Home » ‘ఫర్నీచర్ దొంగతనం’ కేసులో జగన్‌పై కేసు?

‘ఫర్నీచర్ దొంగతనం’ కేసులో జగన్‌పై కేసు?

– నాడు కోడెలపై కేసు పెట్టిన జగన్ సర్కారు
– ఖరీదు చెల్లిస్తానన్నా కేసు పెట్టిన వైసీపీ సర్కారు
– ఇప్పుడు అదే కేసులో ఇరుక్కోనున్న జగన్
– జగన్ డబ్బు చెల్లిస్తారంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి
– తాడేపల్లి నివాసంలో 3 కోట్ల 63 లక్షలతో పనులు
– పాత ఫర్నీచర్‌ను స్వాధీనం చేయని జగన్
– ఆ ఫర్నీచర్‌ను పార్టీ ఆఫీసుకు వాడుకుంటున్న వైనం
– జగన్‌పై కేసు తప్పదా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

నీతి నిజాయితీకి చొక్కా లాగూ వేస్తే దాని పేరు జగన్మోహన్‌రెడ్డి. ఆయన జమానాలో ధర్మం నాలుగు పాదాలా.. బాటా షూ వేసుకుని మరీ సాక్సులు లేకుండా నడిచింది. ఆయన ధర్మపాలనలో అవినీతి-అబద్ధం.. జమిలిగా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండేవి. వాళ్ల ఇంట్లో పనిచేసే పాలెగాళ్ల నుంచి.. సాక్షిలో పనిచేసే పాత్రికేయుల వరకూ ‘భారతీ సామ్రాజ్యం’ నుంచే తప్ప, ఫైర్ సర్వీస్ లాంటి సర్కారు ఖజానా నుంచి చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. అమ్మతోడు!

అలాంటి సత్యసంధుడు, సత్యహరిశ్చంద్రుడి కజిన్ బ్రదరయిన జగన్మోహన్‌రెడ్డి ఫర్నీచర్ దొంగిలించారంటే నమ్ముతారా? ఫర్నీచర్‌ను సొంత పార్టీకి వాడుకుంటున్నారంటే నమ్మడం సాధ్యమా? దానికి సంబంధించి కేసు పెడితే, మొన్న ఆయనకు ఓటేసి గెలిపించి.. విశాఖలో హోటళ్లు కూడా లేకుండా చేసి.. విశాఖ బీచ్‌లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్‌రెడ్డిని ఏ-1గా అరెస్టు చేస్తే ఆంధ్రా ప్రజలు సహిస్తారా? దేశంలోనే ధనిక సీఎంగా కీర్తిప్రతిష్ఠలందుకున్న జగన్‌ను ఫర్నీచర్ దొంగ అంటూ కేసు పెడితే మొన్నటి వరకూ ఆయన ఉప్పు తిన్న లబ్థిదారులు నమ్ముతారా?

కానీ నమ్మక తప్పదు. ఎందుకంటే కళ్లెదుట కనిపించే సాక్షాలివి. కొనుగోళ్లకు సంబంధించి సర్కారు ఇచ్చిన ఉత్తర్వులవి. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత, తాడేపల్లి ప్యాలెస్‌ను అధికార నివాసంగా ప్రకటించుకున్నారు. ఆ మేరకు పైన మొదటి అంతస్తులోనే సీఎం పేషీ కూడా ఏర్పాటుచేసుకున్నారు. దానికి సంబంధించి ఫర్నీచర్‌తోపాటు, ఎలక్ట్రికల్ వర్కులు, అల్యూమినియం డోర్లకు కోట్ల రూపాయలు ఖజనా నుంచే ఖర్చు పెట్టారు.

ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఫర్నీచర్‌కు 39 లక్షల రూపాయలు, ఎలక్ట్రికల్ వర్కుకు 3 కోట్ల 63 లక్షలు, సెక్యూరిటీ సెటప్‌కు కోటి 89 లక్షలు, మెయింటెన్స్‌కు కోటి 20 లక్షలు, ప్రజాదర్బార్‌కు 82 లక్షలు, అల్యూమినియం డోర్లకు 72 లక్షలు, టెంపరరీ సెటప్‌కు 22 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.

జగన్ పార్టీ ఓడిన తర్వాత.. ఆయన నివసిస్తున్న తాడేపల్లి ప్యాలెస్‌ను, రాష్ట్ర పార్టీ ఆఫీసుగా మారుస్తున్నారు. అది వారి ఇష్టం. దానిని వ్యతిరేకించకూడదు. ఎందుకంటే అది ఆయన ఇల్లు. ఆయన పార్టీ కాబట్టి! కానీ ఆ పార్టీ ఆఫీసుకు వాడుకునేది సర్కారు సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నీచర్. అది చట్ట విరుద్ధం! మామూలుగా అయితే సీఎం క్యాంపు ఆఫీసులకు సర్కారు సొమ్ములతోనే ఫర్నీచర్ కొనుగోలు చేస్తారు. ఆయన సీఎం పదవి నుంచి వైదొలగిన తర్వాత, తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. లేకపోతే దాని ఖరీదు చెల్లించాలి. గతంలో ఈ పద్ధతులు పాటించిన వారున్నారు.

గతంలో స్పీకర్‌గా పనిచేసిన దివంగత కోడెల శివప్రసాద్.. తన కొడుకు శివరాం కార్యాలయంలో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్‌ను ఉంచారు. తన వద్ద అసెంబ్లీ ఫర్నీచర్ ఉందని, దాని ఖరీదు చెబితే చెల్లిస్తానని ముందుగానే అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. ఇలాంటి సంప్రదాయం గతంలో కూడా ఉందని తన లేఖలో గుర్తు చేశారు. అసలు ఆయన లేఖ రాయకపోతే ఆ విషయం ఎవరికీ తెలిసేది కాదు.

