– మేనిఫెస్టోలో పార్టీల హామీల వరద
– బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హామీలో వరదానాలు
– ఆ రెండు పార్టీల హామీల విలువ లక్షా ఇరవైవేల కోట్లు
– ఒక రాష్ట్ర బడ్జెట్ స్థాయికి చేరిన కాంగ్రెస్-బీఆర్‌ఎస్ హామీలు
– పన్నులు పెంచబోమని ప్రజలకు హామీ ఇవ్వని పార్టీలు
– భూములు అమ్మబోమన్న హామీ ఇవ్వని కాంగ్రెస్, బీఆర్‌ఎస్
– టాక్సు, సెస్సు, యూజర్‌చార్జీలు, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్లు, ఇంటిపన్ను, లిక్కర్ రేట్లు పెంచబోమని చెప్పని రెండు పార్టీలు
– ఆ హామీలపై నేతలను ప్రశ్నించని మీడియా ప్రతినిధులు
– ప్రెస్‌మీట్లు, మీట్‌దిప్రెస్‌లో మీడియా మౌనం
– పార్టీల హమీలకు నిధులెక్కడ నుంచి తెస్తారు?
– ఎవరొచ్చినా కేంద్ర గ్రాంట్లు కష్టమే
– ఇప్పటికే కేంద్ర గ్రాంట్లు నామమాత్రం
– ఇప్పటికే తెలంగాణ బడ్జెట్ 2,90,398 కోట్లు
– రాబడి 2 లక్షల కోట్లు మాత్రమే
– ఎవరొచ్చినా మూడున్నర లక్షల బడ్టెట్ పెడితేనే మనుగడ
– మరి బాదుడుతోనే ఖజానా నిండేది
– పన్నులు పెంచితేనే పనులు
– పన్నులు పెంచకుండా పాలిస్తామని చెప్పని బీఆర్‌ఎస్-కాంగ్రెస్
– బాదుడు హామీపై పార్టీలను ప్రశ్నిస్తున్న పౌరసమాజం
( మార్తి సుబ్రహ్మణ్యం)
మరికొద్దిరోజుల్లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ఎన్నికల వరదానాలు ఓటరు నెత్తిమీద కుమ్మరిస్తున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్.. కనీసం ప్రతిపక్ష స్థానానికి వస్తే చాలనుకుంటున్న బీజేపీ ఎవరి మేనిఫెస్టోతో వారు ఓటరుదేవుళ్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో వివరిస్తూ, తలుపుకొట్టి మరీ కరపత్రాలను పంచుతున్నారు.
అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అదనపు పన్నులు విధించబోమని ఏ ఒక్క పార్టీ కూడా తన మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోవడమే విచిత్రం. ఆ మేరకు అగ్రనేతలతో ప్రెస్‌మీట్లు-మీట్‌ది ప్రెస్ నిర్వహిస్తున్న జర్నలిస్టులు కూడా నేతలను ప్రశ్నించకపోవడం మరో ఆశ్చర్యం. మీ మేనిఫెస్టో హామీలను ఎలా నెరవేరుస్తారు? అందుకు నిధులు ఎక్కడినుంచి సమీకరిస్తారు? కేంద్ర గ్రాంట్లు రాకపోతే ఏం చేస్తారు? ప్రజలపై పన్నుల భారం వేయకుండానే మనీ హామీలు నెరవేరుస్తారా? అని ఇప్పటిదాకా ఒక్క జర్నలిస్టు ప్రశ్నిస్తే ఒట్టు.
