Suryaa.co.in

Andhra Pradesh

మీకంత సీన్‌ ఉంటే 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేయగలరా?

– ఆ దమ్ము, ధైర్యం మీకున్నాయా?
– గుంపులుగా ఎందుకు పోటీకి దిగుతున్నారు?
– జనసేనతో జత కట్టి ఎందుకు వస్తున్నారు?
– దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా?
– మతి, గతి తప్పిన చంద్రబాబునాయుడు
– అందుకే మా పార్టీ వ్యవహారాలపై కామెంట్స్‌
– సీఎంగారిపైనా, ప్రభుత్వంపైనా పిచ్చి విమర్శలు
– ఎన్ని చేసినా చంద్రబాబుకు మళ్లీ ఓటమి
వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

ఆ దమ్ము మీకుందా?:
చంద్రబాబు మూడుసార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసే అవకాశాన్ని ఆయనకు ప్రజలిచ్చారు. మరి, నిజంగా ఆయన ప్రజలకు ఉపయోగపడిన పరిపాలన అద్భుతంగా చేసి ఉన్నట్లయితే, వారి కాలంలో వారిని నిజంగా ప్రజలు మెచ్చుకుని ఉంటే.. మీరు రేపటి ఎన్నికల్లో సింగిల్‌గా ఎందుకు పోటీ చేయలేక పోతున్నారు?. తాను 14 ఏళ్లపాటు సీఎంగా ఎలా పని చేశానో.. మళ్లీ అలాంటి పరిపాలన చూపిస్తానని ప్రజలకు ఎందుకు చెప్పలేక పోతున్నారు?.

సీఎం వైయస్‌ జగన్, వచ్చే ఎన్నికల్లోనూ సింగిల్‌గా పోటీ చేసి మొత్తం 175 సీట్లు గెలుస్తామని ధైర్యంగా చెబుతుంటే.. మీరెందుకు గుంపులు గుంపులుగా కలిసి పోటీకి దిగుతున్నారు? ఎందుకు జనసేన, పవన్‌కళ్యాణ్‌ను వెంట బెట్టుకుని రావాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా?.

నా సవాల్‌ స్వీకరిస్తారా?:
వైఎస్‌ఆర్‌సీపీ పేరు చెబితేనే బెంబేలెత్తిపోయే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ వారి పార్టీ సభల్లో బీరాలు పలుకుతున్నారు కదా? 151 స్థానాల్లోనూ అభ్యర్థుల్ని మార్చినా వైఎస్‌ఆర్‌సీపీ గెలవబోదని కోతలు కోస్తున్నారు కదా!. మరి మీ బాబూ కొడుకులకు నేనొక సవాల్‌ విసురుతున్నాను. దాన్ని స్వీకరించి 175 స్థానాల్లో మీరు సింగిల్‌గా పోటీ చేయండి. జగన్‌ని ఓడిస్తామని చెప్పే ధైర్యం లేదు కానీ.. పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తూ నానాటికీ దిగజారిపోతున్నారు.

గతి, మతి తప్పిన చంద్రబాబు:
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకుని వేల కోట్లు పోగేసుకున్న చంద్రబాబు, ఆ తర్వాత ఆధారాలతో సహా దొరికి విధి లేని పరిస్థితిల్లో జైలుకెళ్లాడన్న సంగతి అందరికీ తెలిసిందే. 53 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ తర్వాత ఆయన రోగాల వల్లనో హెల్త్‌గ్రౌండ్‌ వల్లనో బెయిల్‌ పొంది బయటకొచ్చారు. ఆ తర్వాత పలు దేవాలయాల్లో మొక్కులు తీర్చుకుని.. ఇప్పుడు పక్కా రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి విమర్శలు చేస్తూ.. బరి తెగించి మాట్లాడుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీని ఏదేదో చేస్తానంటూ.. లోక కళ్యాణానికే టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తున్నట్లు తనకు తాను వివరణ ఇచ్చుకుంటున్నారు. మా పార్టీ అంతర్గతంగా సీట్ల సర్దుబాటు చేసుకోవడాన్ని కూడా చంద్రబాబు తప్పు పడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. ఆయన జైలుకెళ్లడం వల్లనో.. లేదంటే, ఆయన వయసురీత్యానో గతి, మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపిస్తోంది.

