అభిమానంతో
కూడిన పలకరింపులూ….
ప్రేమగా
కొసరి కొసరి వడ్డింపులతో…
మనుషుల్నీ,
మనసుల్నీ కలిపే
ఆనందాల హరివిల్లు మా ఇల్లు..!!
పదిమంది చేరి
పాత జ్ఞాపకాలను
నెమరువేసుకుంటూ…
కష్టమైనా ,సుఖమైనా,
ఒకరితో
ఒకరు పంచుకుంటూ…
హాయి తెమ్మరలు
ఎదను మీటేలా
ఊరటనూ,
ఉత్సాహాన్ని పొందుతూ
బంధాలు, అనుబంధాలను
ముడివేసే
అనురాగాల పొదరిల్లు మా ఇల్లు..!!
ప్రకృతికి సీమంతమైన
హేమంత రాగాల లోగిలిలో
రంగవల్లికల అందాల నడుమ
కళ్లాపి చల్లిన వాకిలిలో
ప్రేమ ,ఆశలు ,
ఆశయాలు, కష్టాలు
కన్నీళ్ల విలువను తెలిపే …
పెద్దల “అనుభవాల పందిరి”కింద
అత్యద్భుతమైన జీవితాన్ని
పండించే
అద్భుత రసగుళికలను అందించే
మమతల బృందావనం మా ఇల్లు…!!
నలిగల రాధికా రత్న