Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల గుండెల్లో చంద్రబాబు స్థానం సుస్థిరం

– వైసిపి అహంభావులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు
– టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు
జగన్ తన చర్యల ద్వారా తన పతనాన్ని తనే కోరుకుంటున్నాడు. నిన్న జరిగిన అవమానం ప్రీ ప్లాన్డ్ గా జరిగిందే. సెషన్స్ అందుకే పొడిగించినట్లు కనబడుతోంది. అసెంబ్లీలో అడుగడుగునా అవమానించడానికే సెషన్స్ పొడిగించారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి కాదనేది నిన్నటి సంఘటనే సాక్ష్యం.
ఎప్పుడిలాంటి అసభ్య ఘటనలు జరిగినా నాయకుల్లో పశ్చాత్తాపం ఉంటుంది. కానీ ప్రిప్లాన్డ్ కాబట్టే జగన్ ముసిముసిగా నవ్వులతో తనవాళ్లను సమర్ధిస్తూ వికృతానందం పొందారు.
ఈ నీచ ప్రవర్తనకు ప్రజలు వైసిపికి పాతర వేయడం ఖాయం. వైసిపి పతనానికి నిన్నటి దుర్ఘటన అంతిమఘట్టం. ప్రజలు ఓడిస్తారనే భయంతోనే ప్రతిపక్షాన్ని జగన్ టార్గెట్ చేస్తున్నారు. ప్రజల చేతిలో శృంగభంగమే కాదు, కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయం. వీళ్లనుంచి రాష్ట్రాన్ని రక్షించుకోడానికి ప్రజలనుంచి మరో ప్రజాఉద్యమం తథ్యం.
కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలకభూమిక పోషించిన, రాష్ట్రంలో సుదీర్ఘకాలం సిఎంగా చేసిన జాతీయ నాయకుడి కుటుంబాన్ని దూషించడం వైసిపి పతనానికి చివరిమెట్టు.ప్రజాస్వామ్య విలువలు సాక్షాత్తూ సభలోనే పాతర వేసిన వైసిపిని ప్రజాకోర్టులో భూస్థాపితం చేయడం ఖాయం. ఇప్పటికే చాలాచోట్ల ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. డబ్బు, అధికారబలంతో స్థానిక ఎన్నికల్లో భయోత్పాతం సృష్టించినా సాధారణ ఎన్నికల్లో అది సాధ్యంకాదు.
చేసిన తప్పుల వల్లే స్వచ్ఛందంగా ప్రజల ముందుకెళ్లే ధైర్యాన్ని జగన్ కోల్పోయారు.ఇంట్లో మహిళల వ్యక్తిత్వ హననం చేసేముందు తమఇళ్లలోనూ భార్యాపిల్లలు ఉన్నారని గుర్తు లేకపోవడం వైసిపి నీతిమాలిన రాజకీయం. ప్రజాసమస్యలపై దృష్టి వదిలేసి ప్రతిపక్షాలపై దాడులపైనే శ్రద్దపెట్టడం దుష్టనైజం. అవినీతి కుంభకోణాలు, చేతగానితనం కప్పిపెట్టుకోడానికే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజాపక్షమే. పేదల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటం చేస్తుంది. ఎదుటివాళ్లను విమర్శించేముందు తన గతచరిత్ర, తండ్రితాత చరిత్ర, కుటుంబచరిత్ర గుర్తుచేసుకుంటే ఇతరులపై దుర్భాషలకు జగన్ తెగించరు, రెచ్చగొట్టరు.
అదొక ఫాక్షన్ ఫ్యామిలీ. ప్రజాస్వామ్యంపై గౌరవంలేదు. కడపలో ఫాక్షన్ కు ఈ కుటుంబమే కారణం. వీళ్లకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటుందా..?తానే యంగ్ సిఎం అనిచెప్పుకునే జగన్ అంతకన్నా చిన్నవయసులో సిఎంగా చంద్రబాబు రాష్ట్రాభివృద్దికి ఎలా పాటుబడ్డాడో రాష్ట్ర ప్రజలకు విదితమే. యంగ్ సిఎంగా కాదు ఫాక్షన్ సిఎంగా జగన్ చరిత్రలో మిగిలిపోతాడు.
రైతులకు కనీస మద్దతు ధరగాని, విపత్తు పరిహారం గాని అందకుండా చేశారు. లక్షలాది కార్మికుల పొట్టగొట్టారు. పేదల చదువులు కుంటుబడేలా విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారు. యువత ఉపాధిపై దారుణంగా దెబ్బకొట్టారు. ఉద్యోగుల హక్కులను కాలరాశారు. మహిళలకు కనీస భద్రత మృగ్యం చేశారు. అందుకే ఆయావర్గాలన్నీ రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కాయి. వీటన్నింటినుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రతిపక్ష నాయకులపై దుర్భాషలు, అవమానాలు, దాడులకు తెగించారు.
సభలో అధికారపార్టీ అవమానాలతో మనస్తాపానికి గురై బాయ్ కాట్ చేసిన నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరించారు. ఎన్టీఆర్, ఎంజిఆర్, జయలలిత ఉదంతాలే నిదర్శనం. అట్లాగే ఘోరంగా అవమానింపబడి సభకు దూరమైన చంద్రబాబును కూడా రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. హద్దులు మీరిన వైసిపి అహంభావులను చిత్తుగా ఓడించడం ఖాయం.ప్రజల తిరుగుబాటుతో ప్రపంచ చరిత్రలో ఎందరో నియంతలు కాలగర్భంలో కలిశారు. ఈజిప్ట్ లో ముబారక్ కు ఏమైంది..? జర్మనీలో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముస్సోలినీ, సద్దాం హుసేన్, ఇడీ అమీన్, హిట్లర్ ఆలోచనల కలగలిసిన రూపమే జగన్.వైసిపి దుశ్చర్యలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దావానలంలా మారి వైసిపిని ప్రజాకోర్టులో అది దహించివేస్తుంది. ప్రజాస్వామ్య ఉద్యమం ద్వారా ప్రజలను చైతన్యపరిచి ప్రజాస్వామ్యాన్ని కాపాడి, వైసిపిని ఇంటికి పంపించడానికి టిడిపి సిద్ధంగా ఉంది.
మంచికి-చెడుకు, ధర్మానికి- అధర్మానికి, న్యాయానికి- అన్యాయానికి మధ్య జరిగిన ప్రతియుద్ధంలో మంచి, ధర్మం, న్యాయానిదే గెలుపు.అహంకారానికి, గర్వపోతులకు ప్రజల చేతిలో శృంగభంగం తప్పదు.
ఓటమి తప్పించుకోడానికి దుర్యోధనుడు మడుగులో దాక్కున్నా బైటకి పిలిపించి ఓడించిన చరిత్ర చూశాం. అట్లాగే జగన్ రెడ్డి ప్రజలకు ముఖం చూపకుండా దాక్కున్నా బైటకు రప్పించి ఓడించడం ఖాయం.
శిశుపాలుడిని నూరుతప్పుల వరకు శ్రీకృష్ణుడు క్షమించినట్లే జగన్ పట్ల ప్రజలు ఇన్నాళ్లు సహనంగా ఉన్నారు. నిన్నటితో ప్రజల సహనం కూడా అంతరించింది. ప్రజల చేతిలో ఓటమి శిక్షకు జగన్ గ్యాంగ్ సిద్ధంగా ఉండాలి.

LEAVE A RESPONSE