ఇప్పుడు తెలంగాణ పౌర సమాజం రాజకీయ పార్టీలపై ఇవే ప్రశ్నలు సంధిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రంగంపైనా పన్నులు పెంచకుండా, భూములు అమ్మకుండా మేనిఫెస్టో హామీలు అమలుచేయగలరా? అని సూటిగా ప్రశ్నిస్తోంది. ప్రజలను కష్టపెట్టకుండా తామిచ్చిన హామీలు నెరవేర్చే సత్తా-సామర్థ్యం ఉన్నాయా? పన్నులు వేయకుండా హామీలు నెరవేరుస్తామని చెప్పే ధైర్యం, బీఆర్‌ఎస్-కాంగ్రెస్-బీజేపీకి ఉన్నాయా? ఇదీ.. ఇప్పుడు మూడు పార్టీల ముందు తెలంగాణ పౌరసమాజం పెట్టిన నిలబెట్టి సంధిస్తున్న ప్రశ్న.
సహజంగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లెక్కలేనన్ని హామీలిస్తుంటాయి. కానీ వాటిని ఎలా అమలు చేస్తాయని చెప్పవు. అప్పులు చేస్తామని, బాదుడుతో భర్తీ చేస్తామని అస్సలు చెప్పవు. వాటిని ఎలా అమలు చేస్తారని, రోజూ వారి ప్రెస్‌మీట్లకు హాజరయ్యే మీడియా కూడా ప్రశ్నించదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాళ్లకు చుట్టుకున్న పాముల్లా మారిన హామీల ఖర్చు భరించేందుకు, పార్టీలు ప్రజలపై పన్నుల వడ్డన చేస్తుంటాయి. అంటే మార్కెట్ భూముల విలువ పెంచడం.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం.. లిక్కర్, ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచడం.. ఇంటిపన్ను.. సెస్సులు.. యూజర్‌చార్జీలు పెంచడం ద్వారా ప్రజల నెత్తిన పన్నుల బాంబులేసి, హామీలు నెరవేర్చే పనిచేస్తుంటాయి.
కానీ ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిపి, దాదాపు లక్షా ఇర వై ఐదువేల కోట్ల ఖరీదైన హామీలివ్వడంతో.. తమపై పన్నులు భారం వేయకుండానే వాటిని అమలుచేస్తారా? అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ పౌరసమాజం కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌కు సంధిస్తున్న ప్రశ్నలు.
నిజానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023-24కు గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. రాబడులు కలిపి 2,59,861 కోట్లు ఉంటాయని సర్కారు అంచనా వేసింది. ఆగస్టు నాటికి 99,108 కోట్లు మాత్రమే ఖజానాకు సమకూరాయి. దానితో ప్రభుత్వ భూముల అమ్మకం, మరికొన్ని మార్గాల ద్వారా 19,553 కోట్ల రూపాయలు సమకూర్చుకోగలిగింది. అందుకు చాలా కష్టపడాల్సి వ చ్చింది.
అలాగని బీజేపీ పాలితప్రాంతాల్లో మాదిరిగా తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ సర్కారు గ్రాంట్లు ఇవ్వడం నిలిపివేసింది. అసలు తెలంగాణకు నికర రాబడి 1.51 లక్షల కోట్ల రూపాయలు. వివిధ వర్గాలకిచ్చే సబ్సిడీలకు చెల్లింపులు, ప్రభుత్వోద్యోగుల జీతాలు, ఉద్యోగులకు రుణాలు, పెన్షన్లు 60 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. వీటి చెల్లింపులతోపాటు.. పార్టీలు కొత్తగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే.. వచ్చే కొత్త ప్రభుత్వం ఏదైనా.. పాలకులు ఎవరైనా.. పార్టీలు ఏవైనా కనీసం మూడున్నరలక్ష కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టడం అనివార్యం. లేకపోతే ఇచ్చిన హామీలఅమలు దుర్లభం.
పదేళ్లు అధికారంలో ఉంటూ.. అటు సంక్షేమం-ఇటు అభివృద్ధిలో సమతుల్యం పాటిస్తున్న కేసీఆర్ సర్కారే.. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు, ఖజానాను పరిపుష్ఠం చేసేందుకు శివారు ప్రాంతాల్లో భూములు అమ్మాల్సివచ్చింది. అంటే రానున్న రోజుల్లో ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీల కోసం, ఇంకెన్ని భూములు తెగనమ్ముతారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. భావి తరాల కోసం- ప్రభుత్వ భవిష్యత్తు అవసరాల కోసం దాచి ఉంచాల్సిన ప్రభుత్వ భూములను తెగనమ్ముకుంటే, ఇక ప్రభుత్వ భూములు కనుమరుగవడం ఖాయమన్నది పౌరసమాజం ఆందోళన.
