Suryaa.co.in

Editorial

నరేంద్రుడి మాటలు నమ్మవచ్చా?

– మోదీ మాటలకు అర్ధాలు వేరులే!
– భోపాల్ వేదికగా కేసీఆర్‌పై మోదీ విసుర్లు
– కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని పిలుపు
– ఇప్పటిదాకా తెలంగాణలో కవితపై పెదవి విప్పని మోదీ, అమిత్‌షా
– భోపాల్ వేదికగా కేసీఆర్-కవిత ప్రస్తావన వెనుక మతలబేమిటి?
– తెలంగాణ బీజేపీ నేతల అసంతృప్తిని చల్లార్చే ఎత్తుగడేనా?
– కవితను అరెస్టు చేస్తేనే జనం నమ్ముతారంటున్న బీజేపీ నేతలు
– కోమటిరెడ్డి, ఈటల, కొండా వాదన అదే
– బీజేపీ-బీఆర్‌ఎస్ ఒకటేనని జనం నమ్ముతున్నారని వాదన
– కవితను అరెస్టు చేస్తేనే జనంలో నమ్మకం వస్తుందని స్పష్టీకరణ
– అమిత్‌షా భేటీలోనూ అదే తెగేసి చెప్పిన నేతలు
– కవితపై చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ వైపు బీజేపీ సీనియర్లు?
– తెలంగాణ నేతల అసంతృప్తి నేపథ్యంలోనే మోదీ వ్యాఖ్యలు?
– మోదీ మాటలతో బీజేపీలో నమ్మకం పెరుగుతుందన్న అంచనా
– కేసులపై చర్యలతోనే నమ్మకం వస్తుందంటున్న బీజేపీ సీనియర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రధాని మోదీ ఉన్నట్లుండి.. కేసీఆర్ కుటుంబంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ వేదికగా.. ప్రధాని మోదీ కుటుంబపాలనపై చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ బీజేపీలో కొత్త చర్చకు దారి తీశాయి. పార్టీలో ఉండాలా? వద్దా? అని లాభనష్టాలు బేరీజు వేసుకుంటున్న వారిలో పునరాలోచన రేపాయి. మోదీ వ్యాఖ్యలు నమ్మాలా? వద్దా? అవి కార్యాచరణ అవుతాయా? లేవా? నిజంగా కవితపై చర్యలు తీసుకునేందుకే మోదీ ఆ వ్యాఖ్యలు చేశారా? అలాగైతే మరికొంత కాలం వేచిచూద్దామా? అన్న శషభిషలకు తెర లేపాయి.

‘‘తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత బాగుండాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి. ప్రజలు బాగుండాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయండ’’ని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు పార్టీలో కొనసాగాలా? నిష్క్రమించాలా? సరైన సమయంలో కాంగ్రెస్‌లోకి వెళ్లాలా? అని సందిగ్ధంలో ఉన్న సీనియర్లను మరింత అయోమయంలో పడేశాయి.

అసలు ప్రధాని ఈ సమయంలో, భోపాల్ వేదికగా తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? అన్న చర్చకు బీజేపీలో తెరలేచింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితపై.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులు నమోదయి, విచారణ కూడా జరిగింది. అయినా ఆమెను ఇప్పటివరకూ అరెస్టు చేయకుండా, కేవలం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా తమ ప్రభుత్వం పావులు కదుపుతుండటాన్ని, తెలంగాణ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

కవితను రక్షించేందుకే శరత్‌చంద్రారెడ్డిని, ఏపీ సీఎం జగన్ ప్రోద్బలంతో అప్రూవర్‌గా మార్చారని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఒక్కదెబ్బతో తెలంగాణలో కవితను, ఏపీలో ఎంపి అవినాష్‌రెడ్డిని కేంద్రం వదిలేసిందన్న భావన జనంలో ఉంటే, తమ పార్టీని ప్రజలు ఎందుకు నమ్ముతారన్నది బీజేపీ నేతల ప్రశ్న. ఇక కవిత-అవినాష్‌రెడ్డి అరెస్టు కారన్న బలమైన భావన ఉన్నప్పుడు, బీఆర్‌ఎస్‌పై తాము చేసే పోరాటాలను, ప్రజలు ఎందుకు నమ్ముతారని బీజేపీ నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్-కవితను జైలుకు పంపిస్తామని ఇప్పటికి కొన్ని వందల డజన్లసార్లు హెచ్చరించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఆధారాలుంటే కచ్చితంగా అరెస్టు చేస్తారని మాటమార్చడంపై పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమయింది. దీన్నిబట్టి ప్రజలు తమ రెండు పార్టీల మధ్య , ఏం జరుగుతోందో గ్రిహ ంచలేనంత పిచ్చివాళ్లు కాదని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

