– దాదాపు 8 మంది మంత్రులు అవుట్?
– జగన్ దూకుడు నేపథ్యంలో ఈసారి సీనియర్లకూ స్థానం?
– జగన్ త్వరలో పాదయాత్ర ప్రారంభిస్తారన్న ప్రచారం
– తొలగించే మంత్రుల్లో సుభాష్, కొండపల్లి, అచ్చెన్నాయుడు, ఆనం, సంధ్యారాణి, దుర్గేష్, రాంప్రసాద్‌రెడ్డి, పార్ధసారథి?
– అనితను కొనసాగిస్తారా? లేక శాఖ మార్పా?
– ఇటీవల హోం శాఖలో కంప్యూటర్ల కొనుగోల్‌మాల్‌పై మీడియాలో రచ్చ
– అచ్చెన్నాయుడుకు మళ్లీ టీడీపీ అధ్యక్ష పగ్గాలు?
– క్యాబినెట్లోకి టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్?
– తెరపైకి ప్రశాంతిరెడ్డి- సోమిరెడ్డి, కళా, రఘురామకృష్ణంరాజు, నాగబాబు, వెంకటరాజు, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, కొణతల పేర్లు
– కమ్మ వర్గానికి డిప్యూటీ స్పీకర్ అవకాశం?
– గోరంట్ల బుచ్చయ్యచౌదరికి చాన్స్?
– పల్నాడు జిల్లాకు ఈసారి అవకాశం ఉంటుందా?
– పనితీరు ఆధారంగా చంద్రబాబు కసరత్తు
– కొత్త క్యాబినెట్‌పై పార్టీ వర్గాల్లో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత మంత్రివర్గ విస్తరణకు తెరలేవనుంది. ఆ మేరకు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దానికంటే ముందు.. అంటే సీఎం చంద్రబాబునాయుడు తన సింగపూర్ పర్యటన నేపథ్యంలో ఐఏఎస్,ఐపిఎస్ బదిలీలు ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతోంది.
పార్టీవర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం..ఆగస్టు 6న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందంటున్నారు. నిజానికి ఆగస్టులో విస్తరణ ఉంటుందన్న ప్రచారం, చాలాకాలం నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రకారంగా ఆగస్టు 6న జరిగే విస్తరణలో.. దాదాపు 7,8 మంది సిట్టింగులకు స్థానభ్రంశం ఉండవచ్చని, సీఎం చంద్రబాబునాయుడు వారికి ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకపోవడమే దానికి కారణమంటున్నారు. వీరు అటు తమ శాఖతో పాటు, ఇటు సొంత జిల్లా-నియోజకవర్గాల్లో కూడా పట్టు సాధించకపోవడమే దానికి కారణమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఆ క్రమంలో వాసంశెట్టిసుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రాంప్రసాద్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, పార్ధసారథి, కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు, సంధ్యారాణి కొనసాగడం అనుమానమేనంటున్నారు. అయితే ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిపినా సుభాష్, కొండపల్లి, రాంప్రసాద్‌రెడ్డి, అచ్చెన్నాయుడు స్థానాలకు ఎసరు తప్పదన్న ప్రచారం, గత కొద్దికాలం నుంచీ మీడియా-సోషల్‌మీడియాలో ఎప్పటినుంచో జరుగుతుండటం విశేషం.
అయితే మంత్రి అచ్చెన్నాయుడుకు మళ్లీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి, ప్రస్తుత రాష్ట్ర పార్టీ అద్యక్షుడు, యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఆమేరకు ఆయనకు హామీ కూడా లభించిందంటున్నారు. ఫలితంగా అదే యాదవ వర్గానికి చెందిన మంత్రి పార్ధసారథిని కులసమీకరణల నేపథ్యంలో తొలగించక తప్పందంటున్నారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుకు, ఈసారి క్యాబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు.
క్షత్రియ వర్గం నుంచి 7 గురు ఎమ్మెల్యేలున్నప్పటికీ, గత క్యాబినెట్లో వారికి చోటు దక్కనందున ఈసారి ఆ లోటు భర్తీ చేయవచ్చన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సుభాష్‌ను తొలగిస్తే ఆయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి పితానికి అవకాశం ఇస్తారా? లేక ఎలాగూ గౌడ సామాజికవర్గానికి చెందిన మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నందున, ఈసారికి శెట్టి బలిజ నుంచి ఎవరికీ ఇవ్వకుండా వదిలేస్తారా అన్నది చూడాలంటున్నారు. ఎందుకంటే రాజులు, కళింగ, గవర వంటి కులాలకు ఈ క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం.