రెండు పార్టీలను కాలగర్భంలో కలిపేస్తాం:
మా పార్టీ ఎన్నికల ప్రాసెస్‌ స్టార్ట్‌ చేసింది. అందులో భాగంగానే అంతర్గతంగా కొన్ని సీట్లు మార్చుకుంటున్నాము. కొందరికి ఈసారి సీట్లు తిరస్కరించబడుతున్నాయి. కొంతమందిని వేర్వేరు నియోజకవర్గాలకు మారుస్తున్నాము. మొత్తం 175 సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి రావాలన్న ఒక్క టార్గెట్‌ మాత్రమే కాదు. టీడీపీ, జనసేన కలయికలో మీ ఇద్దర్నీ తుక్కు తుక్కుగా ఓడించి ఈ రాష్ట్రంలో మీ పొత్తు అభ్యర్థుల్ని ఒక్క సీటులో కూడా గెలవనీయకుండా .. మీ రెండు పార్టీలను కాలగర్భంలో కలిపేయాలనే వ్యూహంతోనూ మేము వస్తున్నాం. ఇందుకు కారణం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాయి. 50శాతానికి మించి ప్రజలు మరలా జగన్‌మోహన్‌రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కావాలని అనుకుంటున్నారనే విషయం మరిచిపోయి మీరు మాట్లాడుతున్నారు.

చంద్రగిరి నుంచి ఎందుకు పారిపోయావ్‌?:
అసలు మా పార్టీ పరిస్థితి సరే, చంద్రబాబూ.. మీ సంగతేంటి..? గతంలో ఎన్నికలొచ్చిన ప్రతీసారీ మీరు అభ్యర్థుల మార్పు ఎప్పుడూ చేయలేదా..? మీరు రాజకీయంగా ఆరంగేట్రం చేసింది కాంగ్రెస్‌ పార్టీలో.. అప్పుడు చంద్రగిరిలో పోటీచేసి గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీలో మంత్రయ్యారు. ఎన్టీ రామారావుగారు 1983లో టీడీపీ పార్టీ పెడితే చంద్రగిరిలో మీరు తుక్కు తుక్కుగా ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రగిరిని వదిలి కుప్పంకు వచ్చారు కదా..? అదే కుప్పంలో ఇవాళ పోటీ చేస్తున్నారు కదా..? మరి, ఆ కుప్పంలో గెలుస్తారో లేదోనని తేల్చుకోవాలని చంద్రబాబుకు చెబుతున్నాను. అసలు, మీరు కుప్పం నుంచి పోటీ చేస్తారో.. లేదంటే, మరో చోట పోటీ చేస్తారో కూడా క్లారిటీ లేదు.

లోకేశ్‌ మంగళగిరిలోనే ఎందుకు?:
చంద్రబాబూ.. నీ సంగతి సరే, మీది రాయలసీమ చిత్తూరు ప్రాంతం కదా..? మరి, మీ అబ్బాయి లోకేశ్‌ను మంగళగిరిలో పోటీకెందుకు నిలబెట్టావ్‌..? మరి, మీ మార్పులు సమంజసమైందా..? అని అడుగుతున్నాను. గురివింద గింజ కింద నలుపెరగదన్నట్టు.. మా మార్పుల్ని మీరు ప్రశ్నిస్తున్నప్పుడు.. మీ బతుకును మేము నిలదీయలేమా..?

నీకెందుకు కడుపు మంట?:
ఇక, బాలకృష్ణ విషయానికొస్తే వారి స్వగ్రామం గుడివాడ కదా..? మరి, ఆయనెందుకు హిందూపురంలో నిలబడ్డాడు..? ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు బావమరిది అమ్మాయి కూకట్‌పల్లిలో ఎందుకు పోటీ చేశారో చెప్పగలరా..? మీ వదిన పురందేశ్వరి నియోజకవర్గమేంటో చెప్పండి..? మీరు గానీ, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు గానీ ఎక్కడెక్కడో పోటీ చేయొచ్చు గానీ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ సౌలభ్యం కోసం అభ్యర్థుల్ని అటూఇటూ మార్చుకుంటే మీకెందుకయ్యా అంత కడుపుమంట?.

తండ్రీ కొడుకుల దారి శంకరగిరిమాన్యాలే:
చంద్రబాబు చంద్రగిరిలో పోటీచేస్తే ఎన్టీరామారావు పార్టీ పెట్టి అక్కడ ఆయన్ను ఓడించారు. వారి అబ్బాయి లోకేశ్‌ మంగళగిరిలో పోటీ చేస్తే జగన్‌మోహన్‌రెడ్డి దెబ్బకు చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. రేపు అటు చంద్రగిరి, ఇటు మంగళగిరి రెండూ పోయి.. తండ్రీ కొడుకులు శంకరగిరిమాన్యాల్ని పట్టుకుని పారిపోవాల్సిందే. 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాక తప్పదు. ఇది రాసి పెట్టుకోండి.

