-ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కుప్పం నుంచి గెలవాలంటే కుదరదండీ!
-వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
తాడేపల్లి: ‘అప్రకటిత ఎమర్జెన్సీ’లో వీధిపోరాటాలకు వీలుంటుందా? అని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కుప్పం టూర్‌లో చంద్రబాబు తీరును ఆయన ఖండించారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనకు వచ్చి ప్రజల బాగోగులు కనుక్కుందామనకున్నారట. ఆ పనేదే ఆయన కుప్పం గ్రామాల్లో ప్రశాంతంగా చేసుకోకుండా అనవసరంగా పాలకపక్షంపైనా, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిపైనా రంకెలేస్తున్నారు. ‘ఫెయిల్డ్ సీఎం’ అని నిర్ధారించిన ఈ మాజీ ముఖ్యమంత్రి– ఏపీ పరిపాలనకు సంబంధించి ఏఏ రంగాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైందో చెప్పడం లేదు. నిరాధారమైన నిందలేస్తూ ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ ఆంధ్రప్రదేశ్ లో అమలులో ఉందనే పసలేని ఆరోపణలతో జనం సానుభూతి కోసం ఆయన వెంపర్లాడుతున్నారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అసెంబ్లీలో చక్కగా ప్రవర్తించారంటూనే– తాను మాత్రం ప్రస్తుత సీఎంపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పాపానికి తాను పాలకపక్షంపై ఎంత అడ్డుగోలు విమర్శలకు తెగబడినా.. ఏం కాదనే ధీమా నారా వారిలో కనిపిస్తోంది. ఆయన చెప్పుకుంటున్నట్టు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి కూడా పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని చంద్రబాబు అనరాని మాటలు అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. కుప్పంలో కూర్చుని తన విష ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన 174 నియోజవర్గాల ప్రజలను మాయచేసి, బురిడీ కొట్టించాలని ఆయన పన్నాగాలు పన్నుతున్నట్టు కనిపిస్తోంది. విస్తృతానుభవంతో సమయస్ఫూర్తి గల రాజకీయవేత్తగా నడుచుకోవాల్సిన నాయుడు గారు ఇలా రెచ్చిపోయి మాట్లాడడం దేనికి సంకేతం? ఆయనను ఓటమి భయం వెంటాడుతోందా? లేక ఏ మాత్రం వాస్తవానికి దగ్గరగా లేని అభియోగాలతో 2024 ఏపీ శాసనసభ ఎన్నికల్లో గెలవగలనని ఆయన కలలు కంటున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు సామాన్య ప్రజానీకానికి కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం ఏపీలో ఉన్నది ‘పాత కాంగ్రెస్’ ప్రభుత్వం కాదని గుర్తిస్తే మంచిది!
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1978లో, మళ్లీ 1989లో గెలిచి పదే పదే సీఎంలను మార్చుతూ గందరగోళ పాలన సాగించిన కాంగ్రెస్–ఐ ప్రభుత్వాలు తర్వాత జరిగిన 1983, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాట నిజమే. అయితే, 2003లో పాదయాత్ర జరిపి 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు జననేత దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గారు. ఐదేళ్ల జనరంజక పాలనతో ఆయన 2009 ఎన్నికల్లో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. జనసంక్షేమం విషయంలో తండ్రి బాటన నడుస్తున్న వైయస్ జగన్ గారు తాను సీఎం బాధ్యతలు తీసుకున్న 2019 నుంచీ అనేక మార్గాల్లో ప్రజాభిమానం పెంచుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా వాటిని విజయవంతంగా ఎదుర్కొంటూ సజావుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తున్నా.. ప్రజలకు సకాలంలో ప్రభుత్వం నుంచి సహాయం అందుతోంది. ఏపీలో అమలవుతున్న అనేక సంక్షేమ నగదు బదిలీ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు సైతం అధ్యయనం చేస్తున్నాయి. ఇలా రాష్ట్రం ప్రగతిపథంలో శరవేగంతో పయనిస్తుండగా చంద్రబాబు గారు మాత్రం కుప్పంలో కూర్చుని రాష్ట్ర సర్కారుపై శాపనార్ధాలు పెడుతున్నారు. 1975–77 నాటి ఎమర్జెన్సీ రోజులే బాగున్నాయని సర్టిఫికెట్ ఇస్తున్న చంద్రబాబు మాటలు కుప్పం ప్రజలకే వెగటు పుట్టిస్తున్నాయి. ఇకనైనా టీడీపీ అధినేత తన కాలూచేయీ కూడదీసుకుని ప్రజాతంత్ర పంథాలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైతే అందరికీ మంచిది.