– కేసీఆర్‌ను విమర్శించవద్దంటూ అధికార ప్రతినిధులకు అధ్యక్షుడి పీఆర్వో ఆదేశాలు
– ఆయన ఆదేశాలపై సీనియర్ల ఆశ్చర్యం, అనుమానాలు
-పార్టీ అధికార ప్రతినిధులను శాసిస్తున్న అనధికార పీఆర్వో
– పార్టీ అధికార మీడియా చైర్మన్‌ను పక్కనపెట్టేసిన వైనం
– మీడియా కమిటీ చైర్మన్‌కు తెలియకుండానే సందేశాలు
– సొంతగా వాట్సాప్ గ్రూపులపై పార్టీ నేతల ఫిర్యాదు
– పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్లు పెట్టవద్దంటూ అనధికార పీఆర్వో హుకుం
– కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఆదేశం
– కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని నేతలపై ఆగ్రహం
– ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్లు పెట్టుకోవాలని రుసరుస
– ప్రకటనలు, యాడ్లలో ఆయన ఫొటోలపై సీనియర్ల అభ్యంతరం
– ఇబ్రహీంపట్నం ఇన్చార్జిగా ప్రకటనలపై స్థానిక నేతల ఆగ్రహం
– షాడో ప్రెసిడెంట్ తీరుపై సీనియర్ల సీరియస్
– అనధికార పీఆర్వోపై సీనియర్ల తిట్ల వర్షం
– పార్టీ ఆఫీసులో ఆయనపై కాగ్ర గడ్డ, డాక్టర్ ఏఎస్ రావు ఫైర్
– అధ్యక్షుడు కాసానికి సీనియర్ల లిఖితపూర్వ ఫిర్యాదు
– అధినేత చంద్రబాబు దృష్టికి షాడో అధ్యక్షుడి వ్యవహారాలు
– కార్యాలయంలో కనిపించని కంభంపాటి
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుని కొత్త అడుగులు వేస్తోంది. పార్లమెంటుపార్టీ నియోజకవర్గ కమిటీలు పూర్తి చేసుకుని, నియోజకవర్గాల్లో బలపడే దిశగా అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లూ బోసిపోయిన పార్టీ ఆఫీసు, ఇప్పుడిప్పుడే నాయకుల రాకతో సందడిగా కనిపిస్తోంది. అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఎక్కువ సేపు పార్టీ ఆఫీసులోనే గడుపుతున్నారు. అయితే‘ షాడో ప్రెసిడెంట్’గా పనిచేస్తున్న ఓ అనధికార పీఆర్వో వ్యవహారశైలితో సీనియర్లు సైతం, పార్టీ ఆఫీసుకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్న ఆవేదన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బీఆర్‌ఎస్- సీఎం కేసీఆర్‌ను విమర్శించవద్దంటూ.. పార్టీ అధికార ప్రతినిధులకు లక్ష్మణరేఖ గీస్తున్న ఆ పీఆర్వో బీఆర్‌ఎస్ భక్తిపై, సీనియర్లలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సదరు వ్యక్తిని ప్రోత్సహిస్తున్నందుకే, ఈ దుస్థితి తలెత్తిందన్నది సీనియర్ల ఫిర్యాదు.
ఆయన ఓ సాధారణ పీఆర్వో. పూర్వాశ్రమంలో కొన్ని దినపత్రికల్లో జిల్లాల్లో విలేకరిగా పనిచేసిన వ్యక్తి. టీడీపీ అధ్యక్షుడు కాసానికి ఆయనతో చాలాఏళ్ల నుంచి ఉన్న సంబంధాలతో, కాసాని అధ్యక్షడయ్యాక ఆయనను తన వ్యక్తిగత పీఆర్వోగా నియమించుకున్నారు.
