Suryaa.co.in

Devotional

స్త్రీలు గాయత్రీ జపం చేయవచ్చా?

స్త్రీలు గాయత్రీ జపం చేయవచ్చా? అని ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్న బదులుగా స్త్రీలు సూర్యకాంతి తీసుకోవచ్చునా? స్త్రీలకు ప్రాణమున్నదా? స్త్రీలకు సద్బుద్ధి ఉండవచ్చునా? వారు అందరికీ సద్బుద్ధి కోరవచ్చునా? అని ప్రశ్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

అవును స్త్రీలలో కూడా మానవత్వమున్నది. వారికికూడా ప్రాణమున్నది. వారికే కాక ఇతరులకు కూడా సద్బుద్ధి కావాలని వారు కోరవచ్చును, అని సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నట్లే స్త్రీలు కూడా గాయత్రీ జపం చేయవచ్చును అని సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది.

స్త్రీలకు గాయత్రీ జపం చేసే అధికారము లేదు. ఎందుచేతనంటే గాయత్రి వేదమంత్రము. వేదమంత్రములు స్త్రీలు చదువరాదు అని వాదించేవారు దయయుంచి ఈ క్రింది విషయాలన్నీ చదవండి. స్త్రీలకు వేదము చదివే అధికారం లేకపోతే వేదమంత్రాలను రచించడం, వ్యాఖ్యానించడం, వాటిపై విశేషజ్ఞానం సంపాదించి ఆధిపత్యం కలిగివుండటం అనేవి స్త్రీలు ఎలా సాధించారు ?

ఋగ్వేదం 8వ మండలం, 91వ సూక్తంలో 1 నుండి 7 వరకు వేదమంత్రములు రచించిన ఆపాలా స్త్రీ, ఐదవ మండలం రెండవ అనువాకంలో 28 షట్ ఋక్కుల మంత్రద్రష్ట విశ్వవారా స్త్రీ. ఋగ్వేద సంహితం దశమ మండలం 125వ దేవీ సూక్తంలోని 8 మంత్రాలు రచించిన వాగ్దేవి మహిళయే. ఋగ్వేదంలోని 10వ మండలంలోని 85 సూక్తులను రచించి ఋషి కాగలిగిన కీర్తి బ్రహ్మవాదిని సూర్యాకు లభించింది.

రోమపాద మహర్షి భార్య ఋగ్వేదంలోని ప్రథమ మండలంలో 126వ సూక్తము యొక్క మంత్రములను రచించి ఋషి మహాతపస్విని యైన గార్గి జనకమహారాజు సభలో యాజ్ఞవల్క్యుని ఓడించింది. మనువు కుమార్తె “ఇలా” తన తండ్రిచేత యజ్ఞం చేయించింది. వీరందరికీ వేదాధ్యయనం చేసే అధికారం లేకపోతే వేదజ్ఞులెలా అయ్యారు.

వాల్మీకి రామాయణంలో కౌసల్య, కైకేయి, సీత, తార మొదలగు స్త్రీలు స్వయంగా సంధ్యావందనం చేయటం స్వస్తివాచనము, వేదమంత్రాలు పఠించటం వర్ణించబడి ఉన్నది. వశిష్ఠ స్మృతిలో “ఒకవేళ స్త్రీ మనస్సులో భర్త యెడల దురభిప్రాయం కలిగితే పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, 108 సార్లు గాయత్రీ మంత్రము జపిస్తే ఆమె పవిత్రమవుతుంది” అని చెప్పబడి వుంది. కాశీలోని హిందూ. విశ్వవిద్యాలయంలో మొదట్లో స్త్రీలను వేదములు చదువనిచ్చేవారుగాదు.

పండిత మదనమోహన మాలవ్యా నియమించిన కమిటీ తీవ్రమైన పరిశోధనలు చేసి 1946 సంవత్సరము ఆగస్టు 22న ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా శ్రీ మాలవ్యా “పురుషులవలెనే స్త్రీలకు కూడా వేదాధ్యయనం చేయుటకు అధికారమున్నది” అని ప్రకటించారు.

గాయత్రి సర్వోత్తమమైన ఈశ్వర ప్రార్థన వేదభగవానుని అమృతమయమైన వాక్కు ఇటువంటి ఉపయోగకరమైన తత్వము స్త్రీలకు లేకుండా చేయడం న్యాయంకాదు తెలివైనపనికాదు. వివాహాది సంస్కారాలలో తన నోటితో అనేక వేదమంత్రములు వల్లించవలసి వున్నది. యజ్ఞాలలో స్త్రీలు ఎల్లప్పుడూ తమ భర్త వెంట ఉంటారు.

స్త్రీలు లేకుండా యజ్ఞం సఫలం కాదు. అందుకే శ్రీరామ చంద్రుడు(బంగారు సీతను చేయించుకొని యజ్ఞం పూర్తిచేసుకోవలసి వచ్చింది. వేదమంత్రములు లేకుండా యజ్ఞమే వుండదు…స్త్రీలకు వేదమంత్రములు చదివే అధికారం లేకపోతే యజ్ఞంలో పాల్గొనడం లేదా వివాహాది సంస్కారాలలో మంత్రోచ్చారణ చేయడం ఎలా జరుగుతుంది. గాయత్రీ ఉపాసన వలన సద్బుద్ధి పెరుగుతుంది. ఇంటిలో అతి సాత్వికమైన సామ్యమైన వాతావరణం ఏర్పడుతుంది.

ఆత్మ కల్యాణముతో పాటు ఐకమత్యము, సద్భావము, అనే లాభాలు కూడా కలుగుతాయి. భర్తలను సంస్కరించుకోవడం గాయత్రీ ఉపాసన ద్వారా చేయగల్గుతారు. శారీరకమైన అనేక రోగాలు దూరమై మానసిక శాంతి లభిస్తుంది.

గాయత్రీ ఉపాసన చేసే స్త్రీల గర్భాన జనించే సంతానానికి విద్య, బుద్ధి, వివేకము, తేజస్సు, ప్రతిభ. సత్ప్రవర్తన మొదలగు గుణాలకి లోటు ఉండదు. పిల్లవానికి పాలిచ్చేటప్పుడు తల్లి గాయత్రీ జపిస్తూ ఉంటే ఆపాలు పిల్లవాని శరీరాన్నీ, మనస్సును శుద్ధి చేయడంలో అమృతంవలె పనిచేస్తాయి. పిల్లలను ఆరోగ్యంగా, అందంగా, తేజస్సుతో, బుద్ధిమంతులూ, గుణవంతులూ, దీర్ఘాయుస్పూర్తి కలవారిగా తయారుచేయడంలో తల్లులు గాయత్రీమంత్రం వలన ఆశాజనకమైన లాభాలు పొందగలరు. విధవలు ఇంద్రియనిగ్రహం కలిగి, మనస్సును స్వాధీనంలో ఉంచుకోవడానికి గాయత్రి బ్రహ్మాస్త్రం వలె ఉపయోగిస్తుంది.
కన్యలు తమ వైవాహిక జీవితం కొరకు ఉపాసించవచ్చును.

సేకరణ

LEAVE A RESPONSE