-రక్తంతో చంద్రబాబుకు జిందాబాద్
-టికెట్ ఇవ్వాలని రక్తంతో వినతి
ఇదో ప్రేమాభిషేకం లాంటి రక్తాభిషేకం. కమ్ రక్తాభిమానం! అభిమానం ఒక్కోసారి ఎదుటివారికి ఆనందపరుస్తుంది. ఇంకోసారి ఆగ్రహం కలిగిస్తుంది. మరోసారి జాలి వేస్తుంటుంది. ప్రేమ కలుగుతుంటుంది. అప్పుడప్పుడూ మహా ఎబ్బెట్టుగా, అతిగా అనిపిస్తుంటుంది.
తమిళాభిమానం అయితే.. తమ అభిమాన నేత కోసం, ఒంటిమీద పెట్రోలు పోసుకుని, ఆత్మహత్యలు చేసుకునే లెవల్లో ఉంటుంది. తమిళనాడులో ఆనందానికి-ఆగ్రహానికి ఇలాంటి తరహా ఆత్మహత్యలే సింబాలిక్‌గా కనిపిస్తుంటాయి. మరి అది అభిమానమా? అమాయకత్వమా? ఉన్మాదమా? తెలిసీ తెలియని అజ్ఞానమా?! పేరు ఏదైతేనేం.. అభిమానం వేలంవెర్రి అయింది. అవుతోంది. అది నిజం!
ఇటీవల ఏపీ సీఎం జగన్ వద్దకు వచ్చిన ఒక జంట, అప్పుడే పుట్టిన తమ పాపకు పేరు పెట్టమని కోరారు. దానితో జగనన్న ఆ పాపకు రాజశేఖర్‌రెడ్డి అని పెట్టారన్న వార్త, మీడియాలో చూసిన పాఠకులు నోరెళ్లబెట్టారట. అది వేరే చిత్రమైన స్టోరీ. ఇది ఇంకో విచిత్రమైన స్టోరీ.
ఇప్పుడు బెజవాడలో టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన రక్తతర్పణం.. రక్తాభిషేకం వంటి రక్తప్రేమ హాట్‌టాపిక్‌గా మారింది. తనకు చంద్రబాబునాయుడు-ఆయన కుటుంబమంటే ఇష్టమని, తాను ఆ కుటుంబానికి వీరవిధేయుడినని బుద్దా తరచూ చెబుతుంటారు. బాబు కోసం తన ప్రాణమైనా ఇస్తానని చెప్పే బుద్దా.. లేటెస్టుగా, బాబు కోసం నా గుండె కోసి టేబుల్‌మీద పెడతా. నా రక్తం మొత్తం చంద్రబాబేనని.. ప్రేమాభిషేకం సినిమాలో అక్కినేనికి, కొంచెం అటు ఇటుగా భారీ సెంటిమెంట్ డైలాగులు కొట్టడం ఆందరినీ ఆకర్షించింది.
ఇంతకూ విషయేమిటంటే.. బుద్దా వెంకన్నకు ఇప్పుడు, విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి సీటు కావాలట. తాను బాబు వీరవిధేయ సైన్యానికి దళపతిని కాబట్టి.. గతంలో జోగి రమేష్ తన అధినేత ఇంటిపైకి దాడికి వెళితే, అడ్డుకుని సొమ్మసిల్లిపోయింది తానే కాబట్టి.. తన దరిద్రానికి కేశినేని వచ్చాడు కాబట్టి.. తన సేవలు గుర్తించి సీటివ్వమన్నది బుద్దా వారి రక్తవినతి.
అంతటితో ఆగితే సరిపోయేది. కానీ కొంచెం ముందుకువెళ్లి.. తన రక్తంతో గోడమీద సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే.. అని రాసి, తన ‘బాబాభిమానం’ చాటుకున్నారు. అంతా చూస్తుండగనే జరిగిన ఈ విచిత్రాభిమానం, అందరినీ ఆకట్టుకుంది. పైగా.. ‘నా రక్తంతో కంటే కాళ్లు కడిగే ప్రేమ ఉంటుందా? నా రక్తం మొత్తం చంద్రబాబే. నేను కొడాలి నాని, వంశీ, కేశినేని నాని టైప్ కాదు. పార్టీలో మూగ-చెవిటి వాళ్లున్నారు. బాబుపై వైసీపీ వాళ్లు ఎన్ని విమర్శలు చేసినా ఒక్కరూ మాట్లాడరు. ఎవరిమీదకైనా దూకే శక్తి,సైన్యం నాకుంది’ అంటూ తన అర్హతలేమిటో చెప్పేశారు.
ఇన్ని భారీ డైలాగులు కొట్టిన బుద్దా.. చివరకి ‘ఇదంతా బ్లాక్‌మెయిల్ అనుకునేరు. కేవలం అభిమానమే సుమా’ అంటూ, ఎందుకైనా మంచిదని ఆఖరిలో ఓ సెంటిమెంటు డైలాగు వదిలారు. ఇదండీ.. బెజవాడ వెస్ట్ సినీ ప్రొడక్షన్, బుద్దా వెంకన్న సమర్పించిన బుద్దావారి ‘రాజకీయ ప్రేమాభిషేకం’ సినిమా సన్నివేశాలు.