Suryaa.co.in

Andhra Pradesh

పెగాసిస్ కొంటే నిరూపించు జగన్ రెడ్డీ!

– అధికారంలో ఉన్నారు కదా…మీరు చేతగాని వారా?
– సోదికబుర్లు ఆపి కల్తీసారాపై సమాధానం చెప్పండి
– టిడిపి సీనియర్ నేత బి.టెక్ రవి సవాల్

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో పెగాసిస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి వైసిపి ముఖ్యులపై నిఘాపెట్టి కుట్రపన్నారని వైసిపి ఎమ్మెల్యే ర్యాంబో రాంబాబు తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన స్క్రిప్ట్ ను మీడియా ముందుకు వచ్చి వల్లె వేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా పెగాసిస్ సాఫ్ట్ వేర్ ప్రభుత్వాలకు తప్ప వ్యక్తిగతంగా ఎవరికీ విక్రయించరాదని ఇజ్రాయిల్ ప్రభుత్వ పాలసీలోనే స్పష్టంగా పేర్కొన్న విషయం వైసిపి నేతలకు తెలియకపోవడం వారి అజ్జానానికి నిదర్శనం.

ఒకవేళ చంద్రబాబునాయుడు హయాంలో రాష్ట్రప్రభుత్వం తరపున పోలీసుశాఖ పెగాసిస్ స్పైవేర్ ను కొనుగోలు చేసి ఉన్నట్లయితే అది పోలీసు విభాగం రికార్డుల్లో ఉంటుంది.
ప్రస్తుతం అధికారంలో ఉన్నది వైసిపి ప్రభుత్వమే కనుక పోలీసువిభాగం నుంచి రికార్డులు తెప్పించుకొని అదే వాస్తవమైతే ప్రజలముందు ఉంచవచ్చు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన కె.నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి పెగాసిస్ సాఫ్ట్ వేర్ పై సమాచారచట్టం కింద అడిగిన ప్రశ్నకు 12 ఆగస్టు, 2021న గౌతమ్ సవాంగ్ గారి కార్యాలయం సమాధానమిస్తూ అటువంటి సాఫ్ట్ వేర్ ఏది కొనుగోలు చేయలేదని స్పష్టంచేశారు.

ర్యాంబో రాంబాబుకు ఏమైనా అక్షరజ్జానం ఉన్నట్లయితే సంబంధిత ఆర్టీఐ పత్రాలను కూడా జతచేస్తున్నాం. ఒకసారి ట్రాన్స్ లేటర్ తో తర్జుమా చేయించుకొని తెలుసుకోవచ్చు.నిజంగా పెగాసిస్ లాంటి అడ్వాన్స్ డ్ సాఫ్ట్ వేర్ చంద్రబాబునాయుడు హయాంలో ఉండి ఉంటే బాబాయ్ గొడ్డలిపోటు వెనుక ఉన్న కుట్రను ఆనాడే బయటపెట్టి ఉండేవాళ్లం.అలాంటి సాఫ్ట్ వేర్ ఒకటి మా వద్ద ఉంటే మీ కోడికత్తి డ్రామాను కూడా ఎన్నికల సమయంలోనే ప్రజలముందు ఉంచేవాళ్లం.

రాష్టంలో కల్తీసారా మరణాలపై ప్రజలనుంచి పెద్దఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కీలకమైన ఆ సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తమకు వెన్నతో పెట్టిన విద్య అయిన అబద్దాలను జగన్ రెడ్డి మరోమారు ప్రయోగిస్తున్నారు.

ప్రభుత్వంలో ఉన్నది వైసిపినే కనుక ఏమాత్రం ఆధారాలున్నా విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకునే అధికారం మీకే ఉంది. ఆధారాలున్నా తేల్చలేకపోవడానికి మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంత చేతగానివారా ర్యాంబో రాంబాబు?

సోది కబుర్లు ఆపి ముందు కల్తీసారా మరణాలపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయండి. ప్రజల దృష్టిని మళ్లించే మీ చీప్ ట్రిక్స్ ను జనం నమ్మే పరిస్థితుల్లో లేరని, ప్రజలను ఎల్లకాలం అబద్దాలతో నమ్మించలేరని ర్యాంబో రాంబాబు గమనిస్తే మంచిది.

LEAVE A RESPONSE