నివాళులర్పించారు.
అయితే గద్దర్ తమ వాడని సంకేతాలిచ్చేందుకు.. అటు కాంగ్రెస్-ఇటు బీఆర్‌ఎస్ నేతలు చేసిన హడావిడే చూడముచ్చట. రేవంత్‌రెడ్డి అయితే, అంత్యక్రియలయ్యే వరకూ అక్కడే ఉన్నారు.
అయితే.. తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందన్న నక్సల్స్‌కు గద్దర్ గొంతుక. అలాంటి గద్దర్ మృతి చెందేంత వరకూ ఏ పార్టీ సభ్యుడు కాదు. రాహుల్‌గాంధీ వచ్చినప్పుడు ఆయనపై అభిమానంతో ముద్దు పెట్టారే తప్ప, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు.
అంతకుముందు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేతుల మీదిగా, ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ తర్వాత తానే సొంత పార్టీ పెట్టేందుకు ఢిల్లీ వెళ్లి ఈసీని కలిశారు. దీన్నిబట్టి గద్దర్‌కు అటు కాంగ్రెర్‌తో గానీ, ఇటు బీఆర్‌ఎస్‌తో గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది.
అయితే గద్దర్ అంతిమయాత్రను హైజాక్ చేసేందుకు అటు కాంగ్రెస్-ఇటు బీఆర్‌ఎస్ చేసిన ‘అంతిమ’ రాజకీయాలే ఆశ్చర్యం కలిగించాయి. పైగా గద్దర్ మద్దతిచ్చిన నక్సల్స్‌ను హతమార్చిన పార్టీలన్నీ, మూకుమ్మడిగా గద్దర్‌కు నివాళులర్పించడం మరో ఆశ్చర్యం.
మావోయిస్టులతో చర్చలకు తొలిసారి బయటకొచ్చిన నక్సల్స్ అగ్రనేతలతో, వైఎస్ సర్కారు చర్చలు జరిపింది. ఆ చర్చలకు వచ్చిన అగ్రనేతలను, అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హతమార్చింది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఉపయోగింకుని, నక్సల్స్ పెద్ద తలలను లేకుండా చేసింది.
తాజాగా అదే కాంగ్రెస్ పారీ్టి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి.. గద్దర్ అంత్యక్రియల వ్యవహారాన్ని తానే భుజానేసుకున్నారు. పక్కనే మాజీ నక్సలైట్ అయిన ఎమ్మెల్యే సీతక్క కూడా ఉంది కాబట్టి…అదంతా గద్దర్‌ను అభిమానించే, వామపక్షవాదుల మనసు గెలుచుకునే ఎత్తుగడే అన్నది సుస్పష్టం. దానికితోడు మాజీ నక్సలైట్‌గా ప్రపంచానికి తెలిసిన ఎమ్మెల్యే సీతక్క కూడా పక్కనే ఉండటంతో.. కేసెఆర్‌ను వ్యతిరేకించే వామపక్షభావ వర్గాలన్నీ, కాంగ్రెస్‌ను మెచ్చుకోవడం సహజమే. కాంగ్రెస్‌కు కావలసింది కూడా అదే.
కాంగ్రెస్ వ్యూహం కనిపెట్టిన తర్వాతనే మేల్కొన్న బీఆర్‌ఎస్.. గద్దర్‌ను సొంత చేసుకునే పనిలో పడింది. కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ నేత గజ్జెల నాగేష్ నేతృత్వంలో.. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, గద్దర్ అంతిమ సంస్కార కార్యక్రమంలో హంగామా చేశారు. జనాలను తరలించారు. తర్వాత సీఎం కేసీఆర్ కూడా, గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించాల్సిన అనివార్య పరిస్థితి.
గద్దర్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా, వామపక్షవాదుల పెదవులపై చిరునవ్వులు పూయించడంలో కేసీఆర్ సఫలమయ్యారు. మాలవర్గానికి చెందిన సాయన్నకు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడంతో మాలలు అసంతృప్తితో రగిలిపోయారు. ఇప్పుడు గద్దర్‌తో ఆ లోటు భర్తీ చేయించిన కేసీఆర్.. ఆ వర్గ అసంతృప్తిని తొలగించడంలోనూ సక్సెస్ అయ్యారు.
నిజానికి తెలంగాణ ఉద్యమకాలంలో గద్దర్‌ది పతాకపాత్ర. ఊరారా వినిపించిన ధూంధాంతో, తెలంగాణ యువత ఉద్యమకెరటమయింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దర్‌దీ కీలక భూమికనే. ఆయన పాటలే లక్షలాది యువతను రోడ్డెక్కించాయన్నది నిర్వివాదాంశం.
అయితే తెలంగాణ సిద్ధించిన తర్వాత గద్దర్, కోదండరామ్ లాంటి తెలంగాణవాదులను కేసీఆర్ దూరం పెట్టారు. వారెవరికీ అపాయింట్‌మెంట్లు లేవు. ప్రధానంగా… కేసీఆర్ సీఎం అయిన తర్వాత, తెలంగాణలో నక్సల్స్ ఉనికిలేకుండా చేయడంలో విజయం సాధించారు. మావోలను ఏరి వేయడంలో కేసీఆర్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంది. ఫలితంగా ఇప్పట్లో మావోయిస్టు ఉద్యమం, మళ్లీ మొలకెత్తే అవకాశాలు లేకుండా పోయాయి.
కొత్త రిక్రూట్లమెంట్లు నిలిచిపోయాయి. చావగా మిగిలిన కొద్దిమంది నక్సల్స్ చత్తీస్‌గఢ్, ఒడిషాలో తలదాచుకుంటున్న పరిస్థితి. కేసీఆర్ వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో వామపక్షభావజాలానికి కాలం చెల్లిందన్న ఆగ్రహం , వామపక్షీయుల్లో బలంగా నాటుకుపోయింది. కేసీఆర్ నియంతగా పాలిస్తున్నారంటూ ఇప్పటికే విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో గద్దర్ ఆకస్మిక మరణం, అలాంటి వారిని ఆవేదనకు గురిచేసేదే.
అలాంటి పరిస్థితిలో సీఎం కేసీఆర్, మంత్రులు సహా బీఆర్‌ఎస్ నేతలంతా.. కాంగ్రెస్‌కు పోటీగా గద్దర్‌కు నివాళులర్పించడమే ఆశ్చర్యం. ఇది తనను వ్యతిరేకించే కరుడుకట్టిన వామపక్షవాదుల ఆగ్రహాన్ని, తగ్గించే ఎత్తుగడే అన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
ఇక ఎన్టీఆర్-చంద్రబాబు హయాంలో నక్సల్స్‌ను ఏరివేసిన తెలుగుదేశం పార్టీ కూడా, బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌కు పోటీగా మావోల మద్దతుదారు గద్దర్‌కు నివాళులర్పించడం మరో ఆశ్చర్యం. మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్‌రెడ్డిని తన ప్రతినిధిగా పంపించింది. నక్సల్స్‌ను అణచివేసిన ఎన్టీఆర్-చంద్రబాబు హయాంలో మంత్రులుగా చేసిన వారిలో.. కేసీఆర్ సహా మెజారిటీ నేతలంతా, ఇప్పుడు బీఆర్‌ఎస్‌లోనే ఉండటం ప్రస్తావనార్హం.
ప్రధానంగా.. అప్పట్లో నక్సల్స్ చేతిలో మృతిచెందిన వారిలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీల తర్వాత.. బీజేపీ- ఏబీవీపీ నేతలే ఎక్కువ. నక్సలైట్లను ఎదుర్కొన్న ఏకైక రాజకీయ పార్టీగా, బీజేపీకి పేరుండేది. అందుకే తెలంగాణలో నక్సల్స్‌ను ప్రతిఘంటించిన జిల్లాల్లోనే, బీజేపీ రాజకీయంగా బలపడటాన్ని విస్మరించకూడదు.
కరీంనగర్-వరంగల్-మహబూబ్‌నగర్-ఖమ్మం-ఆదిలాబాద్ జిల్లాల్లో ..అనేకమంది బీజేపీ-ఏబీవీపీ నేతలను నక్సల్స్ పొట్టనపెట్టుకున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో, అనేకమంది ఏబీవీపీ విద్యార్ధి నేతలను, పీపుల్స్‌వార్ అనుబంధ ఆర్‌ఎస్‌యు హత్యచేసింది.
అలాంటి బీజేపీ నేతలు కూడా.. గద్దర్ మృతదేహానికి నివాళులర్పించడం, సహజంగానే చర్చనీయాంశమవుతుంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా.. గద్దర్ భౌతిక కాయానికి నివాళులర్పించడం విశేషం. నక్సలిజాన్ని బహిరంగంగా వ్యతిరేకించే బీజేపీ కూడా, ఓటు రాజకీయం కోసం తన సిద్ధాంతం మార్చుకోవడమే ఆశ్చర్యం.
ఏదేమైనా గద్దరన్న అదృష్టంవంతుడు. తనపై ఎక్కుపెట్టిన అదే తుపాకీ, కడసారి తనకు సెల్యూట్ చేయడం ఎంతమందికి సాధ్యం? చుట్టూ పోలీసుల రక్షణవలయంలో ఉండే గద్దరన్నకు, అదే పోలీసులు వందలసంఖ్యలో నిలబడి జోహార్లర్పించడం గొప్పే కదా?
తాను జీవించి ఉండగా చిత్రహింసలు పెట్టి.. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఛిద్రం చేసిన అదే ‘రాజ్యం’తో, అధికారలాంఛనాలు అందుకున్నారు. ఓట్ల కోసమైనా, కులం కోసమైనా అంతా క్యూ కట్టి గద్దరన్నను అమరపురికి సగౌరంగా. సర్కారు లాంఛనాలతో సాగనంపారు. ఆరకంగా అంతా గద్దరన్న ‘పాదం మీద పుట్టుమచ్చ’లయ్యారు.