ఇక పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని, ఆ క్రమంలో అదే సామాజికవర్గానికి చెందిన మంత్రి కందుల దుర్గేష్‌ను తొలగించవచ్చంటున్నారు. జనసేన కోటాలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతల రామకృష్ణకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో హోంమంత్రి అనితను కొనసాగిస్తారా? లేక శాఖ మారుస్తారా అన్నది చూడాలి.
ఇటీవల పోలీసు శాఖలలో జరిగిన కంప్యూటర్ల కొనుగోల్ వ్యవహారం మీడియాలో రచ్చ అయిన విషయం తెలిసిందే. వివిధ ఆరోపణలు వచ్చిన ఆమె పీఏను, గతంలో తొలగించాల్సి రావడం తెలిసిందే. ఒకవేళ ఆమెను మారిస్తే, దళిత వర్గం నుంచి వెంకటరాజుకు చాన్స్ రావచ్చంటున్నారు.
ఇక నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డిని మారిస్తే, ఆయన స్థానంలో ప్రశాంతిరెడ్డి లేదా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని తీసుకోవచ్చంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొన్ని దశాబ్దాల నుంచి అనేకమంది టీడీపీ నేతలు పార్టీలు మారినా, సోమిరెడ్డి మాత్రం పార్టీని కాపాడుకుంటూ రావడమే కాకుండా, ప్రత్యర్ధులపై పోరాటం కొనసాగిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి స్థానంలో, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డికి అవకాశం ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. మంత్రి కొండపల్లి స్థానంలో, అదే తూర్పు కాపువర్గానికి చెందిన సీనియర్ నేత కళా వెంకట్రావుకు అవకాశం ఇవ్వవచ్చంటున్నారు.
ఇటీవలి కాలంలో ఉత్తరాంధ్రలో కాపులను అన్ని రంగాల్లో వెనక్కినెట్టి, వెలమ వర్గం అన్ని స్థానాలను ఆక్రమించుకుంటోందన్న విమర్శలు హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్రలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలక స్థానాల్లో ఉన్న కాపులను బదిలీ చేసి, కింజారపు కుటుంబం-సీఎంఓలోని ఓ కీలక అధికారి కలసి, తమ సామాజికవర్గానికి చెందిన అధికారులను ఆ స్థానాల్లో నియమించుకోవడంపై.. కాపులు సోషల్‌మీడియా గ్రూపు వేదికల ద్వారా, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం వెలుగుచూసిన విషయం తెలిసిందే.
విశాఖలోని గంటా నియోజకవర్గంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారి బదిలీ ఈ వివాదానికి దారితీసింది. ఆ క్రమంలో కాపు సంఘం నాయకులంతా గంటా వద్ద తమ నిరసన వ్యక్తం చేసినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. విద్యుత్ శాఖ యూనియన్ నాయకుడు, సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకనేతగా పనిచేసిన అధికారిని బదిలీ చేసి, ఆయన స్థానంలో వెలమ అధికారిని నియమించడం ఇంకా వివాదంగానే ఉంది.
అసలు ఉత్తరాంధ్రలో అధిక ఓటర్లమయిన తమకు, తొలిసారి బలమైన నాయకుడు లేకుండా చేశారన్న ఆగ్రహం కాపులలో వ్యక్తమవుతోంది. అన్ని కీలక పదవులు, అవకాశాలు వెలమ వర్గానికే ఇస్తుండటంతో.. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందన్న అసంతృప్తి, ఆ వర్గంలో ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఈ దృష్ట్యా సీనియర్ నేత కళా వెంకట్రావుకు అవకాశ ం రావచ్చంటున్నారు.
ఇదిలాఉండగా కమ్మ సామాజికవర్గానికి ఈసారి ప్రాధాన్యం ఉంటుందని ఆ సామాజికవర్గం ఆశిస్తోంది. ప్రస్తుతం ఆ వర్గం నుంచి లోకేష్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గొట్టిపాటి రవికుమార్ పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నారన్న వ్యాఖ్యలు, సొంత సామాజికవర్గంలోనే లేకపోలేదు. ఆయనను సొంత జిల్లాలోని సొంత సామాజికవర్గ నేతలు విబేధిస్తున్నారన్న ప్రచారం తెలిసిందే. ఇక కేశవ్ శాఖ మార్పు కోరుకుంటున్నారు.