మీ క్యాబినెట్‌లో వారి ప్రాధాన్యత ఏది?:
మూడు సార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు, ఏనాడూ తన క్యాబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అదే మా సీఎం ఆ వర్గాలకు తన మంత్రివర్గంలో ఏకంగా 68 శాతం స్థానం కల్పించారు. మరి చంద్రబాబు ఏనాడైనా, ఆ పని చేశారా? ఆయా వర్గాలకు మీ కేబినెట్‌లో ఎందుకు ప్రాధాన్యత కల్పించలేదు?.
అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నీ పల్లకి మోసేవారే అనుకున్నావు తప్ప .. వారు పల్లకి ఎక్కేవారు కాదని భావించిన దుర్మార్గుడివి నువ్వు. అందుకే నీకు గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చారు.

మాది సంక్షేమ ప్రభుత్వం:
మాది సంక్షేమ ప్రభుత్వం కాబట్టే మొత్తం 175 సీట్లు గెల్చుకుంటాం. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో కనీసం ఒక్క పేదవాడికి ఎక్కడైనా ఒక్క గజం భూమినిచ్చి ఇల్లు కట్టుకోమన్నాడా..? అదే మా నాయకుడు జగన్‌ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలిచ్చి వారికి గూడునీడను కల్పించిన సంగతిని పేదలెవరూ మరిచిపోలేరు.
అదే విధంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా కాపు సోదరులంటూ రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాల ద్వారా ప్రయోజనం కల్పించారు. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.2.41 లక్షల కోట్లు జమ చేశారు. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంక్షేమం అందిస్తోన్న ప్రభుత్వాన్ని చూసి చంద్రబాబుకు వెన్నులో భయం పట్టుకుంది.

యువగళం అట్టర్‌ఫ్లాప్‌:
చంద్రబాబు కొడుకు లోకేశ్‌ యువగళం యాత్రలో నడిచాడంట!. రేపో, ఎల్లుండో యాత్ర పూర్తవుతుందని ఏదో సభ పెట్టారంట!. నిజంగా, అతను ఎన్ని కిలోమీటర్లు నడిచాడో గానీ.. లోకేశ్‌ ఒక్క అంగుళం కూడా ఎదగలేకపోయాడు. కేవలం పెయిడ్‌ ఆర్టిస్టులతోనే యాత్రలు నడిపితే యువగళంలా అట్టర్‌ఫ్లాప్‌ అవుతాయన్నది రాజకీయాల్లో నిదర్శనంగా కనిపించిన విషయం.

అది ఎందుకూ పనికిరాదు:
యువగళం ముగింపు సందర్భంగా లోకేశ్‌ తన తండ్రికి రెడ్‌బుక్‌ను గిఫ్ట్‌గా ఇస్తాడంట. అందులో ఎవరెవరో పేర్లు రాశాడంట. ఎందుకు..? అది నాలుక గీసుకోవడానికీ పనికిరాని పుస్తకం. టీడీపీ అధికారంలోకి వచ్చేనా.. చచ్చేనా..? అలాంటి పరిస్థితుల్లో రెడ్‌బుక్‌ తెచ్చి ప్రజల్ని ఏదో చేస్తామనే స్థితికి మీరు దిగజారిపోయారు. ఎటూ అధికారం కోల్పోతున్నామనే మీరు ఫ్రస్టేషన్‌లో విమర్శలు చేస్తన్నారని ప్రజలకు కూడా అర్ధమైందని చెబుతున్నాను.

జనసేన బతుకంతా..:
రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు టీడీపీ, జనసేన కలయిక ప్రభుత్వం అవసరమని పవన్‌కళ్యాణ్‌ చెబుతాడు. ఆ పార్టీ బతుకంతా కలహాల కాపురమే అని చెప్పాలి. 2014లో కలిసి పోటీ చేశారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు టీడీపీ, జనసేన కలయిక ప్రభుత్వం అవసరమని పవన్‌కళ్యాణ్‌ చెబుతాడు. మరి, ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్‌కు ఎన్ని సీట్లు ముష్టి వేయాలనుకుంటున్నాడో చంద్రబాబు ధైర్యంగా సమాధానం చెప్పగలరా..? పవన్‌కళ్యాణ్‌ ఎన్ని సీట్లు తీసుకోవాలని అనుకుంటున్నాడో ఆయన్ను చెప్పమనండి. మీ ఇద్దరు కలిసేది రాష్ట్ర భవిష్యత్తుకా..?

మరి, గతంలో మీ రెండు పార్టీలు ఉమ్మడి పోటీచేసి అధికారంలోకి వచ్చినప్పుడు మీరు కాపాడిన రాష్ట్ర భవిష్యత్తేంటో చెప్పండి? అధికారంలోకి రాగానే మీరు తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. ఒకరినొకరు విమర్శించుకున్నారు. మీది కలహాల కాపురం అని తేలిపోయింది కదా..? అప్పట్లో మోదీగారు మీతో కలిసి పోటీ చేసినా.. ఆ తర్వాత వారు విడిపోయినా.. ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఒకసారి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మరలా ఇప్పుడు కలుస్తామంటున్నారని మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేశారు.

LEAVE A RESPONSE