నిజానికి తెలంగాణ టీడీపీ మీడియా కమిటీ చైర్మన్‌గా ప్రకాష్‌రెడ్డిని చంద్రబాబు నియమించారు. ప్రకాష్‌రెడ్డి సుదీర్ఘ కాలం నుంచి, టీడీపీ మీడియా కమిటీలో అంకితభావంతో పనిచేస్తున్నారు. అయితే కాసాని తన వ్యక్తిగత పనుల కోసం నియమించుకున్న పీఆర్వో , పార్టీ-పార్టీ ఆఫీసు-సీనియర్లపైనా పెత్తనం చేయడంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రకాష్‌రెడ్డి కూడా తన బాధ్యతలు కాసాని పీఆర్వోనే బలవంతంగా తీసుకోవడంతో, ఆయన లోకేష్ పాదయాత్ర ప్రచారం చూసుకుంటున్నారు.
పార్టీ అధికార ప్రతినిధులు పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్లు పెట్టడం సహజం.పార్టీ లైబ్రరి నుంచి దానికి తగిన మెటీరియల్ కూడా ప్రెస్‌మీట్ నిర్వహించే నేతలకు పంపిస్తుంటారు. కానీ సదరు పీఆర్వో మాత్రం.. వారిని పార్టీ ఆఫీసులో కాకుండా, ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్లు పెట్టుకోమని ఆదేశించడంపై సీనియర్లు మండిపడుతున్నారు. పైగా సీఎం కేసీఆర్‌ను విమర్శించవద్దని ఆ పీఆర్వో ఆదేశించడం చర్చనీయాంశమయింది.
‘మీరు సీఎం కేసీఆర్‌ను ఎందుకు విమర్శిస్తున్నారు? అలా విమర్శించేటట్లయితే ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్డుకోండి’ అని గద్దించడంపై, అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మమ్మల్ని ప్రెస్‌మీట్ పెట్టవద్దనడానికి నువ్వెవరు? నీ స్థాయి ఏమిటి? పార్టీలో నీకున్న పదవి ఏమిటని’ డాక్టర్ రావు విరుచుకుపడ్డారు.
సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే, అధ్యక్షుడి పీఆర్వోకు వచ్చిన ఇబ్బంది ఏమిటన్న ప్రశ్నలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ప్రతిపక్షపార్టీ ఎక్కడైనా అధికార పార్టీ-ప్రభుత్వాన్ని విమర్శించడం సహజమని, అలాంటిది అసలు సీఎంను విమర్శించవద్దని ఒక పీఆర్వో స్థాయి వ్యక్తి చెప్పడమే ఆశ్చర్యంగా ఉందని సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘‘అంటే ఒక పీఆర్వో, రాష్ట్ర పార్టీ విధాన నిర్ణయాలను శాసిస్తున్నారని తేలిపోయింది. దీన్ని బట్టి ఆయన ఎవరికోసం ఇక్కడ పనిచేస్తున్నారో అర్ధమవుతుంది. ఇప్పటి వరకూ బీఆర్‌ఎస్‌ను గానీ, సీఎం కేసీఆర్‌ను గానీ విమర్శించకపోవడం బట్టి, పార్టీలో ఏం జరుగుతుందో మాకు అర్ధం కావడం లేద’ని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా తనకు తాను ఇబ్రహీంపట్నం ఇన్చార్జిగా ప్రచారం చేసుకోవడంపై, ఆ నియోజకవర్గ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడి దగ్గర పీఆర్వో ఉద్యోగం చేసుకునే వ్యక్తికి ఇన్చార్జి పదవి ఎలా ఇస్తారని ఇబ్రహీంపట్నం నేతలు అడ్డం తిరగడంతో.. చివరకు అతనికి నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేదని పార్టీ నేతలు సర్దిచెప్పాల్సి వచ్చింది.
కాసాని కలిసేందుకు వివిధ జిల్లాల నుంచి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు, రాష్ట్రకమిటీ నేతలను.. సదరు పీఆర్వో నిలిపివేస్తున్న తీరుపై పార్టీ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం వ్యక్తమవుతోంది. కాసాని ఇచ్చే ప్రకటనల్లో పీఆర్వో ఫొటోలపాటు, ఆఫీసులో నిర్వహించే సమావేశాల్లో కూడా ఆయన పేరు పత్రికల్లో వస్తుండటంపై సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సదరు పీఆర్వో పెత్తనంపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఉపాథ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, తెలుగుమహిళ రాష్ర్ట అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి, అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్‌రావు తదితరులు రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు ఫిర్యాదు చేశారు. దానితో తాను మందలిస్తానని కాసాని వారికి సర్దిచెప్పాల్సి వచ్చింది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణమాచారి, మాజీ ఎమ్మెల్యే ప్రసూన అయితే తమను అడ్డుకున్న కాసాని పీఆర్వోపై.. కాసాని చాంబరు బయట అందరి ఎదుటే ఆగ్రహం వ్యక్తం చేసి, హెచ్చరించడంతో పీఆర్వో అక్కడి నుంచి వెళ్లిపోవలసి వచ్చింది.
