ఒకడుండే వాడు
తూనీగలకి గట్టిగా దారంకట్టి ఎగరేసే వాడు
వీటికి రక్తం కారదా అని నిరాశగా అడిగేవాడు
ఒకడుండే వాడు
శీతాకోకచిలక రెక్కలొలిచి మేడమీంచి కిందకి విసిరేవాడు
ఇవి ఏడుస్తున్నాయో లేదో నాకెట్టా తెలిసేది అని తల పట్టుకునేవాడు
ఒకడుండేవాడు
ఎవరూ చూడకుండా కోడిని పట్టి ఒక కాలు రాయి మీద పెట్టి ఇంకో రాయితో విరగ్గొట్టేవాడు
ఇదింకా పొద్దున్నే కూస్తుందారా అని అడిగేవాడు
ఒకడుండేవాడు
రోడ్డుమీద పడుకున్న కుక్కపిల్లని కడుపులో ఈడ్చి తన్నేవాడు
చచ్చింది లంజకాన అని ఆనంద పడేవాడు
ఒకడుండేవాడు
గోలీలాడుకునే పిల్లల మధ్యలో కెళ్ళి ఉచ్చపోసేవాడు
గోలీలు కడుక్కోండి
నా కొండెల్లారా అని భయపెట్టేవాడు
వాడు ఎదిగాడు, ఇంకా చాలా చాలా నేర్చాడు
కత్తులు జుళిపిస్తూ
జీపులు పరిగెట్టిస్తూ
వాట్సాప్ లో విషం పంచుతూ
బుల్డోజర్లని భలే నడిపిస్తూ…
ఒక్కటే తేడా ఇప్పుడు వాడిచుట్టూ జనాలు చేరి చప్పట్లు కొడుతున్నారు!
– అక్కిరాజు భట్టిప్రోలు