నిజానికి కోడెల, తుమ్మల, పరిటాల స్థాయిలో తమ సామాజికవర్గంలో నాయకులను తయారు చేయలేకపోయారన్న అసంతృప్తి కమ్మవర్గంలో లేకపోలేదు. ఆ స్థాయిలో దూకుడుగా ఉండే కరణం బలరామ్ పార్టీ మారగా.. కులంలో కొంత ఇమేజ్ ఉన్న దేవినేని ఉమకు టికెట్ ఇవ్వకపోగా, బుచ్చయ్యచౌదరి- యరపతినేని శ్రీనివాసరావుని ఎమ్మెల్యేగా పరిమితం చేశారంటున్నారు. సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు సంగం డైరీ పితలాటకంతో ఆయనకు మంత్రి పదవి రాకుండా పోతోందంటున్నారు.
ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు మంత్రి పదవి ఇస్తే, ఆయన స్థానంలో సీనియర్ నేత-వివాద రహితుడైన గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అవకాశం ఇవ్వవచ్చంటున్నారు. అయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం ఆ పదవిలో అంత సంతృప్తిగా లేరని, ఆయన కూడా మంత్రి పదవి కోరుకుంటున్నారని చెబుతున్నారు. అచ్చెన్నాయుడును మార్చి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే, ఖాళీ అయ్యే ఆ వెలమ స్థానాన్ని పాత్రుడుతో భర్తీ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. అప్పుడు స్పీకర్ పదవి ఒక సీనియర్‌కు లభించవచ్చంటున్నారు.
కాగా మంత్రి ఫరూఖ్, సవిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, టిజి భరత్, బిసి జనార్దన్‌రెడ్డి, స్వామి, కొల్లు రవీంద్ర శాఖలు మారే అవకాశం లేకపోలేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. వీరిలో భరత్ పనితీరుపై సొంత జిల్లా పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు వైసీపీ నుంచి టీడీపీ ఖాతాలో కలుస్తుంటే, కర్నూలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్న అంశంపై చంద్రబాబు.. ఇటీవల తన కర్నూలు పర్యటనలో సీనియర్ల వద్ద ప్రస్తావించి, అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రత్యేక కారణాలతో ఆయనను తొలగించకపోవచ్చని, శాఖ మార్చవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
ఇదిలాఉండగా.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇకపై నిరంతరం జనంలో ఉండాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో.. ఆయనను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు క్యాబినెట్లో సీనియర్లకు స్థానం ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఒక దశలో ఆయన ఈ ఏడాది నుంచే మళ్లీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జగన్ దూకుడును ఎదుర్కోవాలంటే సీనియర్లే సరైన వారన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత మంత్రుల్లో చాలామంది జగన్‌పై ఎదురుదాడిలో విఫలమవడం, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కూడా చెప్పకపోవడంపై బాబు అనేకసార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత క్యాబినెట్లో కొందరు పార్టీ-ప్రభుత్వాన్ని వదిలేసి ఇసుక రీచ్‌లు, శాఖల్లో బదిలీల పేరిట వసూళ్లు, నియోజకవర్గంతోపాటు-శాఖను బంధువులకు కట్టబెట్టడం, మరికొందరు శని-ఆదివారాలు హైదరాబాద్,బెంగళూరు, దుబాయ్, సింగపూర్‌లో జల్సాలు చేసి మంగళవారానికి వస్తున్న వైనాన్ని కూడా చంద్రబాబునాయుడు పరిగణనలోకి తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలాఉండగా, టీడీపీకి తిరుగులేని పట్టున్న పల్నాడు జిల్లా నుంచి ఇప్పటివరకూ ఎవరికీ ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆ జిల్లా నేతల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఉన్న మూడు మంత్రి పదవులూ గుంటూరు జిల్లాకే ఇచ్చారంటున్నారు. పల్నాడు జిల్లాలో సీనియర్ నేత, కాపు వర్గంలో ఇమేజ్ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, కమ్మ వర్గంలో ఇమేజ్ ఉన్న యరపతినేని శ్రీనివాసరావులో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న సూచన వ్యక్తమవుతోంది.