– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
– ఆలంపూర్ లోని బాల బ్రంహేశ్వర స్వామి ఆలయం మరియు జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు
మహాశివరాత్రి సందర్భంగా ఆలంపూర్ లోని బాల బ్రంహేశ్వర స్వామి ఆలయం మరియు జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, తెలంగాణలో అన్నిరకాలుగా శాంతియుత వాతావరణం ఉంటే, దేశంలో మాత్రం విపరీత ధోరణితో ఉన్న నాయకత్వం ఉందని, విపరీత ధోరణులను పక్కనపెట్టి , సహృదయంతో ఆలోచించే నాయకత్వం రావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసామని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమకూ అమలుచేయాలని ఇతర రాష్ట్రాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత.
కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నా గతంలో ఆలంపూర్ ప్రాంతానికి నీరు వచ్చేది కాదని, కానీ ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా మారుమూల గ్రామాల్లో సైతం నీటి సదుపాయం ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ గారు ఆర్డీఎస్ ప్రాజెక్టు పాదయాత్ర ద్వారా ఆలంపూర్ ప్రాంతాన్నంతా కదిలించి ఉద్యమంలో నడిపించారన్న ఎమ్మెల్సీ కవిత, ప్రస్తుతం ఆర్డీఎస్ ప్రాజెక్టు ను బలోపేతం చేసామన్నారు. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో తుమ్మిళ్ల లిఫ్ట్, ఆలంపూర్ లిఫ్ట్ లను బాగు చేసుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఒకప్పుడు పాలమూరు ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని, కానీ ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుండి కూలీలు పాలమూరుకు వచ్చి పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశవ్యాప్తంగా సేవ చేయాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు, బాల బ్రంహేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికై సీఎం కేసీఆర్ గారు కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుండి రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు, ఆలంపూర్ ను అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గద్వాల జెడ్పీ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, కార్పొరేషన్ ఛైర్మన్లు మేడె రాజీవ్ సాగర్, సాయిచంద్ ఎమ్మెల్సీ కవిత వెంట ఉన్నారు.