అయినా కోడెలపై కేసు పెట్టి మానసికంగా వేధించారు. ఆ మానసిక వేదనతోపాటు.. కొడుకు-కూతురి అరాచకాలపై వచ్చిన ఆరోపణలతో, రాజకీయాల్లో పులిలా బతికిన కోడెల అవమానకర పరిస్థితిలో, ఆత్మహత్య చేసుకోవడం ఆయన అభిమానులను బాధించింది. రాజకీయాల్లో వారసుల జోక్యం ప్రవేశిస్తే, తండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందనడానికి కోడెల ఉదంతమే ఒక ఉదాహరణ. అది వేరే విషయం.

ఇప్పుడు అచ్చం మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కూడా అదే చేశారు. ఆయనకు సర్కారు ఇచ్చిన ఫర్నీచర్‌ను వెనక్కి ఇవ్వలేదు. దానిని పార్టీ ఆఫీసుకు వాడుకుంటారట. అయితే ఇక్కడే వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కొత్తగా పాత వాదనను..అంటే గతంలో కోడెల వాదననే తెరపైకి తెచ్చారు. సదరు ఫర్నీచర్ ఖరీదు ఎంతో చెబితే, దాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారట. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో మీడియా ఇష్టానుసారం జగన్‌పై నిందలు వేస్తోందని, తెగ బాధపడిపోయారాయన. అయితే.. గతంలో ఇదే ఫర్నీచర్ ‘దొంగతనం కేసులో’ దివంగత కోడెలపై కేసు నమోదు చేసిన వైనం.. ‘కోడెల ఫర్నీచర్ దొంగ’ అంటూ, వైసీపీ అధికార మీడియాలో రాసిన రాతలను లేళ్ల అప్పిరెడ్డి విస్మరించడమే విచిత్రం.

కాగా తాజాగా జగన్‌పై ఫర్నీచర్ దొంగతనం కేసు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగా జగన్‌పై ఏ-1 నిందితుడిగా కేసు నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు.

శత్రు దేశాల భయంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ భారీ కోటలు కట్టుకున్నట్లే, ఆంధ్ర మాజీ సీఎం జగన్ సైతం ప్రజాధనంతో రక్షణ వలయం నిర్మించుకున్నారు. జగన్ కోట వద్ద, డబుల్ లైన్ రహదారి ఆక్రమించి కోటను నిర్మించడం వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డును, జగన్ భద్రతా సిబ్బంది ప్రైవేట్‌ రోడ్డుగా మార్చేశారు.

క్యాంప్‌ ఆఫీసు పరిధిలో 1.5 కి.మీ. రోడ్డుకు రూ.5 కోట్ల వ్యయం నిర్మించగా.. జగన్ భద్రతా సిబ్బంది ఎవరినీ అనుమతించడం లేదు. గతంలో తాను అధికారంలోకి రాగానే అక్రమ కట్టడం అంటూ ప్రజావేదికను కూల్చిన మాజీ ముఖ్యమంత్రి, అధికారం కోల్పోయినా ఇంకా ప్రభుత్వానికి సంబంధించి రాజభోగాలు అనుభవిస్తూనే ఉన్నారు.

ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నిచర్లు, నిర్మించిన రోడ్లను ఇప్పటికీ తన గుప్పిట్లో ఉంచుకుని అధికార కార్యకలాపాలకు వినియోగిస్తున్నాడు. ప్రభుత్వం మారినప్పటికీ తన పంథాను మార్చకుండా తాను ఇంకా అధికారంలోనే ఉన్నాననే భ్రమలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో మాజీ సీఎం ఇంటి, కార్యాలయ అవసరాల కోసం పెట్టిన ఖర్చుల వివరాలను అధికారులు బయటకి తీస్తున్నారు.

ప్రజాధనంతో కట్టిన నిర్మాణాల నుంచే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారు. అప్పటి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచే ప్రస్తుత రాజకీయ భేటీలు జరుగుతున్నాయి. అయితే తాను సీఎంగా ఉన్నప్పడు హోదాను అడ్డుపెట్టుకొని జగన్ క్యాంప్ ఆఫీసు కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయల ఫర్నిచర్, కార్యాలయ సామాగ్రి, ఇంకా మాజీ సీఎం వినియోగిస్తున్నారు. ఇప్పుడు అదే క్యాంప్ ఆఫీసును పార్టీ కార్యాలయంగా మార్చుకోవడంపై అధికార వర్గాల్లో చర్చ మెుదలైంది.

సీఎం హోదాలో వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ నిమిత్తం ఎంత ఖర్చు పెట్టారనే అంశానికి సంబంధించిన జీవోలను అధికారులు వెలికి తీసేపనిలో ఉన్నారు. ఇంటి చుట్టూ ప్రహరీ గోడపై ఇనుప ఫెన్సింగ్ కోసమే కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ ఫార్మర్లు, యూపీఎస్ వ్యవస్థల ఏర్పాటు కోసం దాదాపు 3.63 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలో నిబంధనల పేరుతో అడ్డగోలుగా ప్రజా వేదిక కూల్చేసిన జగన్, అధికారం కోల్పోయిన నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ ఫర్నిచర్ ను వినియోగించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను అతిక్రమించారని తేలితే, రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎం జగన్కు నోటీసులిచ్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply