జననమరణాల కాలమే తెలియని సన్యాసి..
చక్రవర్తిగా పుట్టి
సకల భోగాలు అనుభవించి
ముదిమిని..రోగాన్ని…
మరణాన్ని చూసి చలించి
ఐహిక సౌఖ్యాలను త్యజించి
సిద్ధార్థుడు.. సిద్ధ అర్ధుడు..
గౌతముడై..బుద్ధుడై..
ఆయన నీతి..నిరతి
బౌద్ధమై…పరిశుద్ధమై..
మానవాళికి ఆచరణమై..!
ఆరు దంతాల గజము
గర్భములో చొచ్చినటుల
కల కాచిన తల్లి..
బిడ్డ భవితపై తల్లడిల్లి..
సిద్దుడైపోతాడని తెలియగా
జగమే చూడని రీతిలో పెరిగిన సిద్ధార్థుడు…
ఒకనాటికి సర్వం తెలుసుకుని
చరితార్ధుడయ్యె..!
నడిరాతిరి అంతఃపురం విడిచిన సిద్ధార్ధుని
పయనం..జగతికి గమనం
అందుకే టకటకమనే
గుర్రపు డెక్కల రొద
సిద్ధార్ధునికి కటకట కారాదని
దేవతలే శబ్దాన్ని నిశ్శబ్దం చేసి
దైవం ఆగమనానికై
వేలుపుల పిలుపు..
మానవాళికి మేలుకొలుపు..
అదే అదే…
బుద్ధం శరణం గచ్ఛామి..!
మగధలో తొలి భిక్షాటన
బింబిసారుని సింహాసన
తిరస్కరణ..
ముప్పది అయిదేళ్ల ప్రాయంలో జ్ఞానోదయం..
జగతికి ఉషోదయం..
బోధి చెట్టు చెప్పిందేమో
తత్వాల గుట్టు..
చేర్చి ఆధ్యాత్మిక గట్టు..!
బుద్ధుని బోధనలు,శోధనలు
విశ్వవ్యాప్తమై వలదనుకున్న
జనకుడే మరణశయ్యపై
కొమరుని బోధనలు విని
తా సన్యాసిగా మారె
సుతుడే గురువై..
రాజ్యమే బరువై..!
స్త్రీలను సైతం బౌద్ధం వైపు మరల్చగా బుద్ధుడు..
ఈ సిద్దార్థం..
అందులోని గూడార్థం
అవగతమై..
గౌతముని తత్వమే అప్రతిహతమై..
అర్ధాంగి సైతం సన్యాసిగా
అవతరించి తానూ తరించె..!
జగమున ఏ వస్తువైనా అనిత్యమని..
అలా భావింప అసత్యమని..
నేననే భావనే భ్రమని..
అజ్ఞానమే దుఖాలకు
హేతువన్న బుద్ధుని బోధ
నమ్మితే తీరిపోవు జగమున
మనుషుల బాధ!
సంభవామి యుగే యుగే..
బుద్ధుని సూక్తులతో
మానవ జీవితం
నిరంతరం ధర్మం వైపే
ఆగక సాగాలి
ఆగే ఆగే..!
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286