‘మాకంటే జనం చాలా తెలివైన వాళ్లు. ప్రతిదీ పరిశీలిస్తారు. ఇప్పుడు సోషల్‌మీడియా వచ్చిన తర్వాత గ్రామాల్లో కూడా విశ్లేషణలు ఎక్కువయ్యాయి. ఇంతకాలం కవితను అరెస్టు చేయలేదంటే, దానికి కారణం మా కంటే రోజూ మీడియాను ఫాలో అయ్యే జనాలకే ఎక్కువ తెలుసు. విపక్షాలు కూడా కవితను అరెస్టు చేయకపోవడానికి కారణం.. బీజేపీ-బీఆర్‌ఎస్ లాలూచీ రాజకీయాలని ఆరోపిస్తుంటే, దాన్ని ఖండించడానికి మాకు శక్తి సరిపోవడం లేదు. కాదని చెప్పినా జనం నమ్మే పరస్థితి లేదు. కవితను కేంద్రం ఎందుకు అరెస్టు చేయడం లేదన్న రేవంత్‌రెడ్డి ప్రశ్నలకు మా దగ్గర జవాబు లేదు. నిజంగా ఆమెను అరెస్టు చేస్తే, అప్పుడు మాకు ఆయుధం దొరికినట్టవుతుంది. మాకు ఆయుధాలు ఇవ్వకుండా పోరాడాలంటే ఎలా? కేసీఆర్ కూడా మా పార్టీని విడిచిపెట్టి, కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారంటే దాని అర్ధం ఏమిటో ప్రజలకు తెలిసిపోదా’ అని ఓ బీజేపీ నేత విశ్లేషించారు.

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఈటల రాజేందర్ వంటి అగ్రనేతలు కూడా కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా, అధ్యక్షుడు నద్దా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌జీ వద్ద ఇలాంటి వాదనలే వినిపించారు. ఈటల, కొండా, కోమటిరె డ్డి అయితే.. ఈ వాదనను మీడియాముఖంగానే పలుసార్లు ప్రస్తావించడం గమనార్హం.

కవితను అరెస్టు చేయకపోవడం వల్ల, బీజేపీ-బీఆర్‌ఎస్ ఒకటే అన్న భావన జనంలో నిలిచిపోయిందని, వారు అమిత్‌షాకు నిర్మొహమాటంగా స్పష్టం చేశారు. పార్టీలోకి చేరికలు కూడా ఈ కారణంతోనే నిలిచిపోయాయని చెప్పారు. కేసీఆర్‌పై అసంతృప్తిగా ఉన్న నేతలు, ఈ కారణంతోనే బీజేపీలోకి రాకుండా, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వెల్లడించారు.

బీఆర్‌ఎస్‌కు తాము వ్యతిరేకమన్న అంశాన్ని, మాటలు-భావోద్వేగమైన సవాళ్ల రూపంలో కాకుండా.. కార్యాచరణ- చర్యల రూపంలో తీసుకోనంతవరకూ, తెలంగాణలో బీజేపీ ఎదిగే అవకాశం లేదని వారు ఖరాఖండిగా చెప్పారు.

ఈ కారణాలతోనే తాము కూడా.. తమ మద్దతుదారుల అభిప్రాయాలు తీసుకుని, భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటామని తెగేసి చెప్పడం, బీజేపీ బాసులను ఖంగుతినిపించింది. దానితో అగ్రనేతలు, వారికి నిర్దిష్టహామీ ఇవ్వలేని దుస్థితి. ప్రధానంగా ఈటలకు, ప్రచార కమిటీ చైర్మన్ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కాగా తెలంగాణ నేతలతో చర్చల సారాంశాన్ని బీజేపీ అగ్రనేతలు మోదీకి నివేదించారు.

దానితో తెలంగాణ బీజేపీ నేతలు, కవిత అరెస్టుపై పట్టుదలతో ఉన్నారని గ్రహించిన మోదీ.. వారిని సంతృప్తి పరిచేందుకే, భోపాల్‌లో కవిత పేరు ప్రస్తావించినట్లు బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. భోపాల్‌లో బీఆర్‌ఎస్ పోటీ చేయడం లేదు. అక్కడ ఆ పార్టీ లేదు. పోనీ అక్కడ బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తే ఓట్లు ఏమైనా వస్తాయంటే, అక్కడ ఆ పార్టీ పోటీ చేసే అవకాశం లేదు. అదీకాక తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. ఏరకంగా చూసినా మోదీ వ్యాఖ్యలు.. అటు బీజేపీకి గానీ, ఇటు బీఆర్‌ఎస్‌కు గానీ లాభించవన్నది మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది.

