Suryaa.co.in

Features

పిలుస్తున్నాడు పూలే..ఓ చాందసుడా..నిద్ర లే!_

ఎక్కడ అణచివేత మొదలైతే
అక్కడ తిరుగుబాటుకు
బీజం పడినట్టే..
ఎప్పుడు తిరస్కరణ
ఎదురైందో అప్పుడు
సంస్కరణకు శ్రీకారం జరిగినట్టే..
అయితే ఆ అణచివేత
అనే మాటకు అర్థం
తెలియక ముందే..
తిరస్కరణ అనుభవానికి రాక మునుపే
తిరుగుబాటుకు
తెర ఎత్తిన వాడు పూలే..
అమ్మ కడుపులోనే
అడ్డం తిరిగేసాడేమో
ఎదురెళ్ళడమే నేర్చాడు..
ఎదిరించడమే నేర్పాడు..
ప్రశ్నించడమే అజెండా..
ధైర్యమే గుండె నిండా!

నాదే సంప్రదాయం..
నేనే వేదం అంటే..
అది పిడివాదమని..
నీలాగే నేను..
నాలాగే అందరూ..
ఇదే వాదం..అదే నాదం..
పోరాటమే పథం..
తిరగబడ్డమే రిధం!

కొందరికే చదువంటే కుదరదన్నాడు..
ఇంతి ఇంటికే పరిమితమంటే
కాదని రోడ్డెక్కాడు..
అధమునికి గుడిలో ప్రవేశం లేదంటే ఒప్పనన్నాడు..
బడే గుడని..
అక్షరమే అమ్మని..
కలమే బలమని..
హలమే ఆయుధమని..
పూరించాడు శంఖం..
ఛాందసానికి అభిముఖం!

ఎన్ని చేశాడు
స్త్రీజనోద్ధరణ కోసం..
ఆయన కృషి ఫలితమే
నేటి అమ్మ గడపలో
ఈ శ్రావణమాసం..
అతివకు అక్షరం వస్తేనే తెగువన్నాడు..
ఆమె పసి వయసులోనే
వితంతువైతే
అది తగదన్నాడు..
అమ్మకు ఆసరాగా ఓ బడి..
నిమ్నుడి కోసం ఓ గుడి..
అలా ఏం చేసినా
ఓ ఒరవడి..!
పతికి తోడుగా సతి..
ఆమె ఆసరాతో
అనాధలకు వసతి..
అలా..ప్రతి దురాచారంపై
ప్రశ్నిస్తూ..నిలదీస్తూ..
బాపూ పుట్టక మునుపే
మహాత్ముడు..
కందుకూరికి
చాలా ముందే సంస్కర్త..
ఆధునిక భారతంలో
తిరుగుబాటుకు
తొలి ధర్మకర్త..!

మహాత్మ పూలే జయంతి
సందర్భంగా
నివాళి అర్పిస్తూ..

*ఎలిశెట్టి సురేష్ కుమార్*
9948546286

LEAVE A RESPONSE