ఈ ఎన్నికల్లో అందరికంటే ఖరీదైన హామీలిచ్చిన కాంగ్రెస్.. తాను అధికారంలోకి వస్తే హామీలకు సంబంధించిన ఆర్ధిక సవాళ్లు ఎలా అధిగమిస్తుందో చెప్పలేదు. ఇందిరమ్మ ఇళ్లకు ఐదేసి లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ర్టంలో అర్హుల సంఖ్య 10.05 లక్షల మంది. ఆ ప్రకారం 50,250 కోట్లు ఆ పథకానికి సమకూర్చాల్సి ఉంది.
ఆసరా పెన్షన్లను 4 వేల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం 44 లక్షల మంది ఆ పథకానికి అర్హులున్నారు. ఆ ప్రకారంగా ఆ పథకం కింద 21,120 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పథకానికి ఏడాదికి 11,918 కోట్లు చెల్లిస్తున్నారు. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఈ పథకానికి అదనంగా 9,202 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఆ నిధులు ఎక్కడి నుంచి.. ఎలా సమకూరుస్తారో కాంగ్రెస్ పార్టీ వివరించలేదు.
రైతుభరోసా కింద ప్రతి రైతుకూ ఏడాదికి, 15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గణాంకాల ప్రకారం తెలంగాణలో కోటిన్నర ఎకరాలుంటే.. కాంగ్రెస్ హామీ ప్రకారం ఆ హామీ అమలుకు 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. మరి ఈ పథకానికి అదనంగా చెల్లించాల్సిన మరో 7500 కోట్లు ఎక్కడ నుంచి తె స్తారన్నది ప్రశ్న.
రైతు కూలీలకు ఏడాదికి 12 వేల భృతి ఇస్తానని ప్రకటించింది. ప్రస్తుతం ఉపాథి హామీ పనులు చేసే జాబ్ గ్యారెంటీ హోల్డర్ల సంఖ్య 52.92 లక్షల మంది. వారికి ఇచ్చిన కొత్త హామీ ప్రకారం 2,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది. అంటే ఒక రైతుభరోసా పథకానికే కొత్త సర్కారుపై 9,660 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్న మాట.
ఇక గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే ఇస్తామన్నది కాంగ్రెస్ మరో హామీ. దానికి ఏడాదికి 3,189,20 కోట్ల రూపాయలు అవసరం. అంటే నెలకు 298.60 కోట్లు భారం పడుతుందన్నమాట. ఈ సబ్సిడీకి అయ్యే ఖర్చు ఎలా సమకూరుస్తారన్నది సవాలు.
నిరుద్యోగ భృతి కింద యువకులకు నెలకు 4 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. నిజానికి ఇప్పుడు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలో, నిరుద్యోగులెవరూ తమ వివరాలు నమోదు చేసుకోవడం లేదు. అతి తక్కువగా 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనుకున్నప్పటికీ, వారికి భృతి కింద ఏడాదికి 4,800 కోట్లు ఖర్చు చేయడం ఖజానాకు కత్తిమీద సామే. అలాగే 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. ఆ రకంగా 70 లక్షల మందికి ఏడాదికి 2,500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున,నరేంద్ర మోడీ సాయం అందటం దుర్లభం. కేంద్ర గ్రాంట్లపైనా ఆశలు వదులుకోవలసిందే. పంజాబ్‌లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఆప్.. ఆ తర్వాత తాము ప్రకటించిన హామీలు నెరవేర్చాలంటే, కేంద్రం నిధులివ్వాలని ప్రధానిని కోరాల్సి వచ్చింది. ఇలాగే చాలామంది బీజేపీయేతర సీఎంలు తమను ఆదుకోవాలని మోదీని శరణు వేడుతున్న పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో విపక్షం అధికారంలో ఉన్నందున.. కేసీఆర్ సర్కారుకూ గ్రాంట్లు గగనంగా మారింది.
