– ఒంగోలు భూ కుంభకోణంలో కీలక పరిణామం
అమరావతి: ప్రకాశం జిల్లా ఒంగోలులో భూ కుంభకోణం సంచలనంగా మారిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌కు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి పిలుపొచ్చింది.భూ కుంభకోణంపై పూర్తి వివరాలతో రావాలని సీఎంవో అధికారులు ఎస్పీకి సమాచారమిచ్చారు. దీంతో సంబంధిత దస్త్రాలతో మలికా గార్గ్ బయల్దేరారు.
నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులతో ప్రైవేటు భూములపై అక్రమ లావాదేవీలు జరిగాయన్న బాధితుల ఫిర్యాదుతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కేసు అధికార వైకాపా ముఖ్యనేతలు, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి మధ్య పోరుగా మారింది. ఈ క్రమంలో ఇటీవల బాలినేని తన గన్‌మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
ఇదే విషయంపై బాలినేని గురువారం సీఎంవోకు వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిసి ఈ కేసు సంగతి తేల్చేలా జిల్లా అధికారులను ఆదేశించాలంటూ పట్టుబట్టినట్లు తెలిసింది. ‘నా పక్కనుండేవారైనా, పార్టీ (వైకాపా) మనుషులైనా.. కేసులో ఎవరున్నా సరే అరెస్టు చేయండి. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు చెప్పినా వారు స్పందించడం లేదు. అనవసరంగా నేను విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికారుల తీరు వల్లే నా గన్‌మెన్లను సరెండర్ చేశా’ అని ధనుంజయ రెడ్డికి బాలినేని చెప్పినట్లు సమాచారం.
బాలినేని వ్యవహారంతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోందనే ఉద్దేశంతో ఆయన్ను పిలిచి మాట్లాడాలని ముఖ్యమంత్రి చెప్పడంతో, తాడేపల్లికి పిలిపించారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తాజాగా జిల్లా ఎస్పీకి సీఎంవో నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.