కేవలం కేంద్రం- పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న.. తెలంగాణ బీజేపీ నేతలను సంతృప్తిపరిచేందుకే, మోదీ.. సీఎం కూతురు కవిత పేరు ప్రస్తావించినట్లు బీజేపీ అసంతృప్త నేతలకు అర్ధమయింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ.. అదే కేసులో ఉన్న కవితను, ఇప్పటిదాకా అరెస్టు చేయకపోవడం సహజంగా ఎవరికయినా అనుమానం రేపుతుందని, బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈడీ, సీబీఐ, ఐటి వంటి సంస్థలను చేతిలో ఉంచుకుని కూడా.. కేసీఆర్ కుటుంబంపై ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదంటే, ప్రజలు తమ పార్టీని బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎందుకు భావిస్తారన్న చర్చ, బీజేపీలో చాలాకాలం నుంచే మొదలయింది.

ఇటీవల కేటీఆర్ ఢిల్లీకి వెళ్లింది ఐటి కేసుల కోసమేనని, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దానికి తమ పార్టీ ఇప్పటివరకూ, స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయిందని ఓ బీజేపీ నేత వాపోయారు. ఐటి దాడుల్లో పట్టుబడ్డ వివరాలను.. అటు ఐటి శాఖతో కూడా విడుదల చేయించి, తమ నిజాయితీ నిరూపించుకోలేకపోయామని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంపి-పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన డాక్యుమెంట్లను, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. రాష్ట స్థాయిలో జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ల రూపంలో బట్టబయలు చేసి, సంచలనం సృష్టిస్తున్నారు.

అయితే ప్రతిరోజూ కేసీఆర్ అవినీతిపై ఆరోపణలు గుప్పిస్తున్న… బీజేపీ అధ్యక్షుడు-ఎంపి బండి సంజయ్, ఇప్పటిదాకా కేసీఆర్ కుటుంబ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? తన దగ్గర ఉన్న ఆధారాలను ఎందుకు సమర్పించలేదన్న ప్రశ్న బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇద్దరి చర్యలను బట్టి… బీఆర్‌ఎస్‌పై, ఎవరు సీరియస్‌గా పోరాడుతున్నారన్న అంచనా ప్రజల్లో ఉండదా అన్నది బీజేపీ నేతల ప్రశ్న.

భోపాల్‌లో కవిత పేరు ప్రస్తావించిన ప్రధాని మోదీ.. గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె పేరు-లిక్కర్ కేసును, ఎందుకు ప్రస్తావించలేదన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. ఇదంతా కేవలం.. కవితపై చర్యలు తీసుకోవడం లేదన్న బీజేపీ నేతల అసంతృప్తిని చల్చార్చేందుకు, మోదీ వ్యూహాత్మకంగా చేసిన ప్రకటనగా భావిస్తున్నారు.

ఆ ప్రకటన వారిని బుజ్జగించేందుకా? లేక వారిలో నమ్మకం కల్పించేందుకా అన్నది, పార్టీ వర్గాలకు అర్ధం కావడం లేదు. అయితే కొద్దికాలం వేచి చూసి, బీజేపీ నేతలు ఎవరి నిర్ణయం వారు తీసుకుంటారని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

‘మాకంటే తప్పదు. ఈ పార్టీలోనే ఉంటాం. వాళ్లంటే మాస్ లీడర్లు. ఎవరి ఇబ్బందులు వారికుంటాయి. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకుంటేనే జనం బీజేపీతో ఉంటారని, వాళ్లు చాలాకాలం నుంచి వాదిస్తున్నారు. వారి వాదన కాదనలేం. కానీ వారి ప్రశ్నలు, డిమాండ్లు తీర్చే స్థాయి మన రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఢిల్లీలో వారికి పెద్దలు ఏం హామీ ఇచ్చారో, వీళ్లు వాటిని ఎంతవరకూ నమ్ముతారో చూడాలి’’ ఓ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

కవిత కేసు ప్రారంభమైన తర్వాత మోదీ, అమిత్‌షా, నద్దాతోపాటు .. చాలామంది కేంద్రమంత్రులు, తెలంగాణకు వచ్చారు. అయినప్పటికీ వారెవరూ, కవిత పేరు ప్రస్తావించిన దాఖలాలు లేవని, బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఎక్కడో భోపాల్‌లో కవిత పేరు ప్రస్తావిస్తే, మోదీ మాటలు ప్రజలు ఎలా నమ్ముతారంటున్నారు.

ఇప్పుడు ప్రధాని హటాత్తుగా.. కేసీఆర్ కూతురు కవిత పేరు ప్రస్తావించినంత మాత్రాన, అనుమానాలకు తెరపడదని స్పష్టం చేస్తున్నారు. తమకు-బీఆర్‌ఎస్‌కు మధ్య ఏమీ లేదని.. తమ పార్టీ బీఆర్‌ఎస్‌పై పోరాడుతుందని ప్రజలు నమ్ముతారనుకుంటే, అది భ్రమేనని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని మాటలు ..కార్యాచరణ రూపం దాల్చి, కేసీఆర్ కుటుంబంపై చర్యల దిశగా సాగుతేనే.. ప్రజలు తమ పార్టీని నమ్ముతారని, బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

LEAVE A RESPONSE