ఈ పరిస్థితిలో బీజేపీకి సవాలు విసురుతున్న కాంగ్రెస్ సర్కారుకు కేంద్రం నిధులిస్తుందనుకోవటం అత్యాశ. ఫలితంగా తానిచ్చిన హామీలు నెరవేర్చాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలపై పన్నులు వేయటం అనివార్యం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల ఖరీదు 68652 కోట్లు. ఇది ఇప్పటి ఖర్చులకు అదనం. మరి తాము అధికారంలోకి వస్తే పన్నులు వేయకుండానే.. 68652 కోట్ల విలువైన హామీలు అమలు చేస్తామని ప్రకటించే ధైర్యం చేస్తుందా అన్నదే ప్రశ్న.
ఇవన్నీ నెరవేర్చాలంటే ప్రజలపై బాదుడు తప్పదు. కానీ ఇప్పుడు జీతాలిచ్చేందుకు ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. రేపు తాను అధికారంలోకి వస్తే.. ఎవరిపైనా, ఏ రంగంపైనయినా పన్నులు వేయకుండా, భూములు అమ్మకుండా మేనిఫెస్టో అమలు చేస్తామని చెప్పకపోవడం గమనార్హం.
ఇక పదేళ్లు అధికారం అనుభవించిన బీఆర్‌ఎస్ కూడా, వరదానాల్లో తక్కువ తినలేదు. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్‌ఎస్.. కొత్తగా 52 వేల కోట్ల విలువైన అదనపు ఆర్ధిక భారం మోస్తామని ప్రకటించింది. పేదలకు 5 లక్షల బీమా, ఆసరా పెన్షన్లు 5,106 రూపాయలకు పెంపు, 400 రూపాయలకే గ్యాస్, రైతుబంధు సాయం 16 వేలకు పెంపు, అర్హులైన మహిళలకు నెలకు 3 వేల రూపాయల భృతి హామీలు గుప్పించింది. వాటిని అమలు చేయాలంటే అదనంగా 52 వేల కోటల రూపాయల భారం అవుతుంది.
అయితే ఇప్పటికే వివిధ పథకాల అమలు, జీతాల కోసం ప్రభుత్వ భూములు తెగనమ్ముతోందన్న విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ సర్కారు.. మళ్లీ తాను అధికారంలోకి వస్తే గజం భూమి కూడా అమ్మకుండా, ఏ రంగంలో కూడా కొత్తగా ఎలాంటి పనులు వేయకుండా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పలేదు. నిజానికి రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులెవరికీ ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలిచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగుల రుణాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగ సంఘ నేతలంతా కేసీఆర్ సర్కారుతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నందున, వారిది ధైర్యంగా సర్కారును ప్రశ్నించలేని పరిస్థితి. అందులో ఉద్యోగ సంఘ నేతలు ఎమ్మెల్సీ టికెట్ల కోసం ఆశపడుతున్నారు.
ఉద్యోగులకు జిల్లాల వారీగా జీతాలిస్తున్న దుస్థితి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే, పనులు చేసేది లేదని ధర్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీఆర్‌ఎస్.. తాను ఎలాంటి కొత్త పన్నులు వేయకుండా మేనిఫెస్టో అమలు చేయగలదా అన్నది పౌరసమాజం సంధిస్తున్న ప్రశ్న. జవాబిచ్చే ధైర్యం ఎవరికుంది? ఇటీవలే లిక్కర్ సహా అన్ని ధరలూ పెంచేసిన బీఆర్‌ఎస్‌కు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే.