తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన కేసీఆర్.. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి.
బీజేపీలోకి పొంగులేటి చేరిక దాదాపు ఖయమైపోయిందని అంటున్నారు. బీజేపీ అధిష్ఠానం పొంగులేటితో నేరుగా చర్చలు జరుపుతోందని సమాచారం. ఈ నెల 18న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పొంగులేటి భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కీలక ప్రకటన వెలువడుతుందని చెపుతున్నారు.
మరోవైపు బీజేపీలో చేరాలనే నిర్ణయం నేపథ్యంలో ఇప్పటికే తన సహచరులతో పొంగులేటి ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి పలు నియోజవర్గాల్లో తన అనుచరులతో భేటీ కానున్నారు. మరోవైపు ఇటీవల పొంగులేటి మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రానికి శీనన్న సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. ప్రజల అభిమానం ఉన్నవాడే అసలైన నాయకుడని… తనకు పదవి లేకపోయినా ప్రజాభిమానం ఎంతో ఉందని అన్నారు.