Suryaa.co.in

Political News

పార్టీల ప్రచార సాధనాలను…. మీడియాగా గుర్తించవచ్చా !?

“పెన్ ఈజ్ మైటీయర్ ద్యాన్ స్వార్డ్”
“Pen is mightier than sword ”
అనే కొటేషన్ ను మనం ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం. అంటే -” కత్తి కంటే కలం గొప్ప…” అని .

కత్తి తీసుకుని జనం మీద పడితే ; మాచర్ల వరకే భయపడతారు .అదే కలం పట్టుకుంటే ….దానికి ఎల్లలు ఉండవు. ఆ కలం పోరంబోకుల చేతిలో ఉంటే….!?

పోరంబోకుల చేతికి కలం చిక్కితే , కత్తి కంటే ప్రమాదకరమని 185 సంవత్సరాల క్రితమే ఎడ్వర్డ్ లిట్టన్ అనే బ్రిటిష్ నవలాకారుడు , తన నవల – ‘కుట్ర ‘ లో ఒక పాత్రతో పలికించాడు . దానితో ఈ సామెత ప్రపంచవ్యాప్తమై పోయింది .

185 సంవత్సరాల (1839) క్రితమే , కలానికి అంత పవర్ ఉంటే; ప్రస్తుత మీడియా విస్పోటనం లో ఇంకెంత పవర్ ఉంటుంది ? ఊహకు సైతం అందనంత పవర్ కదా !

మీడియా ప్రభావం పెరిగింది . ప్రపంచ మీడియా మొత్తం వేయి జడలు విరబోసుకుని అరచేతిలోకి వచ్చింది . చదువు రాని వారిని , చదువు సంధ్యలు లేని వారిని సైతం అమితంగా ప్రభావితం చేస్తున్నది . ఒక ఆటంబాంబు వేస్తే , వేసిన చోట కొన్ని కిలోమీటర్ల దూరం లోనే విధ్వంసం చోటుచేసుకుంటుంది . కానీ , ఒక రాత పూర్వక పుకారు ….మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేసి పారేస్తుంది .

అందుకే , నాయకావతారాలు ఎత్తిన కొందరు తెలివైన పిండాలు ..
తమ రాజకీయ ప్రత్యర్ధుల మీద బురద , పేడ, అశుద్ధం వగైరా జల్లడానికి పత్రికలు , టీవీ ఛానెళ్లు పెట్టుకుంటారు ..
వారికంటే ఘనులను ….ఆ సంస్థలలో బురద జల్లే పనికి పెట్టుకుంటారు .

ఇక , చూస్కోండి……
ఇలా తమ తమ యాజమాన్యాల లో పత్రికలు , న్యూస్ చానెళ్ళు పెట్టుకున్నవారు …. ఈ రాత గాళ్లను , కూత గాళ్ళను దేశం మీదకు వదులుతుంటారు .

వీరికి వాస్తవాలతో పని లేదు . రాతలు ….కూతలలో సభ్యత , సంస్కారాలతో పని లేదు . తమ యాజమానుల రాజకీయ ప్రత్యర్థుల పై ఎంత అశుద్దం చిలకరించామన్నదే క్రైటీరియా.
వీరిని కూడా జర్నలిస్ట్స్ గా పరిగణిస్తున్నారు .

వీరికీ అక్రిడిటేషన్ లు ఇస్తున్నారు. బస్ పాస్ లు ఇస్తున్నారు . ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు . అధికార ప్రెస్ మీట్లకు పిలుస్తున్నారు. సచివాలయం , జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్లు ,ప్రభుత్వ కార్యాలయాలు , పోలీసు ప్రెస్ మీట్లు మొదలైన అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ….కొత్త పెళ్లి కొడుకుల్లా ముందుకు ముందు హాజరవుతుంటారు.

తమ యజమానులకు మైలేజ్ ఇచ్చే ప్రశ్నలు అడుగుతుంటారు . వారు అడిగే ప్రశ్నల తీరు తెన్నులను బట్టి చెప్పేయవచ్చు ; ఆ ప్రశ్న వేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో!

పాలల్లోంచి నీటిని వేరు చేసినట్టు , ఈ “ఫేక్ మీడియా ” ను మీడియాను వేరు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఫేక్ మీడియా కు దాని యజమాని ప్రయోజనాలు ముఖ్యం . తన యజమాని ప్రత్యర్థుల “వ్యక్తిత్వ హననం ” ముఖ్యం . ఇందు కోసం ఎన్ని అసత్యాలు ,దారుణ కథనాలు జనం మీదకు వదలడానికైనా ఈ” ఫేక్ మీడియా” వెనుకాడదు . తమ యజమాని ప్రత్యర్థులకు వ్యతిరేకం గా “పబ్లిక్ ఒపీనియన్ ” ను విషతుల్యం చేయడమే ఈ ” ఫేక్ మీడియా ” ఏకైక లక్ష్యం . ఈ లక్ష్య సాధన లో సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి అడ్డు వచ్చినా కేర్ చెయ్యరు .

ఇటువంటి “సమాచార ఫ్యాక్టరీ” లలో రేయింబవళ్ళు అసత్యాలు ఉత్పత్తి చేస్తూ జనం మీదకు వదిలే” పని ” లో ఉన్న వారికి ….ప్రభుత్వ మర్యాదలేమిటి ? అక్రిడిటేషన్లు ఏమిటి ? బస్ పాస్ లు ఏమిటి ? ఇళ్ల స్థలాలు ఏమిటి? పోలీసు స్టేషన్ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ స్థాయి వరకు వీరికి ఆహ్వానాలు , స్వాగత సత్కారాలు ఏమిటి?

వారు చిమ్మదలుచుకున్న “సమాచార విషం ” ఎటుదిరిగీ చిమ్ముతారు . ఆ మాత్రం దానికి ….వారికి అతిథి మర్యాదలు ఎందుకు?
దీనినే ” డబ్బులు ఇచ్చి తన్నించు కోవడం ” అంటారు .
“మీడియా “ముసుగులో జనం ఆలోచనలను కలుషితం చేసే ఇటువంటి సంస్థలు ….ప్రభుత్వాలు విడుదల చేసే ప్రకటనల పై ఆధార పడవు . అందువల్ల ; “ఫేక్ మీడియా ” గా ప్రభుత్వం నోటిఫై చేసి , ప్రభుత్వ ప్రకటన లను కూడా వాటికి ఉపసంహరించాల్సి న అవసరం ఉంది.

“ఫేక్ మీడియా ” పై “తగిన” చర్యలు తీసుకోవడం లో ప్రభుత్వం నీళ్ళు నమిలినా, మెతక వైఖరి అవలంభించినా,”వాళ్ళ పాపాన వాళ్ళే పోతారులే” అనుకున్నా…..వాళ్ళ పాపాన వాళ్ళు పోరు . సమాజం పోతుంది .మంచి రాజకీయాలు పోతాయి .మంచి రాజకీయ నేతలు పోతారు.

– భోగాది వేంకట రాయుడు

LEAVE A RESPONSE