మాజీ ఎమ్మెల్యే- రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అయితే, రాష్ట్ర అధ్యక్షుడికి సదరు పీఆర్వో తీరుపై లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో, ఈ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చినట్టయింది. కాసాని పీఆర్వో తనకు నచ్చిన నేతల ఫొటోలు, వార్తలు మాత్రమే ఇస్తున్నారని, వాటిలో తమ పేర్లు కూడా ఉండటం లేదని, పాత ఫొటోలు కూడా కొత్తగా ఇస్తున్నారని లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
కాగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించిన మీడియా కమిటీ చైర్మన్ ప్రకాష్‌రెడ్డిని పక్కనపెట్టి, సర్వం తానై వ్యవహరిస్తున్న వైనంపై పార్టీ కార్యాలయ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాసాని అధ్యక్షుడిగా రానంతవరకూ ప్రకాష్‌రెడ్డి మీడియా వ్యవహారాలు చూసేవారు.
కాసాని అధ్యక్షుడయ్యాక సొంత పీఆర్వోకు ఆ బాధ్యతలు అప్పగించారు. తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, కొంతకాలం క్రితం ప్రకాష్‌రెడ్డిని మీడియా కమిటీచైర్మన్‌గా ప్రకటించారు.
అయినప్పటికీ ఇంకా కాసాని వ్యక్తిగ పీఆర్వోనే మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. దానితో యువగళం పాదయాత్ర చే స్తున్న లోకేష్ ప్రచారానికి, ప్రకాష్‌రెడ్డి పరిమితమయ్యారు. కాసాని పీఆర్వో సొంతగా ఏర్పాటుచేసుకున్న మీడియా గ్రూపులో, పార్టీ మీడియా కమిటీ చైర్మన్ లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
కాసానికి సదరు పీఆర్వోపై ప్రేమ ఉంటే.. అతనిని ఇంటి వరకూ పరిమితం చేసుకోవాలే తప్ప, ఈవిధంగా తమపై పెత్తనానికి ప్రయత్నిస్తే సహించేది లేదని సీనియర్లు నిర్మొహమాటంగా చెబుతున్నారు. పీఆర్వో స్థాయి వ్యక్తి పరిథి-పరిమితి అతిక్రమిస్తే, అది పార్టీకే నష్టమని స్పష్టం చేస్తున్నారు.
ప్రధానంగా కేసీఆర్‌ను విమర్శించవద్దని అధికార ప్రతినిధులపై ఆంక్షలు విధించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ అధినేతను కోరుతున్నారు. కాగా కాసాని పీఆర్వో వ్యవహారశైలిపై, పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సీనియర్లు సిద్ధమవుతున్నారు.
అయితే.. పార్టీ రాష్ట్ర వ్యవహారాలు చూసుకోవలసిన తెలంగాణ పార్టీ ఇన్చార్జి కంభంపాటి రామ్మోహన్‌రావు, చాలాకాలం నుంచి పార్టీ ఆఫీసుకు రాని వైనంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనితో పార్టీ నేతలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.
‘‘కాసానిని కలిసేందుకు వెళితే , అక్కడ ప్రైవేటు పీఆర్వో అడ్డుపడుతున్నారు. అసలు ఆయనకు ఏం సంబంధమో మాకు అర్ధం కాదు. ఇక్కడ రాష్ట్ర ఇన్చార్జి కంభంపాటి అసలు పార్టీ ఆఫీసుకే రావడం లేదు. ఇక మేం ఎవరిని కలవాలో అర్ధం కావడం లేద’ని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత అసంతృప్తి వ్యక్తం చేశారు.