స్పీకర్ అయ్యన్న పాత్రుడు
నలభై సంవత్సరాల క్రితం నర్సీపట్నంలో వాలీబాల్ ఆడుతున్న సమయంలో ఎమ్మెల్యేకి పోటీ చేసేలా నాకు ఎన్టీఆర్ నుంచి పిలుపొచ్చిందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అందువల్ల నా ఎమ్మెల్యే పదవి స్పోర్ట్స్ కోటా కింద వచ్చిందని భావిస్తుంటానన్నారు. అనకాపల్లిలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి 11వ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల కాలంలో రాష్ట్రంలో క్రీడలకు ప్రోత్సాహం కరువైందన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, ప్రత్యేక నిధులు కేటాయింపు జరిగేలా తన వంతు కృషి చేస్తానన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎక్కువ శాతం ఉద్యోగాలు ఉన్నాయని, అందువల్ల యువకులంతా ఆటలపై ద్రుష్టి ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా అందరూ వీటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ప్రత్యేక నిధుల కేటాయింపునకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెడితే, క్షేత్రస్థాయిలో దీన్ని అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.