Suryaa.co.in

Andhra Pradesh

బటన్ రెడ్డి.. బటన్ నొక్కిన ప్రతి సారీ ఖజానాకు భారమే

-పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నట్లు జగన్ రెడ్డి ఆర్భాటం
-రూ.6 కోట్ల వడ్డీ చెల్లింపునకు రూ.15 కోట్లతో పత్రికా ప్రకటనలా.?
-మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్

జగన్ రెడ్డి బటన్ నొక్కుడు ఏంటో గానీ.. బటన్ నొక్కిన ప్రతి సారీ.. రాష్ట్ర ఖజానాకు భారీగా సున్నం పెడుతున్నారు. ఈరోజు తోడు పేరుతో జగన్ రెడ్డి బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి వేసిన సొమ్ము కేవలం రూ.6 కోట్లు మాత్రమే. దానికి 15 కోట్లు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అందులో రూ.10 కోట్లు కేంద్ర ప్రభుత్వ సొమ్ము అనే విషయం దాచి ప్రజల్ని మాయ చేస్తున్నారు. అయితే.. ఈ రూ.6 కోట్లు వేయడానికి బటనొక్కుతున్నట్లు చెప్పడానికి రూ.15 కోట్ల ఖర్చుతో పత్రికల్లో భారీ యాడ్స్ ఇవ్వడం సిగ్గుచేటు.

చిరు వ్యాపారులకు రూ.395 కోట్ల వరకు రుణాలు ఇస్తున్నది బ్యాంకులు. ఆ రుణానికి సంబంధించిన 6 కోట్ల వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది అంతే. ప్రస్తుతం ఈ పథకం కేంద్రం అమలు చేసే పీఎం స్వనిధి అనే విషయాన్ని దాచి పెడుతున్నారు. అందులోనూ జనాభా ప్రాతిపదికన చూసుకున్నా.. తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువ మందికి పథకం అందేలా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ.. జగన్ రెడ్డి కేంద్రాన్ని అడిగేందుకు కూడా ముందుకు రాకుండా ప్రజల్ని ద్రోహానికి పాల్పడుతున్నారు.

జగన్ రెడ్డి ఇచ్చిన పత్రికా ప్రకటనలో, ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ రోజు జగన్ రెడ్డి బటన్ నొక్కి ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తున్నట్లు పచ్చి అబద్దం చెప్పారు. బటన్ నొక్కి వేస్తున్నది కేవలం బ్యాంకుల ఖాతాల్లో మాత్రమే. ఆ మాత్రానికి ఇంత హడావుడి చేయడం ప్రజల్ని మోసం చేయడమే. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందడంలేదని అనేక చోట్ల ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. మున్సిపాల్టీలు, మండలాలవారీగా ప్రజా క్షేత్రంలో లబ్దిదారుల జాబితాను ప్రదర్శిస్తే అసలు నిజం బట్టబయలవుతుంది.

LEAVE A RESPONSE