– ప్రస్తుత సి ఆర్ డి ఏ చట్టాల్లో మార్పులు
– నేరుగా ప్రైవేటు సిబ్బంది ఏర్పాటు
అమరావతి రాజధాని నగర పాలన కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా కన్సల్టెన్సీ నియామకం కోసం సిఆర్డిఎ అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. దీని ప్రకారం అమరావతి రాజధాని పరిపాలన కోసం కొత్త చట్టాలను తయారు చేస్తారు.
ప్రస్తుతం ఉన్న సీఆర్డిఎ. చట్టాలను రాజధానికి వీలుగా అవసరమైన విధంగా మార్పులు, చేర్పులు చేయనున్నారు. ఇందులోనే ప్రైవేటు పెట్టబడులను ఆకర్షించడం, పిపిపికి రక్షణ కల్పించేలా చట్టపరమైన నిబంధనలనూ రూపొందించాలని నిర్ణయించారు. రాజధాని నగర ప్రభుత్వం సుస్ధిర ఆర్థిక ప్రగతి కోసం ఏమిచేయాలనే అంశాలనూ రూపొందించే ఫ్రేమ్ వర్కు రూపొందించడంపై సిఆర్డిఎ అధికారులు దృష్టి సాగించారు.
ముఖ్యంగా తొలిదశలో ఆస్తులు ఎన్ని ఉన్నాయి? అప్పులు ఎంత? అనే అంశాలపై స్పష్టమైన నివేదిక తయారు చేయడం ద్వారా అక్కడ వసూలు చేయాల్సిన యూజర్ చార్జీలు, పన్నులు ఎంత నిర్ణయించాలనే అంశంపై ఒక నివేదికను తయారు చేయనున్నారు. ఆస్తిపన్ను. భూమి విలువ పెంపు,ఇతర లెవీలకు సంబంధించి అన్ని రూపాల్లోనూ ఆదాయ మార్గాలను గుర్తించేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.
దీనికోసం నిర్మాణం దశ, నిర్వహణ, సమగ్ర నిర్వహణ వంటి మూడు దశలుగా ప్లానుకు వీలుగా కన్సల్టెన్సీని ఆహ్వానించారు. అలాగే ప్రస్తుతం సీఆర్డిఎ నుంచి రాజధానిగా మార్పునకు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లనూ చేయాలని నిర్ణయించారు. కొత్త నగరంలో ఎప్పటికప్పుడు జరిగే హర్పులపై ముఖ్యంగా ఆదాయ, విద్య, ఉపాధి, మౌలిక సమపాయాల కల్పన, స్వయం సమృద్ధి వంటి వాటిని నిరంతరం పర్యవేక్షించేందుకు సర్వే చేయడం వంటి అంశాలకు వీలుగా నిబంధనలు రూపొందించనున్నారు..
74వ రాజ్యాంగ సవరణ ప్రకారం మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ ఏర్పాటుపైనా నివేదిక తయారు చేయాలని నిర్ణయించారు. ఈ ఏర్పాటులో పట్టణాభి వృద్ధిశాఖ, సిఆర్డిఎ, మెట్రోపాలిటన్ అథారిటీ ఒకదానికొకటి సమన్వయం చేసుకునేలా నూతన ప్రతిపాదనలు ఉండాలని తెలిపారు. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అత్యంత కీలకమైన రాజధాని నగర పాలన హెచ్ ఆర్ పాలసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు.
ఇందులో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని డిప్యూటేషన్, లేదా ఇతర నియామకంతోపాటు, నైపుణ్యం ఉన్న ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవడానికి వీలుగా నిబంధనలు ఉండాలని సూచించారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, రాజధాని సంస్థ మధ్య సమన్వయం కోసం ప్రత్యేక యంత్రాంగాన్నీ నియమించనున్నారు.
– వల్లభనేని సురేష్
అమరావతి రాజధాని సమగ్ర అధ్యానవేత్త, విశ్లేషకులు
9010099208