నిన్న, మొన్న దేశం మొత్తం ఏకమై చేసిన చట్టాన్ని మళ్లీ మార్చవచ్చా?
కచ్చితంగా.. అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ!
శాసనసభ నుండి పార్లమెంటు వరకు చట్టాలను మార్చే ప్రయత్నాలను, సభల్లో ఆమోదించే వెసులుబాటును రాజ్యాంగం కల్పించింది. కానీ ఏ (అక్రమ) చట్టం అయినా చెల్లుబాటు అయ్యే అవకాశం లేకుండా అదే రాజ్యాంగం అడ్డుగోడగా నిలుస్తుంది. అదే బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన ‘బ్యూటీ ఆఫ్ రాజ్యాంగం’.
చేసే చట్టంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే, ఆ చట్టాన్ని అడ్డుకునే సర్వోన్నత న్యాయస్థాన వ్యవస్థను రాజ్యాంగానికి ఒక దుర్భేద్యమైన రక్షణ కోటలా మన రాజ్యాంగమే సృష్టించుకుంది. కుల, మత, ధన, జాలి, భయాలకు లోనై ప్రజాస్వామ్యం ఏదైనా తప్పు చేస్తే, ఐదేళ్లకే దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా అదే రాజ్యాంగం కల్పించింది.
అదే మన ఇండియా!
పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు లేని పటిష్టమైన రాజ్యాంగం మనకుంది. ఆఖరికి రాజ్యాంగ సవరణ చేయాలన్నా, అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి ఉండాలి తప్ప, వాటికి విరుద్ధంగా ఉండకూడదు. అదీ మన రాజ్యాంగ గొప్పతనం.
దేనికైనా అడ్డుపడే మన దేశ రాజకీయ పక్షాలన్నీ ఏకమై, ఆంధ్రుల ఆవేదనను అర్థం చేసుకుని ఏకగ్రీవంగా చట్టం చేశాయి. ఎందుకు?
మనం ‘అయ్యో’ అని ఒక్క అవకాశం ఇస్తే.. ఒక రాజకీయ మోసగాడు ఆ ఐదేళ్ల అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ చేసిన విధ్వంసాన్ని చూసి దేశం మొత్తం అవాక్కయ్యింది. ‘అయ్యో ఆంధ్రా’ అని దేశం మన మనసులకు స్వాంతన చేకూర్చింది.
రాజ్యాంగంలో రాజధాని పేరు ప్రస్తావన లేకపోవచ్చు.. కానీ రాజ్యాంగ మౌలిక సూత్రాలు అర్థమై ఉంటే, ఆ రాజకీయ మోసగాడు శాసనసభలో చేసిన చట్టాలు కోర్టుల ద్వారా చివాట్లు తిని, అదే సభలో ఉపసంహరణకు గురయ్యేవి కావు. రాజ్యాంగం కనుక పటిష్టంగా లేకపోతే, ఆ అక్రమ చట్టాలే అమల్లోకి వచ్చేవి. శాసనసభలో చేసిన చట్టాన్నే అన్నిసార్లు ఉపసంహరించుకుని, ఎన్నో జీవోలను కోర్టుల ద్వారా కొట్టేయించుకున్న ‘ఘనత’ దేశంలో ఆ రాజకీయ మోసగాడికే దక్కుతుంది.
అమరావతిలో సెంటు భూమి ఉన్న దళితుడి నుండి, పెట్టుబడి పెట్టే దేశీ, అంతర్జాతీయ సంస్థలకు, రుణాలు ఇచ్చే ప్రపంచ బ్యాంకు వరకు.. వారి పేర్లు రాజ్యాంగంలో లేకపోయినా అందరికీ రక్షణ ఉంది. అందుకే పెట్టుబడులు, రుణాలు వస్తున్నాయి.. వస్తాయి కూడా!
* ఆర్టికల్ 14: వివక్షకు తావులేకుండా అందరికీ సమాన రక్షణ.
* ఆర్టికల్ 21: గౌరవప్రదమైన జీవన ప్రమాణం.
* ఆర్టికల్ 300A: చట్టబద్ధమైన కారణం లేకుండా ఆస్తిని హరించలేరు.
రాజ్యాంగం అర్థమైతే.. ఇక రాజధాని కాదు కదా, దాని పేరు కూడా మార్చలేరు. అదే ఆ రాజకీయ మోసగాడి నుండి.. ఆ బ్యాచ్ కోసం పనిచేసే అందరికీ అర్థమైతే.. దేశం దీవెనలతో అమరావతి చట్టబద్ధత బిల్లు అవసరమే వచ్చేది కాదు.

